MLA Quota MLC Elections: కుమారుడి పెళ్లి కారణంగా చివరగా ఓటు వేసిన ఎమ్మెల్యే అప్పలనాయుడు
ABN , First Publish Date - 2023-03-23T16:40:49+05:30 IST
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) 100 శాతం పోలింగ్ నమోదయింది. కుమారుడి పెళ్లి కారణంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు (MLA Appala Naidu) చివరగా ఓటు వేశారు.
అమరావతి: ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో (MLA Quota MLC Elections) 100 శాతం పోలింగ్ నమోదయింది. కుమారుడి పెళ్లి కారణంగా ఎమ్మెల్యే అప్పలనాయుడు (MLA Appala Naidu) చివరగా ఓటు వేశారు. సీఎం జగన్ (CM Jagan), మాజీసీఎం చంద్రబాబు ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి అధికారికంగా ఉన్న బలం 23 మంది, వైసీపీ బలం 151, జనసేనకు ఒక ఎమ్మెల్యేతో కలిపి మొత్తం 175 ఓట్లు పోలయ్యాయి. సాయంత్రం 5 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభిస్తారు. టీడీపీ తరపున బీసీ మహిళా అభ్యర్థిగా పంచుమర్తి అనురాధ (Panchumarthi Anuradha) పోటీలో ఉన్నారు. టీడీపీ ఒక స్థానానికి మాత్రమే పోటీచేస్తోంది. సాంకేతికంగా ఆ పార్టీకి 23 స్థానాలు ఉన్నప్పటికీ.. ఎమ్మెల్యేలు వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) (గన్నవరం), కరణం బలరాం (చీరాల), మద్దాళి గిరి (గుంటూరు పశ్చిమ), వాసుపల్లి గణేశ్‌కుమార్ (విశాఖ దక్షిణం) వైసీపీలోకి ఫిరాయించారు. దీంతో టీడీపీకి 19 సీట్లు మాత్రమే ఇప్పుడు ఉన్నాయి. టీడీపీ పోటీ చేసే అవకాశం లేదని, ఈ ఏడు సీట్లను ఏకగ్రీవంగా గెలుచుకుంటామని వైసీపీ నాయకత్వం మొదట భావించింది. కానీ ప్రతిపక్షం అనూహ్యంగా విజయవాడ మాజీ మేయర్ పంచుమర్తి అనూరాధను పోటీలో నిలిపింది.
వైసీపీలో ఇద్దరు ఎమ్మెల్యేలు ఆనం రామనారాయణరెడ్డి (వెంకటగిరి), కోటంరెడ్డి శ్రీధర్‌రెడ్డి (నెల్లూరు రూరల్) తిరుగుబాటు చేయడం టీడీపీ ఆశలకు ఊపిరి పోసింది. వైసీపీ నుంచి మరొక్క ఎమ్మెల్యే ఓటు వేస్తే ఆ పార్టీ అభ్యర్థి గెలుపొందే అవకాశం ఉంది. అదే జరిగితే వైసీపీ నిలబెట్టిన ఏడుగురు అభ్యర్థుల్లో ఎవరో ఒకరు ఓడిపోతారు. వైసీపీకి బలం లేకపోయినా ఏడో అభ్యర్ధిని పోటీ పెట్టడంపై పార్టీలోనే భిన్నస్వరాలు వినిపిస్తున్నాయి. పార్టీలో రోజురోజుకు పెరుగుతున్న అసంతృప్తితో ఎమ్మెల్యేలు డీవియేట్ అయ్యారా? అనే ఆందోళనలో వైసీపీ నేతలున్నారు. 8వ ఎమ్మెల్సీ అభ్యర్థి గెలుపుపై ఏపీ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. ఇప్పటికే మూడు పట్టభద్ర ఎమ్మెల్సీ స్థానాల ఎన్నికల్లో పరాజయం వైసీపీ నాయకత్వానికి మింగుడుపడడం లేదు. ప్రజాభిప్రాయం టీడీపీకి సానుకూలంగా ఉండడం చూసి.. తమపై ఇంత వ్యతిరేకత ఉందనుకోలేదని అంతర్గతంగా వాపోతోంది. క్షేత్ర స్థాయి రాజకీయ పరిస్థితిని స్వయంగా చూస్తున్న శాసనసభ్యులు కూడా ఇప్పుడు ఎమ్మెల్యే కోటా ఎన్నికల్లో టీడీపీ వైపు మొగ్గుచూపుతారేమోనన్న భయం ప్రభుత్వ పెద్దల్లో కనిపిస్తోంది.