Tirumala: టీటీడీ చైర్మన్‌ పరిష్కార సూచన జోక్‌గా ఎందుకు మారిందంటే..

ABN , First Publish Date - 2023-08-17T15:37:33+05:30 IST

టీటీడీ ప్రకటించిన మనిషికో కర్ర ఒక జోక్‌గా మారిపోయి వైరల్‌ అయ్యింది. ఒక వేళ సీరియస్‌గా తీసుకున్నా ఇది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీన్ని అమలు చేయాలంటే వేల సంఖ్యలో కర్రలు సేకరించాలి. వాటికోసం అడవి మీద పడాలి. అలిపిరిలో భక్తులకు ఇచ్చే కర్రలను మళ్ళీ తిరుమల దివ్యారామం వద్ద కలెక్ట్‌ చేసుకోవాలి. వాటిని వాహనాల్లో మళ్ళీ అలిపిరికి తరలించాలి. మధ్యలో భక్తులు కర్రలు పారవేయడం, విరిచేయడం చేస్తే పైకి వెళ్ళేసరికి కర్రల సంఖ్య తగ్గుతుంది.

Tirumala: టీటీడీ చైర్మన్‌ పరిష్కార సూచన జోక్‌గా ఎందుకు మారిందంటే..

‘‘చిరుతతో కర్రసాము చేసి గెలవడానికి అలిపిరి వద్ద ఉచిత శిక్షణా తరగతులు ఆగస్టు 20 నుంచీ ప్రారంభం.. ఆసక్తి కలిగిన వారు చిరుత పులిని వెంట తెచ్చుకోవాలి...కర్ర ఉచితం... భక్తులు ఈ సదుపాయం వినియోగించుకో ప్రార్థన!’’ చిరుత దాడులను ఎదుర్కొనేందుకు భక్తులకు కర్రలు పంపిణీ చేస్తామన్న ప్రకటనపై సామాజిక మాధ్యమాల్లో వెల్లువెత్తుతున్న జోకుల్లో ఇదొకటి.

తిరుపతి (ఆంధ్రజ్యోతి): తిరుమలకు వెళ్ళే అలిపిరి, శ్రీవారి మెట్టు నడక దారుల్లో భక్తులపై చిరుత దాడులను అరికట్టేందుకు శాశ్వత చర్యలు తీసుకోవడంపై దృష్టి పెట్టాల్సింది పోయి నడిచే ప్రతి భక్తుడికీ ఒక కర్రను ఇస్తామంటూ టీటీడీ కొత్త చైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్న వెంటనే భూమన కరుణాకర రెడ్డి చేసిన ప్రకటన అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ తర్వాత మనిషికో కర్ర ఒక జోక్‌గా మారిపోయి వైరల్‌ అయ్యింది. ఒక వేళ సీరియ్‌సగా తీసుకున్నా ఇది సాధ్యమేనా అనే ప్రశ్న వినిపిస్తోంది. దీన్ని అమలు చేయాలంటే వేల సంఖ్యలో కర్రలు సేకరించాలి. వాటికోసం అడవి మీద పడాలి. అలిపిరిలో భక్తులకు ఇచ్చే కర్రలను మళ్ళీ తిరుమల దివ్యారామం వద్ద కలెక్ట్‌ చేసుకోవాలి. వాటిని వాహనాల్లో మళ్ళీ అలిపిరికి తరలించాలి. మధ్యలో భక్తులు కర్రలు పారవేయడం, విరిచేయడం చేస్తే పైకి వెళ్ళేసరికి కర్రల సంఖ్య తగ్గుతుంది. మళ్లీ కొత్త కర్రల కోసం చెట్ల కొమ్మలు నరకాలి. ఇవన్నీ ఆలోచించే భూమన ఈ మాట అన్నారా అని అందరూ ఆశ్చర్యపోతున్నారు. చేతుల్లో కర్రలుంటే నడక దారిలో భక్తుల నడుమ చిన్నపాటి వాగ్వాదాలు జరిగినా ఘర్షణలకు దారితీసే ప్రమాదముంటుందన్న ఆందోళనా వ్యక్తమవుతోంది.

శాశ్వత చర్యలు వదిలి కర్రల పంపిణీతో సరి!

రాత్రింబవళ్ళు తేడా లేకుండా ఎన్నో శతాబ్దాలుగా భక్తులు నడక దారులను ఉపయోగిస్తున్నారు. ఆధునిక కాలంలో క్రూర మృగాల దాడుల్లో భక్తులు చనిపోయినట్టు ఇంతవరకూ ఆధారాల్లేవు. ఆ తరహా దాడులు ఇటీవలే మొదలయ్యాయి. భక్తుల రాకపోకలపై ఆంక్షలను ఎవరూ సమర్థించరు. సురక్షితంగా భక్తులు రాకపోకలు సాగించే పరిస్థితులను టీటీడీ కల్పించాలన్న డిమాండ్‌ అన్ని వర్గాల నుంచీ వినిపిస్తోంది. అయితే శాశ్వత చర్యలను గాలికొదిలి, భక్తులకు కర్రలు పంపిణీ చేయాలన్న టీటీడీ నిర్ణయం అపహాస్యం పాలవుతోంది.


నడక దారికి చేరువగా ఎందుకు వస్తున్నాయ్‌?

