Purandeswari: ఇస్రో కృషి విశ్వవ్యాప్తమైంది..
ABN , First Publish Date - 2023-07-14T16:45:11+05:30 IST
అమరావతి: భారత దేశం గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్‌ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. అది విజయవంతం కావడంతో ...
అమరావతి: భారత దేశం (India) గర్వించే విధంగా చంద్రయాన్-3 రాకెట్ (Chandrayaan-3 Rocket)ను నెల్లూరు జిల్లా, శ్రీహరికోట నుంచి శుక్రవారం మధ్యాహ్నం 2:35 గంటలకు శాస్త్రవేత్తలు నింగిలోకి ప్రయోగించారు. అది విజయవంతం కావడంతో ఆంధప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి (Daggubati Purandheswari) ఇస్రో శాస్త్రవేత్తలకు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చంద్రయాన్-3 రాకెట్ ప్రయోగం విజయవంతం కావడం భారతీయులందరికీ గర్వ కారణమన్నారు. అంతరిక్ష చరిత్రలో భారత పతాకం మరోసారి రెపరెపలాడిందన్నారు. ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 ప్రయోగం విజయవంతం వెనుక శాస్త్ర వేత్తల కృషి ఉందన్నారు. ఇస్రో కృషి విశ్వవ్యాప్తం అయిందని, భారతీయులుగా మనందరికీ గర్వకారణమైన ఈ అద్భుత క్షణాన ఇస్రోతో పాటు వారికి అండగా నిలిచిన అందరికీ దగ్గుబాటి పురంధేశ్వరి మరోసారి అభినందనలు తెలిపారు.
షార్ రాకెట్ ప్రయోగ కేంద్రం (Shaar Rocket Launch Center) రెండవ లాంచ్ ప్యాడ్ నుంచి, ఎల్వీఎం-3 బాహుబలి రాకెట్ నిప్పులు చెరుగుతూ నింగిలోకి దూసుకెళ్లింది. ప్రయోగాన్ని వీక్షించేందుకు పెద్ద సంఖ్యలో ప్రజలు షార్‌కు తరలి వచ్చారు. చంద్రయాన్-2లో జరిగిన తప్పిదాలు ఈసారి జరగకుండా ఉండేందుకు శాస్త్రవేత్తలు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. చంద్రుని దక్షిణ ధ్రువంపై ఎవరూ చూడని నిగూఢ రహస్యాలను ఛేదించే చంద్రయాన్-3 ప్రయోగాన్ని శుక్రవారం ప్రయోగించారు.
ఈ రాకెట్ ద్వారా 3,900 కిలోల బరువున్న చంద్రయాన్-3 పేలోడ్‌ను రోదసీలోకి పంపారు. రాకెట్ నుంచి విడిపోయాక వ్యోమనౌకను భూకక్ష్య నుంచి చంద్రుని కక్ష్య వరకూ మోసుకెళ్లే ప్రొపల్షన్ మాడ్యూల్, అక్కడి నుంచి చంద్రునిపై దిగిన తర్వాత పరిశోధనలు చేసేందుకు విక్రమ్ ల్యాండర్, ఉపరితలంపై తిరుగుతూ పరిశోధనలు చేపట్టే ప్రగ్యాన్ రోవర్ చంద్రయాన్-3లో ఉన్నాయి.