Nara Lokesh: ఎమ్మెల్యే ఆళ్ల.. సీఎం జగన్‌ను ఆదర్శంగా తీసుకున్నారు...
ABN , First Publish Date - 2023-04-18T14:53:07+05:30 IST
కర్నూలు జిల్లా: సహజ వనరుల దోపిడీలో సీఎం జగన్ రెడ్డిని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి ఆదర్శంగా తీసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు.
కర్నూలు జిల్లా: సహజ వనరుల దోపిడీలో సీఎం జగన్ రెడ్డి (CM Jagan)ని మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణా రెడ్డి (Alla Ramakrishna Reddy) ఆదర్శంగా తీసుకున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (Nara Lokesh) అన్నారు. మంగళవారం కర్నూలు జిల్లాలోని దేవనకొండలో యువగళం పాదయాత్ర (Yuvagalam Padayatra) నిర్వహిస్తున్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ జగన్మోహన్ రెడ్డి రుషికొండ (Rushikonda)కు గుండు కొడితే.. ఆళ్ల రామకృష్ణారెడ్డి ఏకంగా ఉండవల్లి కొండ (Undavalli Konda)ను మింగేశారని అన్నారు. ముఖ్యమంత్రి ఇంటికి కూత వేటు దూరంలో ఆళ్ల మైనింగ్ మాఫియా యధేచ్ఛగా అక్రమాలకు పాల్పడుతుందన్నారు. ఉండవల్లి కొండను మాయం చేస్తున్న అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆళ్ల రామకృష్ణారెడ్డి మైనింగ్ మాఫియా బెదిరింపులకు భయపడకుండా పోరాడి కొండపై జరుగుతున్న గ్రావెల్ లూటీని బయటపెట్టిన మంగళగిరి టీడీపీ నాయకులు, కార్యకర్తల్ని నారా లోకేష్ అభినందించారు.
కాగా టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్రకు జనం నీరాజనాలు పలుకుతున్నారు. ఎక్కడికక్కడ ప్రజలు పెద్ద ఎత్తున లోకేష్ పాదయాత్రకు తరలివస్తున్నారు. యువనేతకు తమ సమస్యలు చెప్పుకుంటున్నారు. పాదయాత్ర చేస్తున్న లోకేష్‌కు మహిళలు హారతులు పడుతూ స్వాగతం పలుకుతున్నారు. జగన్ ప్రభుత్వంలో (Janga Government) తాము పడుతున్న బాధలను ప్రజలు లోకేష్‌కు వివరిస్తున్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత అందరి సమస్యలు తీర్చుతామంటూ లోకేష్ పాదయాత్రలో హామీలు ఇస్తున్నారు. ప్రస్తుతం లోకేష్ పాదయాత్ర ఆలూరు నియోజకవర్గంలో కొనసాగుతోంది.
మంగళవారం ఉదయం పల్లెదొడ్డి క్యాంప్ సైట్ నుంచి 74వ రోజు యువగళం పాదయాత్రను నారా లోకేష్ ప్రారంభించారు. ఈ రోజు సాయంత్రం వలగొండ క్రాస్ వద్ద బహిరంగ సభలో లోకేష్ మాట్లాడనున్నారు. పాదయాత్రలో భాగంగా పల్లెదొడ్డి గ్రామంలో మహిళా రైతు నాగమ్మ నిర్వహిస్తున్న గొర్రెల ఫామ్‌ను పరిశీలించారు. రైతు నాగమ్మ, భర్త కృష్ణన్న గౌడ్‌తో మాట్లాడి గొర్రెల పెంపకంలో వారు ఎదుర్కుంటున్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. రెండేళ్లుగా షెడ్ ఏర్పాటు చేసుకొని గొర్రెల ఫామ్ నిర్వహిస్తున్నామని, షెడ్ నిర్మాణానికి రెండున్నర లక్షల ఖర్చు అయ్యిందని తెలిపారు. మొదటి ఏడాది 50 గొర్రెలతో ఫామ్ ప్రారంభించామని చెప్పారు. రెండేళ్లలో రెండు లక్షల నష్టం రావడంతో ప్రస్తుతం 30 గొర్రెలు మాత్రమే పెంచుతున్నామని మహిళా రైతు తెలిపారు. ఏడాదికి మేత, దాణా, మందులు, ఇతర ఖర్చులు సుమారుగా రెండు లక్షలు అవుతుందన్నారు. ఇంత కష్టం చేస్తే రోజు కూలీ మాత్రమే మిగులుతుందని వాపోయారు. ప్రభుత్వం నుంచి షెడ్ నిర్మాణం, మేత, దాణా, మందులు కొనడానికి ఎటువంటి సహాయం, సబ్సిడీలు రావడం లేదు అంటూ మహిళా రైతు నాగమ్మ కన్నీరు పెట్టుకున్నారు.