Balineni Srinivas: వైసీపీకి షాక్ ఇచ్చిన బాలినేని శ్రీనివాస్

ABN , First Publish Date - 2023-04-29T12:48:51+05:30 IST

వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీకి గట్టి షాక్ ఇచ్చారు.

Balineni Srinivas: వైసీపీకి షాక్ ఇచ్చిన బాలినేని శ్రీనివాస్

ప్రకాశం: వైసీపీ అధిష్టానంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న ఒంగోలు ఎమ్మెల్యే, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ పార్టీకి (Former Minister Balineni Srinivas) గట్టి షాక్ ఇచ్చారు. వైసీపీ రీజినల్ కో- ఆర్డినేటర్ (YCP Regional Coordinator) పదవికి బాలినేని రాజీనామా చేశారు. రాజీనామా లేఖను పార్టీ కార్యాలయానికి పంపించినట్లు తెలుస్తోంది. మంత్రి పదవి నుంచి బాలినేనిని తప్పించిన జగన్ (AP CM Jagan).. ఆయనను ప్రస్తుతం చిత్తూరు, నెల్లూరు, తిరుపతి జిల్లాల వైసీపీ సమన్వయ కర్తగా నియమించారు. అయితే జిల్లాకు చెందిన ఆదిమూలపు సురేష్‌‌కు (Adimulapu Suresh).. జగన్ కేబినెట్‌లో రెండో సారి చోటు దక్కింది. దీనిపై బాలినేని ఆగ్రహంతో ఉన్నారు. అలాగే తనకు వ్యతిరేకంగా పార్టీలో కొంతమంది పనిచేస్తున్నారని బహిరంగంగానే వ్యాఖ్యానించారు. ఇటీవల మార్కాపురంలో సీఎం జగన్ మోహన్‌రెడ్డి సభ వద్ద పోలీసులు తనను అడ్డుకోవడంపై బాలినేని ఆగ్రహం వ్యక్తం చేశారు. చివరకు ముఖ్యమంత్రి స్వయంగా ఫోన్‌ చేస్తే తప్ప బాలినేని వేదికపైకి రాలేదు. ప్రోటోకాల్ ఇష్యూ నుంచి పార్టీ అధిష్టానంపై బాలినేని గుర్రుగా ఉన్నారు.

ప్రకాశం జిల్లా రాజకీయాల్లో సీనియర్ నేత, వైఎస్ జగన్‌కు దగ్గరి బంధువైన బాలినేని.. వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు నుంచి జగన్‌తో ఉన్నారు. కాంగ్రెస్ పార్టీలో (Congress Party) ఉన్న సమయంలో మంత్రి పదవిని కూడా త్యాగం చేసి జగన్ పార్టీలో చేరారు. ఒంగోలులో జరిగిన ఉప ఎన్నికల్లో వైసీపీ తరుపున మొదటి సారి ఎమ్మెల్యేగా గెలుపొందారు. అప్పటి నుంచి జగన్ వెంటే ఉంటూ వచ్చారు. 2019లో వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బాలినేని మంత్రి పదవి చేపట్టారు. కానీ మూడేళ్లు తిరిగే సరికి ఆయనను జగన్ పక్కనపెట్టేశారు. అదే సమయంలో జిల్లాలో మంత్రిగా ప్రాతినిధ్యం వహిస్తున్న ఆదిమూలపు సురేష్‌ను మరోసారి మంత్రిగా కొనసాగించారు. అయితే జిల్లాలో ఉన్న ఇద్దరు మంత్రుల్లో ఒకరిని తొలగించి మరొకరిని కొనసాగించడం వల్ల ప్రజల్లో తప్పుడు సంకేతాలు వెళతాయని అప్పట్లోనే జగన్‌కు బాలినేని వివరించారు. అయినప్పటికీ బాలినేని మాటలను పట్టించుకోని జగన్.. మంత్రిపదవి నుంచి బాలినేని తొలగించి.. ఆదిమూలపు సురేష్‌ను పురపాలక శాఖ మంత్రిగా కొనసాగించారు. దీంతో అప్పటి నుంచి జిల్లాలో ప్రొటోకాల్ విషయంలో బాలినేని తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. ఇటీవల పరుచూరి నియోజకవర్గ ఇన్‌చార్జ్ నియామకం విషయంలో బాలినేని చెప్పిన సూచనలు పట్టించుకోని పరిస్థితి. అయితే మంత్రి పదవి నుంచి బాలినేనిని తొలగించడం, ఆపై మార్కాపురంలో ప్రోటోకాల్ విషయంలో అసంతృప్తితో ఉన్న బాలినేని ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. అయితే జిల్లాలో ముఖ్యమైన లీడర్‌గా ఉన్న బాలినేని... వైసీపీ రీజనల్ కో ఆర్డినేటర్ పదవికి రాజీనామా చేయడం.. జిల్లా రాజకీయాలతో పాటు వైసీపీలో కలకలం రేపుతోంది.

Updated Date - 2023-04-29T12:57:06+05:30 IST