Nara Lokesh: రేపు ఢిల్లీలో లోకేష్ ఒక రోజు నిరాహారదీక్ష
ABN , First Publish Date - 2023-10-01T10:03:21+05:30 IST
అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం (రేపు) ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నిర్ణయించారు.
ఢిల్లీ: అక్రమ కేసులు, అరెస్టులకు నిరసనగా టీడీపీ (TDP) జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ సోమవారం (రేపు) ఢిల్లీ వేదికగా ఒక రోజు నిరాహార దీక్ష చేపట్టనున్నారు. గాంధీ జయంతి సందర్భంగా అక్రమ అరెస్ట్‌కు నిరసనగా ఈ దీక్ష చేయాలని టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన సతీమణి భువనేశ్వరి నిర్ణయించారు. దీంతో చంద్రబాబు, భువనేశ్వరిల దీక్షలకు మద్దతుగా ఢిల్లీలో నిరాహార దీక్ష చేపట్టాలని లోకేష్ నిర్ణయించారు. టీడీపీ ఎంపీ కనకమేడల నివాసంలో లోకేశ్ దీక్షకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ దీక్షలో టీడీపీ ఎంపీలు పాల్గొనబోతున్నారు.
రేపు జైల్లో చంద్రబాబు దీక్ష
టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు తనను నిర్భంధించిన రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో గాంధీ జయంతి రోజున ఒక రోజు నిరసన దీక్ష చేపట్టనున్నారు. తనకు జరిగిన అన్యాయంపై ఉదయం నుంచి సాయంత్రం వరకూ దీక్షలో కూర్చుని నిరసన వ్యక్తం చేస్తారు. టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు ఈ విషయాన్ని వెల్లడించారు. గాంధీ జయంతి రోజు జైల్లో దీక్ష చేయాలని చంద్రబాబును కోరామని, ఆయన అంగీకరించారని తెలిపారు. అదే రోజున ఆయన సతీమణి భువనేశ్వరి రాజమహేంద్రవరంలో ఒకరోజు దీక్ష చేస్తారని ఆయన వెల్లడించారు. ఇందుకు సంఘీభావంగా రాష్ట్రంలోని అన్ని నియోజకవర్గాల్లో దీక్షలు చేపట్టాలని, ప్రజలు, పార్టీ నాయకులు పాల్గొనాలని విజ్ఞప్తి చేశారు. చంద్రబాబు అరెస్టును నిరసిస్తూ సోమవారం సాయంత్రం 7 గంటలకు ఐదు నిమిషాల పాటు ఇంట్లోని లైట్లన్నీ ఆర్పేసి కొవ్వొత్తులతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టబోతున్నామని తెలిపారు.