VS Sampath: ఓట్ల తొలగింపుపై ఎవరైనా అభ్యంతరాలు తెలపొచ్చు
ABN , First Publish Date - 2023-10-01T22:04:36+05:30 IST
ఓట్ల తొలగింపుపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని భారత ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ వి.ఎస్.సంపత్(VS Sampath) వ్యాఖ్యానించారు.
విజయవాడ: ఓట్ల తొలగింపుపై ఎవరైనా అభ్యంతరాలు వ్యక్తం చేయవచ్చని భారత ఎన్నికల కమిషన్ మాజీ చీఫ్ కమిషనర్ వి.ఎస్.సంపత్(VS Sampath) వ్యాఖ్యానించారు. సిటిజన్ ఫర్ డెమోక్రసీ పేరిట వెబ్‌సైట్‌ను ఆదివారం నాడు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘‘ ఓటరు జాబితా ఎన్నికల కమిషన్ వెబ్‌సైట్లో ఉంటుంది. ఓటర్లు తమ ఒటు ఉందో లేదోనని ఎప్పటికప్పుడు తనిఖీ చేసుకోవాలి. వ్యవస్థలో లోపాలు సరిదిద్దేందుకు ఏర్పాట్లు ఉన్నాయి. వాటిని పౌరులు వినియోగించుకోవాలి. ఎన్నికల ప్రక్రియలో టీఎన్ శేషన్ ఎన్నో సంస్కరణలను అమలు చేశారు. ఓటర్ల జాబితాలో లోపాల వల్లే చాలా చోట్ల ఎన్నికలు నిలిచి పోతున్నాయి. ఓట్ల తొలగింపుపై వచ్చిన అభ్యంతరాలను అధికారులు తప్పని సరిగా పరిశీలించాలి. పోలింగ్ స్టేషన్‌కు సంబంధించిన ఓటర్ల జాబితాకు బూత్ లెవల్ ఆఫీసర్ బాధ్యుడుగా ఉంటారు. ఎన్నికల సమయంలో ఫిర్యాదులు వస్తే సీఎస్, డీజీపీ సహా అధికారులను ఎవరినైనా మార్చే అధికారం సీఈసీకి ఉంది. వ్యవస్థలో ఉన్న అవకాశాలన్నింటినీ పౌరులు వినియోగించుకోవాలి. స్వేచ్ఛాయుతంగా ఎన్నికలు జరిగేలా అందరూ ముందుకు రావాలి’’ అని వి.ఎస్.సంపత్ పేర్కొన్నారు.