అలిపిరి నుంచీ తిరుమల వెళ్ళే నడక దారిలో చిరుతలు, ఎలుగుబంట్లు, అడవి పందుల సంచారం గణనీయంగా పెరిగిన సంగతి తెలిసిందే. మెట్లకు కాస్త దూరంలో అటూ ఇటూ కనిపించి భక్తులకు కనువిందు చేసే క్రూర జంతువులు ఇపుడు భక్తులపై దాడి చేసే పరిస్థితి వచ్చింది. దీనికి కారణాలు అనేకం. భద్రత విషయంలో టీటీడీ వైఫల్యాలతో పాటు కాలినడకన వెళ్ళే భక్తుల తప్పిదాలూ వున్నాయి. అలిపిరి నుంచీ తిరుమలకు మెట్లదారి ఎనిమిది కిలోమీటర్లు వుంటే అందులో నాలుగు కిలోమీటర్లు మాత్రమే జంతువులు మెట్ల దారి మీదుగా అటూఇటూ రాకపోకలు సాగించే వీలుంది. ఈ ప్రాంతంలో ఇదివరకూ జింకల పార్కు వుండేది. మెట్లదారిలో వెళ్ళే భక్తులు జింకలకు పండ్ల ముక్కలు తినిపించడం అలవాటైంది. దానికోసం పార్కులోని జింకలన్నీ మెట్లను ఆనుకుని వున్న ఇనుప కంచె వద్దే తిష్ట వేసేవి. తర్వాత పార్కు తొలగించినా భక్తులిచ్చే ఆహారానికి అలవాటు పడిన జింకలు అడవి లోతట్టు ప్రాంతాలకు వెళ్ళకుండా మెట్ల మార్గం వద్దే సంచరిస్తున్నాయి. భక్తులు పడేసే ఆహార వ్యర్థాల కోసం జింకలతో పాటు అడవి పందులు కూడా చేరుతున్నాయి. వీటికోసం చిరుతలు వస్తున్నాయి. ఇదీ సమస్యకు మూలం.

తప్పు భక్తులది కాదు

జింకలకు ఆహారం పెట్టకూడదన్న అవగాహన భక్తులకు వుండదు. పైగా అదో జీవకారుణ్యం అని కూడా అనుకుంటారు. సెల్ఫీల కోసం సరదా పడతారు. అయితే అవగాహన కల్పించి నియంత్రించాల్సిన బాధ్యత టీటీడీది. ఆ ప్రయత్నం సరిగా జరగడం లేదు. ఈ ప్రాంతంలో పులులు తిరుగుతుంటాయని నడక దారిలో తరచూ మైకుల్లో హెచ్చరించడం, గుంపులుగానే తిరగాలనీ, పిల్లల్ని విడిగా నడవనివ్వరాదనీ పదే పదే ఎందుకు హెచ్చరికలు చేయరో ఆర్ధం కాదు. ఒక బిడ్డ బలయ్యాక ఇప్పుడు హడావుడి చేస్తున్నారు. గతంలో కౌశిక్‌ సంఘటనలోనూ అంతే. వారం తర్వాత అప్రమత్తం చేసే పనులేవీ కొనసాగలేదు. మనిషిని చూసి బెదిరే చిరుతలకే ఇంత భయాందోళనకర వాతావరణం నెలకొంటోంది. పెద్దపులి జాడలు ఈ అడవుల్లో కనిపించాయని నిర్ధారణ అయ్యింది. మరి పెద్దపులి ఎదురైతే ఏం చేస్తారు? కర్రపుల్లను చూసి పులి భయపడుతుందా?

ఏం చేయచ్చు?

తిరుమల అడవులు వన్యప్రాణులకు అనాదిగా ఆవాసాలు. వాటి మానాన వాటిని బతకనివ్వాలి. అయితే భక్తులకు ప్రమాదం లేకుండా చర్యలు తీసుకోవాలి. అందుకు టీటీడీ కొన్ని చర్యలు తీసుకోవచ్చు.

* వన్యప్రాణులు తరచూ సంచరించే నడక దారిలోని నాలుగు కిలోమీటర్ల ప్రాంతంలో భద్రతా సిబ్బంది సంఖ్యను బాగా పెంచాలి.

* ఆ ప్రాంతంలో నడకదారికి అటూ ఇటూ అడవిలోకి శక్తిమంతమైన ఫ్లడ్‌లైట్లను వేయచ్చు.

* ఆ నాలుగు కిలోమీటర్ల దూరం అడవిలో వంద మీటర్ల దూరం దాకా నైట్‌విజన్‌ ఉన్న సీసీ కెమెరాలను ఏర్పాటు చేసి కంట్రోల్‌ రూంలో నిరంతరం పర్యవేక్షించవచ్చు. ఆ పరిధిలో ఎక్కడ క్రూర జంతువు కనిపించినా వెంటనే ఆ ప్రాంతంలోని భద్రతా సిబ్బందిని హెచ్చరించవచ్చు.

* తిండి పదార్ధాలను భక్తులు పడేయకుండా చూడడం అన్నింటికన్నా ముఖ్యం. పోగైన చెత్తను ఎప్పటికప్పుడు తరలించేయాలి.

* జింకలకు ఆహారం పెట్టకుండా నిరోధించాలి.

* మెట్లదారికి ఇరువైపులా వున్న టాయిలెట్లు, తాగునీటి కొళాయిలను కవర్‌ చేస్తూ మెట్ల దారికి కంచె వేయడం చాలావరకూ ప్రమాదాన్ని నివారిస్తుంది.

* జంతువుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా నాలుగు కిలోమీటర్ల పొడవునా కొన్ని అండర్‌ పాస్‌లు నిర్మించడం ముఖ్యం.

Updated Date - 2023-08-17T15:37:36+05:30 IST