LOKESH: పన్నుల్లోనూ ఫస్టే!
ABN , First Publish Date - 2023-03-11T03:09:09+05:30 IST
ప్రస్తుతం మన రాష్ట్రం అప్పుల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల్లో నంబర్‌వన్.. నిత్యావసర సరుకుల ధరల్లోనూ నంబర్‌వన్.. చెత్తపన్నులో నంబర్‌వన్.. ఆర్టీసి చార్జీలు పెంచడంలో నంబర్‌వన్.. ఇంటి పన్నుల్లోనూ అదేస్థానంలో ఉంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు.
నిత్యావసరాల ధరల్లోనూ రాష్ట్రానికి తొలిస్థానం
జగన్ బిల్డప్ బాబాయ్.. ముందు భారీ డైలాగులు కొట్టాడు
సింహం.. సింగిల్‌గా అన్నాడు.. ఇప్పుడు ఒంటరిగా రమ్మంటున్నాడు
బాబు పాలన సన్‌రైజ్ ఏపీ.. జగన్ పాలన ఫినిష్ ఆంధ్రప్రదేశ్
అభివృద్ధి నిల్లు.. గంజాయి ఫుల్లు.. పాదయాత్రలో లోకేశ్ ధ్వజం
మాజీ ఎమ్మెల్యే షాజహాన్‌బాషా టీడీపీలో చేరిక
రాయచోటి, మార్చి 10 (ఆంధ్రజ్యోతి): ‘ప్రస్తుతం మన రాష్ట్రం అప్పుల్లో దేశంలోనే నంబర్‌వన్ స్థానంలో ఉంది. పెట్రోలు, డీజిల్ ధరల్లో నంబర్‌వన్.. నిత్యావసర సరుకుల ధరల్లోనూ నంబర్‌వన్.. చెత్తపన్నులో నంబర్‌వన్.. ఆర్టీసి చార్జీలు పెంచడంలో నంబర్‌వన్.. ఇంటి పన్నుల్లోనూ అదేస్థానంలో ఉంది’ అని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేశ్ అన్నారు. చంద్రబాబు హయాంలో మన రాష్ట్రం పెట్టుబడుల్లో నంబర్‌వన్ స్థానంలో ఉండేదన్నారు. ఉద్యోగాల కల్పనలో, వ్యవసాయాభివృద్దిలో కూడా ప్రథమ స్థానంలో ఉండేదని చెప్పారు. యువగళం పాదయాత్రలో భాగంగా 40వ రోజు శుక్రవారం సాయంత్రం ఆయన అన్నమయ్య జిల్లా మదనపల్లెలోని టీకేఎన్ వెంచర్ అన్నమయ్య నగర్‌లో జరిగిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించారు. చంద్రబాబు పాలన సన్‌రైజ్ ఆంధ్రప్రదేశ్ అయితే.. జగన్ పాలన ఫినిష్ ఆంధ్రప్రదేశ్ అని అన్నారు. చంద్రబాబు పాలనలో సంక్షేమం, అభివృద్ధి జోడెద్దుల బండి అయితే.. జగన్ పాలనలో అభివృద్ధి నిల్లు.. గంజాయి ఫుల్లు అని.. జగన్ గంజాయికి బ్రాండ్ అంబాసిడర్ అని ఎద్దేవా చేశారు. గూగుల్‌లో గంజాయి కేపిటల్ ఆఫ్ ఇండియా అని కొడితే ఆంధ్రప్రదేశ్ అని వస్తుందన్నారు. జగన్ బిల్డప్ బాబాయ్‌లాగా.. ముందు భారీ డైలాగులు కొట్టాడని చెప్పారు. ‘నా వెంట్రుక కూడా ఎవరూ పీకలేరు. సింహం సింగిల్‌గా వస్తుందని అన్నాడు. అయితే యువగళం పాదయాత్రలో యువత, మహిళలు, రైతులు, కార్మికులు, ఉద్యోగులు జగన్ చెత్త పాలనను ఉతికి ఆరేస్తున్నారు. ఆయనకు భయాన్ని పరిచయం చేశారు.
