Nadendla Manohar: అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం రూ. 743 కోట్లు దోచుకుంది
ABN , First Publish Date - 2023-10-20T18:44:07+05:30 IST
అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్లు దోచుకుంది. విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగున్నాయి. ఆలోచన విధానం లేని ప్రభుత్వం వల్ల పేద విద్యార్ధులు నష్టపోతున్నారు.
అమరావతి: జగన్ సర్కారుపై జనసేన నేత నాదెండ్ల మనోహర్ విమర్శలు గుప్పించారు.
"అమ్మఒడి పేరుతో జగన్ ప్రభుత్వం 743 కోట్లు దోచుకుంది. విద్యాశాఖలో అనేక అవకతవకలు జరుగున్నాయి. ఆలోచన విధానం లేని ప్రభుత్వం వల్ల పేద విద్యార్ధులు నష్టపోతున్నారు. ప్రైవేటు విద్యాసంస్థలు, ఇతరదేశాల సంస్థలతో ఒప్పందాలు చేసుకుంటున్నారు. ప్రజల డబ్బును ఇష్టం వచ్చినట్లు దుర్వినియోగం చేస్తున్నారు. టీచర్లకు జీతాలు ఇవ్వని ఈ ప్రభుత్వం.. విదేశీ సంస్థలతో ఒప్పందాల పేరుతో కోట్లు దోచి పెడుతున్నారు. టోఫెల్ పరీక్ష గురించి మేము చాలా స్పష్టంగా చెప్పాం. ఇంగ్లీష్ భాషలో పట్టు ఉందా లేదా అని తెలుసుకుందుకు టోఫెల్ టెస్ట్ పెడతారు. కానీ మన రాష్ట్ర ప్రభుత్వం మూడో తరగతి నుంచి పదో తరగతి వరకు విద్యార్దులకు టోఫెల్ పరీక్షపై ఒప్పందాలు చేసుకున్నారు. ఈ ఒప్పందాలు సరికాదని మేము చెబుతుంటే.. విద్యాశాఖ మంత్రి ఏదో చెబుతారు. ఫీజులు కట్టాక, టెస్ట్ లు రాశాక టోఫెల్ సర్టిఫికేట్లు వల్ల ప్రయోజనం ఏమిటి. ఈ ఒప్పందంలో రెండు ఇబ్బందికరమైన క్లాజెస్ పొందుపరిచారు. ఎక్స్ క్లూజివిటీ పేరుతో ఈ సంస్థ ద్వారానే టీచర్ల ట్రైనింగ్ కు అంట. సింగపూర్ డాలర్లలో చెల్లించేలా చేయడం ద్వారా రూ. 1500 కోట్లు వెచ్చిస్తున్నారు. భారతదేశంలో ఉన్న చట్టాలు వర్తించకూడదని నిబంధన పెట్టుకున్నారు. 44 వేల 381ప్రభుత్వ పాఠశాలలు, పదివేలు ప్రైవేటు పాఠశాలలు, 970ఎయిడెడ్ పాఠశాలల్లో ఈ విధానం అమలు చేస్తాం అంటున్నారు. ఫైనాన్స్, న్యాయశాఖ వ్యతిరేకించినా.. సీఎం ఈ విధానాన్ని రుద్దటానికి కారణం ఏమిటి. ఇంగ్లీష్ మీడియం మాత్రమే కరెక్టు కాదని జాతీయ విద్యా విధానం చెప్పిన తర్వాత కూడా జగన్ ముందుకు సాగడం వింతగా ఉంది. ఎవరి కోసం ఇలా ప్రజా సొమ్ములను దుర్వినియోగం చేస్తున్నారో చెప్పాలి." అని ఆయన డిమాండ్ చేశారు.
"ఈ అంశాలపై విద్యాశాఖ మంత్రి ఇంతవరకు స్పందించలేదు. ఇంగ్లీష్ విద్యను మేము పేదవాళ్లకు ఇస్తున్నట్లు ప్రకటనలతో సరిపెడతారా. అసలు ఈ అగ్రిమెంట్ల గురించి మంత్రికి తెలుసా. ప్రభుత్వంపైనా, మీ శాఖపైనా మీకు పట్టు లేదు కాబట్టే ఈ పరిస్థితి. సర్వే చేసిన లెక్కల ప్రకారం సెప్టెంబర్ 22 నుంచి అక్టోబర్ 2023 వరకు చూస్తే 4,48,136 మంది విద్యార్దులు ప్రభుత్వ పాఠశాలల నుంచి తప్పుకున్నారు. మరి అమ్మఒడి, విద్యాకానుకలు ఎవరికిచ్చారు. అమ్మఒడి 42, 61,965 మందికి ఇచ్చామని చెప్పారు. విద్యా కానుకలో 39,95,992 లక్షల మందికే ఇచ్చారని చెప్పారు. ఈ రెండింటిలో ఇంత వ్యత్సాసం ఎలా వచ్చిందో చెప్పాలి. ప్రభుత్వం చేసిన సర్వేలో జి.ఇ.ర్ లో 37,50,293 విద్యార్దులు ప్రభుత్వ పాఠశాల్లో ఉన్నారని చెప్పారు. అమ్మఒడి 42 లక్షలమందికి పైగా ఎలా ఇచ్చారు.. ఎవరికి ఇచ్చారు. అంటే 743 కోట్ల రూపాయలు ఎవరి చేతుల్లోకి పోయాయో చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. ఏదో హడావుడిగా ప్రెస్ మీట్ పెట్టి మమ్మలను తిడితే ఉపయోగం ఏమిటి. వీటిని పరిశీలిస్తే.. ఏదో పెద్ద కుంభకోణం జరిగినట్లు అర్దం అవుతుంది. కేబినెట్ నిర్ణయం అయితే.. విద్యాశాఖ మంత్రిగా ఏం చేస్తున్నారు. అమ్మఒడిలో పెద్ద స్కాం జరిగిందనేది వాస్తవం." అని మనోహర్ విమర్శలు అన్నారు.