AP Politics: గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-07-15T19:27:15+05:30 IST
గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని తాను ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు. కులంతో పాటు తన కుటుంబాన్ని కూడా కొందరు దూషిస్తున్నారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు.
ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh)లో అధికార పార్టీ వైసీపీ(YSRCP) నేతలు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. జగన్ పాలన పట్ల తీవ్రస్థాయిలో విమర్శలు వస్తుండటంతో ఆ పార్టీ నేతలు ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఈ నేపథ్యంలో గిద్దలూరు వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు (Anna Rambabu) సంచలన వ్యాఖ్యలు చేశారు. సొంత పార్టీ నేతలపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. రాబోయే ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అని తాను ఆలోచిస్తున్నట్లు ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు. దీంతో ఆయన వ్యాఖ్యలపై ఇప్పుడు సోషల్ మీడియా(Social Media)లో హాట్ టాపిక్‌గా చర్చ నడుస్తోంది.
కంభంలో జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో వైసీపీ ఎమ్మెల్యే అన్నా రాంబాబు మాట్లాడారు. తాను రాజకీయాల్లోకి వచ్చి ఆస్తులు పోగొట్టుకున్నట్లు ఆయన అన్నారు. అంతేకాకుండా రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత చాలా మందితో మాటలు పడుతున్నానని.. అందుకే రాజకీయాలు మానుకోవాలని తన మనసు చెప్తోందని ఎమ్మెల్యే తెలిపారు. దీంతో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన పోటీ చేసే అవకాశాలు లేవని వైసీపీ వర్గాలు భావిస్తున్నాయి. గిద్దలూరు నియోజకవర్గంలో రెడ్డి సామాజిక వర్గం నుంచి ఎమ్మెల్యే అన్నా రాంబాబుకు తీవ్ర వ్యతిరేకత ఎదురవుతోందని.. వచ్చే ఎన్నికల్లో పోటీ చేసి డబ్బులు పోగొట్టుకోవడం కంటే పోటీ చేయకపోవడం బెటర్ అని ఆయన భావిస్తున్నట్లు తెలుస్తోంది.
ఇది కూడా చదవండి: YSRCP: వైసీపీలో ముసలం.. విశాఖలో బలహీనపడుతున్న పార్టీ
గత ఎన్నికల్లో గిద్దలూరు నియోజకవర్గంలో వైసీపీకి 81వేల ఓట్లకు పైగా మెజారిటీ వచ్చిందని.. దీని వల్ల చాలా మంది నేతలు పోటీ పడేందుకు వస్తున్నారని.. ఈ పరిణామం వల్ల పార్టీకి నష్టం జరుగుతోందని ఎమ్మెల్యే అన్నా రాంబాబు వ్యాఖ్యానించారు. కులంతో పాటు తన కుటుంబాన్ని కూడా కొందరు దూషిస్తున్నారంటూ ఆయన భావోద్వేగానికి గురయ్యారు. రెడ్డి కులానికి తాను వ్యతిరేకమని ముద్ర వేసి కొందరు తనపై బురద జల్లుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయాల్లో ఇంకా కొనసాగి అనవసరమైన ఆరోపణలు ఎదుర్కోవడం తనకు ఇష్టం లేదని ఎమ్మెల్యే అన్నా రాంబాబు అన్నారు. అటు వచ్చే ఎన్నికల్లో వైసీపీ అధిష్టానం గిద్దలూరు టిక్కెట్‌ను రెడ్డి సామాజిక వర్గానికి కేటాయించనుందని జోరుగా ప్రచారం జరుగుతోంది.