అందుకే ఇప్పుడు ప్రతిపక్షాలు విడివిడిగా పోటీ చేయాలని అడుక్కుంటున్నాడు’ అని విరుచుకుపడ్డారు. జగన్ ఇచ్చే ప్రతి స్కీంలోనూ ఓ స్కాం, ప్రతి హామీలోనూ ఒక స్కాం ఉంటుందని చెప్పారు. అందుకే ఆయన్ను స్కామ్‌మోహన్‌రెడ్డి అని పిలుస్తానన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మంత్రి పెద్దిరెడ్డి కుటుంబం ఆగడాలు ఎక్కువయ్యాయని మండిపడ్డారు. గత నాలుగేళ్లలో ఆయన కుటుంబం పదివేల కోట్ల రూపాయలు అక్రమంగా సంపాదించిందని ఆరోపించారు. మదనపల్లె వైసీపీ ఎమ్మెల్యే నవాజ్‌బాషా అవినీతి అక్రమాలకు అడ్డూఅదుపు లేకుండా పోయిందన్నారు. నాలుగేళ్ల కాలంలో రూ.100 కోట్ల విలువైన 40 ఎకరాలు ప్రభుత్వ, డీకేటీ భూములు ఆక్రమించారని ఆరోపించారు. మదనపల్లె టమోటా మార్కెట్‌ను దత్తత తీసుకుంటానని లోకేశ్ హామీ ఇచ్చారు.
జనప్రభంజనం
40వ రోజు పాదయాత్ర మదనపల్లె మండలం దేవతానగర్ నుంచి ఉదయం 10:30 గంటలకు మొదలై.. అన్నమయ్య సర్కిల్ మీదుగా అమ్మచెరువుమిట్టకు సాగింది. ఈ మార్గాల్లో పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు పెద్దసంఖ్యలో పాల్గొని లోకేశ్‌కు బ్రహ్మరథం పట్టారు. అడుగడుగునా మంగళహారతులు పడుతూ, ఫొటోలు తీసుకుంటూ, సెల్ఫీలు దిగారు. లోకేశ్ శుక్రవారం 9.1 కిలోమీటర్లు నడిచారు. దీంతో ఇప్పటి వరకు పాదయాత్ర 519.6 కి.మీ. సాగింది. మదనపల్లె మాజీ ఎమ్మెల్యే ఎం.షాజహాన్‌బాషా టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. శుక్రవారం మదనపల్లెలో ఆయనకు లోకేశ్ కండువా కప్పి.. మనస్ఫూర్తిగా పార్టీలోకి ఆహ్వానిస్తున్నట్లు ప్రకటించారు.
అన్న క్యాంటీన్ల మూసివేత శాడిజం కాక మరేమిటి?
ఈ రోజు మదనపల్లి నియోజకవర్గం దేవతానగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించాను. ఈ సందర్భంగా మూసివేసి ఉన్న అన్న క్యాంటీన్‌ను చూసి చాలా బాధేసింది. తమిళనాడులో జయలలిత ప్రభుత్వం ప్రవేశపెట్టిన అమ్మ క్యాంటీన్లను స్టాలిన్ సర్కారు యథావిధిగా కొనసాగిస్తూ పేదల ఆకలి తీరుస్తున్నారు. కానీ, రాష్ట్రంలో లక్షలాది మంది ఆకలితీర్చిన అన్నా క్యాంటీన్లను మూసివేయడం జగన్‌రెడ్డి శాడిజానికి అద్దం పట్టడం లేదా..?
పాదయాత్రకు రెండ్రోజులు విరామం
లోకేశ్ పాదయాత్రకు రెండ్రోజులు విరామం ప్రకటించారు. ఎమ్మెల్సీ ఎన్నికల పోలింగ్ ఈనెల 13న జరుగనుంది. శనివారం సాయంత్రం 5గంటల నుంచి పోలింగ్ ముగిసేవరకూ పార్టీల ప్రచారం ఉండరాదని ఆంక్షలు ఉన్నాయి. దీంతో శనివారం సాయంత్రం లోకేశ్ పాదయాత్ర ఆపేస్తారు. ఈ రెండ్రోజులూ క్యాంప్ ప్రదేశంలోని బస్సులోనే గడుపుతారని టీడీపీ వర్గాలు తెలిపాయి. ఈ వ్యవధిలో పార్టీ సమీక్షలు నిర్వహిస్తారు.