Nara Lokesh: ఆ రోజే పరిశ్రమలు మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తాయి
ABN , First Publish Date - 2023-02-24T19:43:57+05:30 IST
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి (YS Jaganmohan Reddy)పై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి, ఏపీ మాజీ మంత్రి నారా లోకేష్ (Nara Lokesh) ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. జగన్ ఓడిపోయిన రోజు వెళ్లిపోయిన పరిశ్రమలు మళ్లీ పరిగెత్తుకుంటూ వస్తాయని లోకేష్ చెప్పారు. ప్రైవేటు పెట్టుబడులకు రాయితీలు ఇస్తామని, పెద్ద ఎత్తున పరిశ్రమలు వచ్చేలా చేస్తామన్నారు. శాంతి భద్రతలు బాగుంటేనే పెట్టుబడులు వస్తాయని, రాజకీయ కక్షతో ప్రతిపక్షాలపై దాడులు చేస్తున్నారని, కక్ష సాధింపునకు చూపే శ్రద్ధలో కొంత అభివృద్ధిపైన చూపితే పరిశ్రమలు వస్తాయని లోకేష్ తెలిపారు. అయితే వారి తీరు వల్ల అనేక పరిశ్రమలు వెళ్లిపోయాయని లోకేష్ విమర్శించారు.
ప్రభుత్వ, ప్రైవేటు, స్వయం ఉపాధి ఈ మూడు కలిసి కట్టుగా వెళ్తేనే రాష్ట్రంలో నిరుద్యోగ సమస్య పరిష్కారం అవుతుందని, టీడీపీ హయాంలో 40వేల పరిశ్రమలు, 6 లక్షల ఉద్యోగాలు కల్పించామని చెప్పారు. 32 వేల మందికి డీఎస్సీ ద్వారా ఉద్యోగాలు కల్పించామని, సులభ రుణాలతో స్వయం ఉపాధి కల్పించామన్నారు. 35 లక్షల మందికి ఉద్యోగాల కల్పనకు పరిశ్రమలతో ఒప్పందం కుదుర్చుకున్నామని లోకేష్ అన్నారు. జాబ్ నోటిఫికేషన్స్ ఇచ్చి ఖాళీలు అన్నీ అయిదు సంవత్సరాల్లో భర్తీ చేస్తామని తెలిపారు.
కార్పొరేషన్ ద్వారా వంద మందికి ఉద్యోగాలు కల్పించి పారిశ్రామిక వేత్తలుగా తీర్చిదిద్దుతామని, మహిళా సాధికారికత ఇంట్లో మొదలవ్వాలన్నారు. తమ ఇంట్లో మహిళలు గౌరవిస్తామని, మహిళలను గౌరవించాలని మన మనసులో నుంచి రావాలన్నారు. రాజకీయాల్లోనూ, పారిశ్రామిక వేత్తలుగానూ మహిళలను ప్రోత్సహించామని, ఇకపై కూడా ప్రోత్సహిస్తామని లోకేష్ వెల్లడించారు. గాలికి వచ్చే వారు గాలికే కొట్టుకుపోతారని, దొంగల చుట్టూ దొంగలు, రౌడీషీటర్ల చుట్టూ రౌడీషీటర్లు ఉంటారని, సమాజంలో మార్పు కోసం యువత కలిసి రావాలన్నారు. తిరుమలలో పింక్ డైమండ్ కొట్టేసినట్టు ఆరోపణలు చేసిన వారు ఈ నాలుగు సంవత్సరాల్లో ఏం చేశారని, ప్రజలందరూ ఆరోపణలు చేయటం సులభమని, తాను చిత్తశుద్ధితో పని చేశానని, ఏ నాడు తప్పు చేయలేదని లోకేష్ వెల్లడించారు.
అన్న క్యాంటీన్లను మూసేయటం బాధాకరమని, టీడీపీ అధికారంలోకి రాగానే మొదటి వంద రోజుల్లోనే అన్న క్యాంటీన్లను తెరుస్తామని, పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గిస్తామని లోకేష్ హామీ ఇచ్చారు. ఎలక్ట్రానిక్ హబ్‌గా తిరుపతి ఉంటుందని, ఇదే చంద్రబాబు కల అని, మరో సెన్ జెన్గా తిరుపతి రూపొందుతుందని లోకేష్ అన్నారు. ఉపాధికి నాణ్యమైన విద్య కోసం ఏడాది లోపు సిలబస్ మార్పు చేస్తామని, క్రీడల్లో తెలుగువారు విజేతలు కావటానికి తిరుపతిలో స్పోర్ట్స్ యూనివర్శిటీ తెస్తామని లోకేష్ హామీ ఇచ్చారు.
ఈ వార్తలు కూడా చదవండి
పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్‌పై నారా లోకేష్ ఆసక్తికర వ్యాఖ్యలు