Chandrababu Arrest: చంద్రబాబు సెక్యూరిటీ గురించే నా భయం: భువనేశ్వరి
ABN , First Publish Date - 2023-09-12T17:09:43+05:30 IST
స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడాడు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.
రాజమండ్రి: స్కిల్ డెవలప్‌మెంట్ స్కీమ్ అక్రమ కేసులో జ్యుడీషియల్ రిమాండ్‌పై రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉన్న మాజీ సీఎం, టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడితో ఆయన సతీమణి నారా భువనేశ్వరి, కొడుకు లోకేష్, కోడలు బ్రహ్మణి ములాఖత్ అయ్యారు. దాదాపు 40 నిమిషాలపాటు మాట్లాడారు. అనంతరం జైలు నుంచి బయటకొచ్చాక భువనేశ్వరి మీడియాతో మాట్లాడారు.
చంద్రబాబు సెక్యూరిటీ గురించి నాకు భయం
రాజమండ్రి జైలులో చంద్రబాబు సెక్యూరిటీ గురించే తన భయమని నారా భువనేశ్వరి ఆందోళన వ్యక్తం చేశారు. చంద్రబాబుకు సరైన వసతులు లేవని, చన్నీళ్లతోనే స్నానం చేయాల్సి వస్తోందని వాపోయారు. పొద్దున్నుంచి రాత్రి వరకు ఆంధ్రప్రదేశ్ అభివృద్ది గురించే చంద్రబాబు మాట్లాడేవారని, దేశంలో ఏపీ నెంబర్1గా ఉండాలని కోరుకునేవారని అన్నారు. రాష్ట్రం కోసం ఆయన జీవితాన్ని ధారపోశారన్నారు. ఎప్పుడైనా కుటుంబం గురించి మాట్లాడాలన్నా తనకు ప్రజలే ముఖ్యమని చెప్పేవారని భువనేశ్వరి అన్నారు.
ప్రజలకు, టీడీపీ కేడర్‌కు ఒకటే చెబుతున్నా...
‘‘ ప్రజలకు, టీడీపీ కేడర్‌కు ఒకటే చెబుతున్నా.. తెలుగుదేశం పార్టీని నందమూరి తారక రామారావు గారు నిర్మించారు. అది ఎక్కడికీ వెళ్లదు. ఈ కుటుంబం ఎప్పుడూ ప్రజల కోసం, కేడర్ కోసం పోరాడి నిలుస్తుంది. అది మా కుటుంబం తరపు నుంచి నేను హామీ ఇస్తున్నా’’ అని భువనేశ్వరి అన్నారు. తనకు ప్రజలే ముఖ్యమని చంద్రబాబు ఎప్పుడూ చెప్పేవారని, ఎప్పుడూ ప్రజల కోసమే ఆలోచించారని అన్నారు. అలాంటి వ్యక్తిని అక్రమ కేసులో అరెస్ట్ చేశారని భావోద్వేగానికి గురయ్యారు. తమ కుటుంబానికి ఇది చాలా కష్టకాలమని వ్యాఖ్యానించారు. ఏపీని నంబర్ 1గా నిలబెట్టాలని చంద్రబాబు తన జీవితాన్ని ధారపోశారని వ్యాఖ్యానించారు. ములాఖత్‌లోనూ ఆయన ప్రజల గురించే మాట్లాడారని చెప్పారు.
ప్రజలను ఒకటే కోరుతున్నా....
‘‘ ప్రజలందరినీ ఒకటే కోరుతున్నాను.. మీ స్వేచ్ఛ కోసం, మీ హక్కు కోసం పోరాడే మనిషిని ఈ విధంగా తీసుకెళ్లి.. ఏమీ లేని కేసులో పెట్టడంపై అందరూ ఆలోచించాలి. అందరూ బయటకొచ్చి మీ హక్కు కోసం మీరు పోరాడాలి. ఆయనకు సహకరించాలి’’ అని పిలుపునిచ్చారు. జైలు నుంచి బయటకొస్తుంటే తనలో ఒక భాగం అక్కడ వదిలేసి వచ్చినట్టు అనిపించిందని ఆమె భావోద్వేగానికి గురయ్యారు. భువనేశ్వరి మీడియాతో మాట్లాడుతుండగా పక్కనే నారా లోకేష్, నారా బ్రాహ్మణి అక్కడ ఉన్నారు.