Varla Ramaiah: అవినాశ్ రెడ్డి అరెస్ట్ కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి ఎవరు?..
ABN , First Publish Date - 2023-05-13T16:17:33+05:30 IST
ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ (Arrest) కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి ఎవరు? ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ (CM Jagan) రెడ్డే కదా? అని టీడీపీ నేత వర్ల రామయ్య (Varla Ramaiah) ప్రశ్నించారు.
అమరావతి: ఎంపీ అవినాశ్ రెడ్డి (Avinash Reddy) అరెస్ట్ (Arrest) కాకుండా అడ్డుకుంటున్న అజ్ఞాతశక్తి ఎవరు? ఆయన ఏపీ ముఖ్యమంత్రి జగన్మోహన్ (CM Jagan) రెడ్డే కదా? అని టీడీపీ పొలిట్ బ్యూరోసభ్యుడు వర్ల రామయ్య (Varla Ramaiah) ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజలు ఇచ్చిన అధికారాన్ని జగన్ అడ్డుపెట్టుకొని, రాష్ట్ర సంక్షేమాన్ని విస్మరించి, అల్లకల్లోలంగా మారిన రైతుల వ్యథలు పట్టించుకోకుండా, తమ్ముడు అవినాశ్ రెడ్డిని రక్షించడమే లక్ష్యంగా ముందుకెళ్తున్నారని, అవినాశ్ అరెస్ట్ ఎప్పుడని నిలదీశారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయకుండా సీబీఐ (CBI) ఎందుకు మీనమేషాలు లెక్కపెడుతోందన్నారు. ‘నిన్ హైడ్రిన్ టెస్ట్’ పూర్తయితే వివేకా రాసినట్టు చెప్పబడుతున్న లేఖపైన అసలు వేలిముద్రలు బయటపడతాయని, ఇంకొంతమంది ముద్దాయిలు వెలుగులోకి వస్తారన్నారు.
వివేకా కూతురు డాక్టర్ సునీత (Dr. Sunitha) ఓ వీరవనితని, చరిత్రలో రాణిరుద్రమ, ఝాన్సీరాణి పోరాటం చేసిన శత్రువుల కంటే పెద్ద శత్రువుతో సునీత చేస్తున్న పోరాటం చరిత్రలో నిలుస్తుందని వర్ల రామయ్య వ్యాఖ్యానించారు. అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేయడంతోనే వివేకాహత్య కేసు ముగిసిపోయినట్టు కాదని, ఇంకా విచారణ చేయాల్సింది చాలా ఉందన్నారు. కుట్ర బయటకు తీయాలని, హూ కిల్డ్ బాబాయ్‌లోని ముద్దాయిలంతా బయటపడాలన్నారు. ప్రజల ధన, మాన, ప్రాణరక్షణ కోసం, ప్రివెన్షన్ అండ్ డిటెన్షన్ ఈ రెండు సూత్రాలపై పోలీస్ శాఖ పనిచేయాలి.. కానీ ఆంధ్రాలో జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత పోలీస్ శాఖ తద్భిన్నంగా పనిచేస్తోందని విమర్శించారు.
2020లో అమెరికాలో జార్జ్ ఫ్లాయిడ్ అనే నల్లజాతీయుణ్ణి చంపిన పోలీస్ అధికారి అలెగ్జాండర్‌కు తాను ఏమీ తీసిపోను అన్నవిధంగా నిన్న కావలి డీఎస్పీ వెంకటరమణ తన రెండు మోకాళ్ల మధ్యలో ఆందోళనచేస్తున్న బీజేపీ కార్యకర్త సురేశ్ తలను నొక్కడం హత్యాయత్నంతో సమానమన్నారు. అమెరికాలో పోలీస్ అధికారి అలెగ్జాండర్‌కు శిక్షపడినట్టే, ఇక్కడ సురేశ్‌పై హత్యాయత్నం చేసిన డీఎస్పీ వెంకటరమణకు శిక్షపడాలని డిమాండ్ చేశారు. కావలి డీఎస్పీ వెంకటరమణను వెంటనే అరెస్ట్ చేసి, దిగజారిపోతున్న మీ ప్రభుత్వ ప్రతిష్టను కొంతైనా కాపాడుకోండి. కొంతమంది పోలీస్ అధికారుల తీరు చాలా ఘోరాతిఘోరంగా ఉందని, వారు చట్టబద్ధంగా వ్యవహరించాలని తెలుగుదేశం పార్టీ హెచ్చరిస్తోందని వర్ల రామయ్య పేర్కొన్నారు.