Lokesh Yuvagalam: 1200 కి.మీ మైలురాయికి చేరిన యువగళం
ABN , First Publish Date - 2023-05-10T12:41:05+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేష్ యువగళం పాదయాత్ర విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో 95వ రోజు పాదయాత్ర మొదలవగా కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది.
కర్నూలు: టీడీపీ యువనేత నారా లోకేష్ (TDP Leader Naralokesh) యువగళం పాదయాత్ర (YuvaGalam Padayatra) విజయవంతంగా దూసుకెళ్తోంది. ఈరోజు కోడుమూరు నియోజకవర్గంలో 95వ రోజు పాదయాత్ర మొదలవగా కాసేపటికే నందికొట్కూరు నియోజకవర్గంలోకి ప్రవేశించింది. కొద్దిదూరం పాదయాత్ర చేయగా అల్లూరులో 1200 కిలోమీటర్ల మైలురాయికి యువగళం చేరుకుంది. ఈ సందర్భంగా మిడుతూరు ఎత్తిపోతల పథకానికి లోకేష్ శిలాఫలకం ఆవిష్కరించారు. అనంతరం లోకేష్ మాట్లాడుతూ... ‘‘జనగళమే యువగళమై మహోజ్వలంగా సాగుతున్న యువగళం పాదయాత్ర ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గం అల్లూరులో 1200 కి.మీ మైలురాయిని చేరుకోవడం ఆనందంగా ఉంది. ఈ సందర్భంగా హంద్రీనీవా నుంచి మిడుతూరు ఎత్తిపోతల పథకానికి శిలాఫలకాన్ని ఆవిష్కరించాను. ఈ ఎత్తిపోతల పథకం ద్వారా మిడుతూరు, కలమండలపాడు, మాదిగుండం, పారమంచాల చెరువులకు నీరు చేరుతుంది. తద్వారా 22వేల ఎకరాలకు సాగునీరు, మిడుతూరు, జూపాడుబంగ్లా మండలాల్లో 60వేలమంది ప్రజలకు తాగునీరు అందుతుంది’’ అంటూ లోకేష్ పేర్కొన్నారు. ఈరోజు నందికొట్కూరు నియోజకవర్గంలో బ్రాహ్మణకొట్కూరు, వడ్డెమాను, అల్లూరు, నందికొట్కూరులో లోకేష్ యువగళం పాదయాత్ర చేయన్నారు.
ముస్లిం మైనారిటీలతో లోకేష్...
అంతకుముందు నారా లోకేష్‌ను ముస్లిం మైనారిటీలు కలిశారు. మైనారిటీలకు జనాభా దామాషా ప్రకారం రిజర్వేషన్ కల్పించాలని కోరారు. గత ప్రభుత్వంలో అమలు చేసిన దుల్హన్ పథకాన్ని పునరుద్ధరించాలన్నారు. పేద ముస్లింలు ఉన్నత విద్యను అభ్యసించ లేకపోతున్నారని.. వారికి ఆర్థిక చేయూతనివ్వాలన్నారు. మైనారిటీల సంక్షేమానికి కేటాయించిన నిధులను వైసీపీ ప్రభుత్వం స్వాహా చేస్తోందని తెలిపారు. గత ప్రభుత్వం ఇచ్చిన రోషిణి, దుకాన్-మకాన్ పథకాలు నేడు రావడం లేదన్నారు. జగన్ అధికారంలోకి వచ్చాక మైనారిటీలపై వేధింపులు అధికమయ్యాయని చెప్పారు. ముస్లింలకు కేజీ టు పీజీ వరకు మైనారిటీ విద్యార్థులకు ఉచిత విద్యనందించాలని కోరారు. పూర్తిగా ప్రభుత్వ ఖర్చుతో హజ్ యాత్రకు పంపించాలన్నారు. టీడీపీ అధికారంలోకి వచ్చాక మైనారిటీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తేవాలని కోరారు.
లోకేష్ స్పందిస్తూ... జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో ఏ వర్గమూ ప్రశాంత జీవనం గడిపే పరిస్థితులు లేవన్నారు. తాలిబాన్ తరహా పాలన కొనసాగిస్తూ మైనారిటీలకు నరకం చూపిస్తున్నారని మండిపడ్డారు. తాజాగా మదనపల్లిలో మైనారిటీ యువకుడు అక్రమ్‌ను పులివెందుల బ్యాచ్ అన్యాయంగా పొట్టనబెట్టుకుందన్నారు. వైసీపీ నాయకులు వేధింపులు తాళలేక అబ్దుల్ సలాం కుటుంబం, మిస్బ ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. మసీదు ఆస్తుల రక్షణ కోసం పోరాడిన ఇబ్రహీంను నర్సరావుపేటలో దారుణంగా నరికిచంపారన్నారు. మైనారిటీల సబ్ ప్లాన్ నిధులు రూ.5,400 కోట్లు దారి మళ్లించి ముస్లింలకు అన్యాయం చేశారన్నారు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే గతంలో అమలు చేసిన పథకాలన్నీ పునరుద్దరిస్తామని హామీ ఇచ్చారు. పూర్తి ప్రభుత్వ ఖర్చులపై పేద ముస్లింలను హజ్ యాత్రకు పంపే ఏర్పాట్లు చేస్తామని లోకేష్ స్పష్టం చేశారు.