Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

ABN , First Publish Date - 2023-04-07T17:46:44+05:30 IST

రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ (Vishwaroop) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం (Amalapuram) అల్లర్ల తర్వాత పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని

Vishwaroop: మంత్రి విశ్వరూప్ సంచలన వ్యాఖ్యలు

కోనసీమ: రవాణా మంత్రి పినిపే విశ్వరూప్ (Vishwaroop) సంచలన వ్యాఖ్యలు చేశారు. అమలాపురం (Amalapuram) అల్లర్ల తర్వాత పోలీసులు అమాయకులను అరెస్ట్ చేశారని, కేవలం వీడియో (Video)లో కనిపించినందుకే పోలీసులు లాక్కుపోయారని విమర్శించారు. అమలాపురం అల్లర్ల కేసులు ఎత్తివేయడం తథ్యమని స్పష్టం చేశారు. అల్లర్ల కేసులు ఎత్తివేయాలని ప్రభుత్వం నిర్ణయించడంతో దళిత సంఘాలు ఆందోళన చేస్తున్నాయని తెలిపారు. అందుకే ఈనెల 14న అంబేద్కర్ జయంతి రోజు కోనసీమ దళిత సంఘాలను సీఎం జగన్ (CM Jagan)దగ్గరికి తీసుకెళ్తున్నామని విశ్వరూప్‌ తెలిపారు.

అమలాపురం అల్లర్ల కేసుల ఎత్తివేత

రాష్ట్రంలో సంచలనం సృష్టించిన అమలాపురం అల్లర్ల ఘటనలో నిందితులపై నమోదైన కేసులను ఎత్తివేయడానికి సీఎం జగన్ అంగీకరించారు. న్యాయపరమైన అంశాలను పరిగణనలోకి తీసుకుని కేసులు ఎత్తివేస్తూ జీవో జారీ చేయాలని సీఎంవో అధికారులను ఆదేశించిన విషయం తెలిసిందే. కోనసీమ జిల్లా (Konaseema District) పేరును డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ కోనసీమ జిల్లాగా మారుస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని నిరసిస్తూ అమలాపురం కేంద్రంగా భారీ ఉద్యమాలు జరిగాయి. గత ఏడాది మే 24న అమలాపురంలో తీవ్ర స్థాయిలో అల్లర్లు జరిగాయి. మంత్రి విశ్వరూప్‌కు చెందిన నివాస గృహానికి, భట్నవిల్లిలో నూతనంగా నిర్మితమవుతున్న ఆయన ఇంటికి, హౌసింగ్‌ బోర్డు కాలనీలో ఉన్న ముమ్మిడివరం ఎమ్మెల్యే పొన్నాడ సతీశ్‌కుమార్‌ ఇంటికి దుండగులు నిప్పంటించారు. పోలీసులతో చోటుచేసుకున్న ఘర్షణలతో రాళ్ల దాడి, బస్సుల దహనం వంటివి కూడా చోటుచేసుకున్నాయి. డీజీపీ రాజేంద్రనాథ్‌రెడ్డి, ఏలూరు రేంజ్‌ డీఐజీ పాలరాజు ఆధ్వర్యంలో వీడియోలు, సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించారు. ఆ కేసుల్లో వివిధ సామాజిక వర్గాలకు చెందిన సుమారు 250 మందిని అరెస్టు చేశారు. అల్లరి మూకలను అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జి, ఫైరింగ్‌ చేశారు.

Updated Date - 2023-04-07T17:46:44+05:30 IST