Atchannaidu: ఆ పనులు వైసీపీ పే టెమ్ బ్యాచ్‌కు అలవాటే..

ABN , First Publish Date - 2023-06-02T08:11:20+05:30 IST

అమరావతి: యువనేత నారా లోకేష్‌పై కోడి గుడ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోడి గుడ్లు విసరడం..

Atchannaidu: ఆ పనులు వైసీపీ పే టెమ్ బ్యాచ్‌కు అలవాటే..

అమరావతి: యువనేత నారా లోకేష్‌ (Nara Lokesh)పై కోడి గుడ్ల దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఈ సందర్బంగా ఆయన ఇక్కడ మీడియాతో మాట్లాడుతూ కోడి గుడ్లు విసరడం.. కోడి కత్తితో పొడవడం వైసీపీ (YCP) పే టెమ్ బ్యాచ్‌కు అలవాటేనని అన్నారు. యువగళం పాదయాత్ర జన ప్రభంజనం చూసి జగన్‌కు సెంట్రల్ ఏసీలో ఉన్నా చెమటలు పడుతున్నాయన్నారు. అందుకే అల్లరి మూకల్ని రెచ్చగొట్టి పాదయాత్రకు అడ్డంకులు సృష్టిస్తున్నారని మండిపడ్డారు. ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి ప్రోద్బలంతోనే ఈ దాడి జరిగిందని ఆరోపించారు. లోకేష్‌పై కోడిగుడ్లు విసిరిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.

కాగా ప్రొద్దుటూరులో వైసీపీ కార్యకర్తలు బరితెగించారు. పాదయాత్ర చేస్తున్న లోకేశ్‌పై వైసీపీ మూకలు కోడిగుడ్లతో దాడి చేయడం గురువారం రాత్రి తీవ్ర ఉద్రిక్తతకు దారి తీసింది. శివాలయం సెంటరులో బహిరంగసభ అనంతరం ఆయన మైదుకూరు రోడ్డులోని ఆర్టీసీ బస్టాండు, కొత్తపల్లి బైపాస్‌ మీదుగా కొత్తపల్లి పీఎన్‌ఆర్‌ ఎస్టేట్‌ వద్ద విడిదికేంద్రానికి బయలుదేరారు. మార్గమధ్యంలో జనాలను పలకరిస్తూ.. వారి సమస్యలు ఆలకిస్తూ కొత్తపల్లి రిలయన్స్‌ పెట్రోలుబంకు సమీపంలోని ఓ దుకాణంలోకి వెళ్లారు. అక్కడ బజ్జీలు తిని డబ్బులు ఇస్తుండగా ఓ వైసీపీ కార్యకర్త లోకేశ్‌పై గుడ్డు విసిరారు. అది బద్వేలు టీడీపీ నేత రితీశ్‌కుమార్‌రెడ్డిని, లోకేశ్‌ను తాకి అంగడి యజమానిపై పడింది. ఈ సంఘటన ఉద్రిక్తతకు దారి తీసింది. వెంటనే అతడిని టీడీపీ కార్యకర్తలు పట్టుకుని పోలీసులకు అప్పజెప్పారు. ఈ ఘటనపై సీఐ రాజారెడ్డిని లోకేశ్‌ ప్రశ్నించారు. మాపై దాడులు జరిగితే ఏం చేస్తున్నారని అడిగారు. మీరు ఫ్లెక్సీలు చించారంటూ సీఐ రాజారెడ్డి మాట్లాడడంతో లోకేశ్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘పాదయాత్రకు అనుమతి తీసుకున్నాం. మూడ్రోజులుగా వైసీపీవారే రెచ్చగొట్టేలా ఫ్లెక్సీలు కడుతుంటే మీరేం చేస్తున్నారు? భద్రత కల్పించాల్సింది పోయి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తారా? మీ కథ తేలుస్తా’ అని హెచ్చరించారు. తర్వాత కోడిగుడ్డు విసిరిన వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. లోకేశ్‌ అక్కడే కాసేపు బైఠాయించి రాత్రి 10.30 గంటలకు విడిది కేంద్రానికి చేరుకున్నారు.

Updated Date - 2023-06-02T08:11:20+05:30 IST