Payyavula Keshav: ఏపీ ప్రభుత్వం మరో భారీ స్కాంకు పాల్పడిందంటూ పయ్యావుల కేశవన్ సంచలన ఆరోపణలు
ABN , First Publish Date - 2023-07-13T17:19:22+05:30 IST
ఏపీ ప్రభుత్వంపై (AP GOVT) ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ (TDP) ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శలు గుప్పించారు.
అమరావతి: ఏపీ ప్రభుత్వంపై (AP GOVT) ఉరవకొండ నియోజకవర్గం టీడీపీ (TDP) ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ (Payyavula Keshav) విమర్శలు గుప్పించారు. ఏపీ ప్రభుత్వం మరో భారీ స్కాంకు పాల్పడిందని, రూ. 900 కోట్ల నిధులు పక్కదారి పట్టాయంటూ ఆయన సంచలన ఆరోపణలు చేశారు.
"రాయలసీమ ఇరిగేషన్ ప్రాజెక్టుల పేరుతో భారీ దోపిడీకి తెర లేపారు. రాయలసీమ కరవు నివారణ కార్పోరేషన్ పేరుతో ప్రభుత్వ గ్యారెంటీతో అప్పులు చేశారు. ఆ రుణానికి సంబంధించిన డబ్బులు నేరుగా ప్రైవేట్ కంపెనీల ఖాతాల్లోకి వెళ్లింది. కార్పోరేషన్ అకౌంట్లకు రాకుండా నేరుగా కాంట్రాక్టుల సంస్థకు ఆ డబ్బులు వెళ్లాయి. సుమారు రూ. 900 కోట్ల డబ్బులు దారిమళ్లాయి." అని టీడీపీ ఎమ్మెల్యే ఆరోపించారు.
"దేశ చరిత్రలో ఏ రాష్ట్రంలో జరగని విధంగా నిధుల దోపిడీ జరిగింది. దీనిపై సీబీఐ విచారణ చేపట్టాలి. ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ నిమిత్తం రుణం తీసుకున్నారు. ఎలక్ట్రో మెకానికల్ వర్క్స్ జరిగాయా..? లేవా..? ఈ స్కాంలో పీఎఫ్సీ, ఆర్ఈసీలోని కొందరు భాగస్వాములయ్యారు. తీసుకున్న రుణానికి చెల్లింపులు జరిపేస్తున్నారు. 29-03-2023లో బ్యాంక్ గ్యారెంటీ ఇస్తూ గెజిట్ జారీ చేస్తే.. మూడు రోజుల్లో రుణం ఇచ్చేశారు." అని టీడీపీ ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ అన్నారు.