Nandyala Dist.: లోకేష్ వ్యాఖ్యలు వక్రీకరణ... సోషల్ మీడియాలో వైరల్ ...
ABN , First Publish Date - 2023-04-15T11:36:34+05:30 IST
నంద్యాల జిల్లా: యువగళం పాదయాత్ర పేరుతో రాయలసీమజిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి ట్రోల్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది.
నంద్యాల జిల్లా: యువగళం పాదయాత్ర పేరుతో రాయలసీమజిల్లాలో పర్యటిస్తున్న నారా లోకేష్ చేసిన కొన్ని వ్యాఖ్యలను వైసీపీ నేతలు వక్రీకరించి ట్రోల్ చేయడం రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపింది. టీడీపీ హయాంలో పథకాలన్నింటిని జగన్ రెడ్డి కట్ చేశారని, ఆయన దళితులకు పీకిందేమీలేదని లోకేష్ అన్నారు. అయితే దళితులు పీకిందేమీలేదని లోకేష్ అన్నారని వైసీపీ నేతలు అసత్య ప్రచారం చేస్తున్నారని టీడీపీ ఆరోపించింది. అంతే కాదు లోకేష్ ఏం మాట్లాడారో ఆ వీడియోను టీడీపీ విడుదల చేసింది.
యువగళం పాదయాత్రలో భాగంగా లోకేష్ ఉమ్మడి కర్నూల్ జిల్లాలో పర్యటిస్తున్నారు. నంద్యాల జిల్లా, డోన్ నియోజకవర్గంలోని జక్కసానిపల్లిలో లోకేష్ గురువారం దళితులతో ముఖాముఖి నిర్వహించారు. సమావేశంలో కొందరు విదేశీ విద్యోన్నతి పథకం, అంబేద్కర్ విదేశీ విద్య వంటి పథకాలను జగన్ సర్కార్ రద్దు చేసిందని అందువల్ల ఇబ్బందులు పడుతున్నామంటూ వారు లోకేష్ దృష్టికి తీసుకువచ్చారు. దీనిపై స్పందించిన లోకేశ్.. దళితులను చంపి డోర్ డెలివరీ చేయిస్తున్న జగన్ రెడ్డి దళితుల సంక్షేమానికి ఏం పీకారన్నారు.
విదేశీ విద్యా పథకంలో అంబేద్కర్ పేరు తొలగిస్తే తొలిసారిగా స్పందించింది మంగళగిరిలో లోకేష్ అన్న విషయం గుర్తు పెట్టుకోవాలన్నారు. అదే విధంగా టీడీపీ అధికారంలోకి వస్తే అన్ని పథకాలను కొనసాగిస్తామని ఆయన స్పష్టం చేశారు. లోకేష్ మాటలు ఇలా ఉంటే.. వైసీపీ సొంత మీడియాలో ఆయన మాటలను వక్రీకరించి వేరే విధంగా రాశారని టీడీపీ నేతలు ఆరోపించారు. యువగళం పాదయాత్రలో లోకష్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. దీంతో వైసీపీ మంత్రులు, నేతలు అంబేద్కర్ విగ్రహం సాక్షిగా లోకేష్‌పై విరుచుకుపడ్డారు. లోకేష్ వెంటనే దళితులకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు.
లోకేష్ మాటలను మార్ఫింగ్ చేయడం, సోషల్ మీడియాలో ట్రోల్ చేయడంపై టీడీపీ వర్గాలు విరుచుకుపడుతున్నాయి. లోకేష్ మాట్లాడిన ఒరిజినల్ స్పీచ్‌ను తెలుగుదేశం సోషల్ మీడియాలో వైరల్ చేయడం ప్రారంభించింది. పాదయాత్రకు మంచి స్పందన వస్తుందని అక్కసుతోనే ఇటువంటి చర్యలకు వైసీపీ నేతలు పాల్పడుతున్నారని టీడీపీ నేతలు ఆరోపించారు.