Pawan Kalyan: కోనసీమలో పవన్ కల్యాణ్ పర్యటన.. పంటనష్టపోయిన రైతులకు పరామర్శ..

ABN , First Publish Date - 2023-05-10T18:17:51+05:30 IST

కోనసీమ జిల్లా (Konaseema district) అవిడిరేవులో బుధవారం సాయంత్రం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటించనున్నారు.

Pawan Kalyan: కోనసీమలో పవన్ కల్యాణ్ పర్యటన.. పంటనష్టపోయిన రైతులకు పరామర్శ..

కోనసీమ: కోనసీమ జిల్లా (Konaseema district) అవిడిరేవులో బుధవారం సాయంత్రం జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ (Pawan Kalyan) పర్యటించనున్నారు. అకాల వర్షాలతో దెబ్బతిన్న పంటలను పవన్ పరిశీలించనున్నారని స్థానిక కార్యకర్తలు తెలిపారు. పంటనష్టపోయిన రైతులను పవన్ కల్యాణ్ పరామర్శించనున్నారని జనసేన నేతలు చెప్పారు. పి గన్నవరం మండలం పప్పులవారిపాలెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. రైతులను పరామర్శించేందుకు పవన్‌కళ్యాణ్ వస్తుండగా పవన్ ఫ్లెక్సీకి పూలదండలను వేస్తున్న కార్యకర్తలు, అభిమానులను పోలీసులు అడ్డుకున్నారు. పోలీసులతో జనసైనికులు వాగ్వాదానికి దిగారు. దీంతో అక్కడ కాసేపు ఉద్రిక్తత వాతావరణం నెలకొంది.

అకాల వర్షాలు, ప్రభుత్వ అసంబద్ధ విధానాలతో తీవ్రంగా నష్టపోయిన రైతులను పరామర్శించడానికి, పాడైన పంటలు చూసి, రైతుల సమస్యలు విని ప్రభుత్వంపై ఒత్తిడి తేవడానికిజనసేన పార్టీ అధినేత పవన్‌ కల్యాణ్‌ బుధవారం తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల్లో పర్యటిస్తారని జనసేన పార్టీ ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లా అధ్యక్షుడు కందుల దుర్గేష్‌ వెల్లడించారు. ప్రభుత్వానికి, మంత్రులు, ఎమ్మెల్యేలకు రైతుల పట్ల కనీసం సానుభూతి లేదని విమర్శించారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా ఎక్కడా మంత్రి కానీ, ఎమ్మెల్యే కానీ బాసటగా నిలుస్తామని చెప్పడంలేదని, పైగా ఆరుగాలం శ్రమించిన రైతు ఏదైనా బాధలో అడిగితే బూతులు మాట్లాడుతున్నారన్నారు. వైసీపీ ప్రభుత్వం గద్దె దిగే రోజులు దగ్గర పడ్డాయని, అందరం కలసి ఈ ప్రభుత్వాన్ని కచ్చితంగా ఇంటికి పంపుదాం అని పేర్కొన్నారు. పర్యటన అనంతరం రైతులను ఆదుకోవడం ఎలా అనేదానిపై పవన్‌ కల్యాణ్‌ కార్యాచరణ ప్రకటిస్తారన్నారు.

Updated Date - 2023-05-10T18:19:52+05:30 IST