Share News

Atchannaidu: రైలు ప్రమాదం.. బాధితులకు టీడీపీ అండ

ABN , First Publish Date - 2023-10-30T13:12:07+05:30 IST

అమరావతి: విజయనగరం జిల్లా, కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటన చాలా బాధాకరమని, బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు అన్నారు.

Atchannaidu: రైలు ప్రమాదం.. బాధితులకు టీడీపీ అండ

అమరావతి: విజయనగరం జిల్లా, కంటకాపల్లి దగ్గర జరిగిన రైలు ప్రమాద ఘటన (Train Accident) చాలా బాధాకరమని, బాధితులకు తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు (Atchannaidu) అన్నారు. ఈ సందర్భంగా సోమవారం ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడుతూ సహాయక చర్యల్లో పాల్గొనేందుకు రెండు టీడీపీ (TDP) బృందాలను ఏర్పాటు చేశామని, క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి మెరుగైన వైద్యం అందేలా చర్యలు తీసుకుంటామన్నారు. మృతుల కుటుంబాలను టీడీపీ బృందం సభ్యులు పరామర్శించి అండగా నిలుస్తారన్నారు. ఇప్పటికే తెలుగుదేశం పార్టీ శ్రేణులు సహాయక కార్యక్రమాల్లో పాల్గొంటున్నాయని అచ్చెన్నాయుడు స్పష్టం చేశారు.

విజయనగరం జిల్లాలో ఆదివారం రాత్రి ఘోర రైలు ప్రమాదం సంభవించింది. కొత్తవలస మండలం కంటకాపల్లి- జామి మండలం అలమండ మధ్యలో సిగ్నల్‌ లేక ఆగి ఉన్న పలాస ప్యాసింజర్‌ను 7గంటల సమయంలో విశాఖ నుంచి వస్తున్న రాయగడ ప్యాసింజర్‌ ట్రైను వెనుక నుంచి బలంగా ఢీకొంది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. 60 మందికి పైగా గాయాలపాలయ్యారు. ప్రమాదంలో పలాస ట్రైను గార్డు బోగి, దీనికి ముందున్న మహిళల బోగి అలాగే ఢీ కొట్టిన రాయగడ ట్రైను ఇంజన్‌, దీని వెనక ఉన్న బోగి దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని విజయనగరం జిల్లా కేంద్రాసుపత్రికి రాత్రి 8.30 గంటల సమయంలో తరలించారు. మృతదేహాలను విశాఖ కేజీహెచ్‌కు తరలించి.. చిన్న, చిన్న గాయాలైన వారిని విజయనగరం తీసుకొచ్చారు. విషమంగా వున్న వారిని సైతం విశాఖకే తరలిస్తున్నారు. ఘటనపై కలెక్టర్‌ నాగలక్ష్మి అధికారులను అప్రమత్తం చేశారు. ఈ ఘటనతో చీపురుపల్లి రైల్వేస్టేషన్‌ వద్ద రాత్రి కోణార్క్‌ ఎక్స్‌ప్రెస్‌ను చాలా సేపు నిలిపివేశారు.

ప్రమాద స్థలికి ఒకవైపు మామిడి తోటలు, చెరువు... మరో పక్క వరి పొలాలు ఉన్నాయి. రాత్రి సమయం కావడంతో సహాయక చర్యలు చేపట్టేందుకు స్థానిక యువత, ప్రభుత్వ యంత్రాంగం చాలా ప్రయాస పడాల్సి వచ్చింది. ప్రమాదం జరిగాక తొలుత అలమండ, కుద్దిపాలెం, అలమండ సంత, భీమాళి గ్రామాలకు చెందిన స్థానికులు పరుగున వచ్చారు. క్షతగాత్రులను బయటకు తీసుకువచ్చారు. ఆందోళనతో వున్నవారికి సపర్యలు చేశారు. ఇంతలో రైల్వే పోలీస్‌లు, రిజర్వడ్‌ పోలీస్‌లు, సివిల్‌ పోలీస్‌లు, ఎన్‌డీఆర్‌ఎఫ్‌ దళాలు రంగంలోకి దిగాయి. క్షతగాత్రులను స్ట్రెచర్‌పై దూరంగా వున్న రోడ్డు వరకు మోసుకెళ్లారు. అది కూడా మట్టి రోడ్డు కావడంతో చాలా ఇబ్బంది పడ్డారు. బోగీలను గ్యాస్‌ కట్టర్‌ల ద్వారా విడదీస్తుండగా మొదట్లో ఏడుగురి మృతదేహాలు బయటపడ్డాయి. తరువాత ఆ సంఖ్య పెరుగుతూ వచ్చింది.

కొనసాగుతున్న సహాయక చర్యలు..

క్షతగాత్రులను విశాఖ, విజయనగరం ఆసుపత్రులకు తరలిస్తున్నారు. కలెక్టర్‌ నాగలక్ష్మి, ఎస్పీ దీపిక దగ్గరుండి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్నారు. విశాఖ, విజయనగరం వైద్య కళాశాలల వారు కూడా సహాయకచర్యల్లో పాల్గొంటున్నారు. 108 వాహనాలు క్షతగాత్రులను ఆసుపత్రులకు తరలిస్తున్నారు. ఆసుపత్రుల డాక్టర్లు, రైల్వే శాఖ డాక్టర్లు చేరుకుని ప్రథమ చికిత్స అందిస్తున్నారు. శ్రీకాకుళం ఎంపీ రామ్మెహన్‌నాయుడు ఘటనా స్థలానికి చేరుకుని అర్ధరాత్రి ఒంటిగంట వరకు సహాయక చర్యలపై సూచనలు ఇచ్చారు.

Updated Date - 2023-10-30T13:12:07+05:30 IST