Pattabhi Ram: పట్టాభిని చిత్రహింసలు పెట్టిన పోలీసులు.. చేతికి తీవ్ర గాయం
ABN , First Publish Date - 2023-02-21T16:54:02+05:30 IST
టీడీపీ జాతీయ కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరాం (Pattabhi Ram)ను గన్నవరం కోర్టులో పోలీసులు హాజరపర్చారు. సోమవారం నుంచి పట్టాభి ఆచూకి తెలియకపోవడంతో...
గన్నవరం: టీడీపీ (TDP) జాతీయ కార్యదర్శి కొమ్మారెడ్డి పట్టాభిరాంను (Pattabhi Ram) పోలీసులు గన్నవరం కోర్టులో హాజరపర్చారు. సోమవారం నుంచి పట్టాభి ఆచూకి తెలియకపోవడంతో టీడీపీ (TDP) నేతలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనకు దిగిన విషయం తెలిసిందే. అటు పట్టాభి కుటుంబ సభ్యులు కూడా ఆందోళన చెందారు. చివరికి నాటకీయ పరిణామాల తర్వాత ఆయనను గన్నవరం కోర్టు (Gannavaram Court)లో హాజరుపర్చారు. నిన్ననే పట్టాభిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, ఆయనను చిత్రహింసలకు గురిచేస్తున్నారని పట్టాభి సతీమణి చందన అనుమానించారు. ఆమె అనుమానమే నిజమైంది. పట్టాభిని పోలీసులు చిత్రహింసలకు గురిచేశారు. ఆయన చేతికి తీవ్ర గాయమైంది. ఈ గాయాలను ఆయన మీడియాకు చూపించారు.
కాగా పట్టాభి అరెస్ట్‌ను పోలీసులు గోప్యంగా ఉంచారు. దీంతో టీడీపీ శ్రేణుల్లో, ఆయన కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. సాయంత్రం 6 గంటలకు ఆయన్ను గన్నవరం జాతీయ రహదారిపై పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ సమయంలోనే వైసీపీ మూకలు ఆయనపై దాడికి తెగబడ్డాయి. ఆయన కారును ధ్వంసం చేశాయి. అదే కారులో ఉన్న పట్టాభి డ్రైవర్, పీఏ, గన్‌మెన్‌ను దించివేసి.. పోలీసులు ఆయన్ను తీసుకెళ్లారు. ఫోన్‌ను స్విచాఫ్ చేశారు. రాత్రి 11 గంటలైనా ఆయన్ను ఎక్కడకు తీసుకెళ్లారో చెప్పలేదు. తన భర్తను ఏమైనా చేస్తారేమోనని పట్టాభి భార్య చందన ఆందోళన వ్యక్తం చేశారు. ఏమైనా జరిగితే సీఎం జగన్ (CM Jagan), డీజీపీదే బాధ్యతని కన్నీటిపర్యంతమయ్యారు. ముఖ్యమంత్రి, వైసీపీ నేతల అవినీతిపై పోరాడుతున్న తన భర్తను కావాలనే వేధిస్తున్నారని, ఇది కక్షసాధింపు చర్యని ఆగ్రహం వ్యక్తం చేశారు.
పట్టాభి, మరో 16మందిపై హత్యాయత్నం కేసు
గన్నవరం టీడీపీ కార్యాలయం ఘటనలో బాధితులపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ సహా వివిధ సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు. వైసీపీ నేతల ఫిర్యాదు మేరకు 60 మందికిపైగా టీడీపీ నేతలు, ఇతరుల పేరిట కేసులు నమోదు చేశారు. అలాగే గన్నవరం టీడీపీ నేతలు దొంతు చిన్నా, దొంతు రాణి సహా మరో 30 మందికిపైగా టీడీపీ శ్రేణులపై హత్యాయత్నం, ఎస్సీ, ఎస్టీ, అట్రాసిటీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. 143, 147, 341, 333, 353, 307, 448, 143, 147, 506, 509 r/w 149 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. పట్టాభి, మరో 16మందిపై హత్యాయత్నం, ఎస్సీ ఎస్టీ, అట్రాసిటీ కేసులు నమోదు అయ్యాయి. బోడె ప్రసాద్‌తో పాటు మరో 11 మందిపై 353, 143, 147, 149 సెక్షన్ల కింద పోలీసులు కేసులు నమోదు చేశారు.