Viveka Case : వివేకా కేసులో అప్పుడే జగన్ యాక్టివ్ అయ్యారంటూ పిటిషన్‌లో సునీత సంచలనం

ABN , First Publish Date - 2023-04-21T11:44:27+05:30 IST

వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే సునీత పిటిషన్‌లో ఏపీ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు.

Viveka Case : వివేకా కేసులో అప్పుడే జగన్ యాక్టివ్ అయ్యారంటూ పిటిషన్‌లో సునీత సంచలనం

ఢిల్లీ : వైఎస్‌ వివేకానంద రెడ్డి హత్య కేసులో.. సీబీఐపై ఎటువంటి ఆంక్షలూ లేకుండా స్వేచ్ఛగా దర్యాప్తు చేయనివ్వాలంటూ సుప్రీంకోర్టులో ఆయన కుమార్తె నర్రెడ్డి సునీతారెడ్డి పిటిషన్‌ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై నేడు సుప్రీంకోర్టులో విచారణ జరగనుంది. అయితే సునీత పిటిషన్‌లో ఏపీ సీఎం జగన్‌పై కీలక వ్యాఖ్యలు చేశారు. 19.11.2021న సీఎం జగన్ ఏపీ అసెంబ్లీలో అవినాశ్ రెడ్డికి క్లీన్ చిట్ ఇచ్చారని సునీత పేర్కొన్నారు. ముఖ్యమంత్రే స్వయంగా ఒక నిందితునికి క్లీన్ చిట్ ఇవ్వడం అనేక అనుమానాలకు తావునిస్తోందన్నారు. అవినాశ్ రెడ్డి పేరు వచ్చిన తరువాతే జగన్ యాక్టివ్ అయ్యారని పేర్కొన్నారు. వైఎస్ వివేకా హత్యకు సంబంధించిన ఛార్జిషీటులో అవినాశ్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, డి. శివశంకర్ రెడ్డిల పేర్లు రావడంతో రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం, ప్రభావవంతమైన నేతలు దర్యాప్తును ముందుకు కొనసాగనీయకుండా అన్ని ప్రయత్నాలు మొదలు పెట్టారని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. ముఖ్యంగా వైఎస్ అవినాశ్ రెడ్డిని రక్షించేందుకు పూర్తి స్థాయిలో రంగంలోకి దిగారన్నారు.

19.11.2021 న డి. శివశంకర్ రెడ్డిని పులివెందుల కోర్టులో సీబీఐ హాజరు పరిచినప్పుడు అవినాశ్ రెడ్డి అక్కడకు వచ్చి సుమారు 30 నిమిషాల పాటు శివశంకర్ రెడ్డితో గడిపారన్నారు. అంతేకాకుండా శివశంకర్ రెడ్డిని ఎలా అరెస్ట్ చేస్తారంటూ సీబీఐ అధికారులను అవినాశ్ రెడ్డి బెదిరించారని తెలిపారు. పోలీసులు పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు శ్రమించాల్సి వచ్చిందన్నారు. సజ్జల రామకృష్ణారెడ్డి వైఎస్ అవినాశ్ రెడ్డిని, డి. శివశంకర్ రెడ్డిని (ఏ5) ని గుడ్డిగా సమర్ధించారన్నారు. సీబీఐపైన నిరాధారమైన ఆరోపణలు చేశారని పిటిషన్‌లో సునీత పేర్కొన్నారు. సజ్జల ప్రభుత్వంలో పవర్ పుల్ పర్సన్ అని... ఆయనే ప్రభుత్వాన్ని పరోక్షంగా నడుపుతున్నారన్నారు. అదే రోజు సజ్జల విలేకరుల సమావేశంలో నిందితులకు మద్దతుగా మాట్లాడిన తరువాత 16.02.2022 న కడప జ్యుడిషియల్ మాజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్, గజ్జల ఉదయ్ కుమార్ రెడ్డి( అవినాశ్ రెడ్డి అత్యంత సన్నిహితుడు) సీబీఐ అధికారి రాంసింగ్‌పై చేసిన ఫిర్యాదును స్వీకరించి, కడప పోలీసు స్టేషన్‌కి పంపించారని సునీత తన పిటిషన్‌లో వెల్లడించారు.

ఈ హత్య కేసులో అనుమానితుడిగా ఉన్న వైసీపీ ఎంపీ వైఎస్‌ అవినాశ్‌రెడ్డిని ఈ నెల 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐని ఆదేశిస్తూ మూడ్రోజుల కింద తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సునీతారెడ్డి సర్వోన్నత న్యాయస్థానంలో సవాల్‌ చేశారు. ‘ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు ఇచ్చిన ఉత్తర్వులను పట్టించుకోకుండా అవినాశ్‌రెడ్డిని 25వ తేదీ వరకు అరెస్టు చేయొద్దని సీబీఐకి తెలంగాణ హైకోర్టు ఆదేశాలిచ్చింది. ఈ సమయంలో కేసు మెరిట్స్‌లోకి వెళ్లి తప్పుచేసింది. ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధం. ప్రస్తుతం కేసు దర్యాప్తు కీలక దశలో ఉంది. ఈ క్రమంలో ఎటువంటి ఆంక్షల్లేకుండా దర్యాప్తు సంస్థకు స్వేచ్ఛ ఇవ్వాలి. ఈ నెల 30లోగా దర్యాప్తు పూర్తిచేయాలని సుప్రీంకోర్టు విధించిన గడువుకు ప్రాముఖ్యత ఇవ్వకుండా హైకోర్టు ఈ కీలక దశలో దర్యాప్తును పక్కదోవ పట్టించింది’ అని ఆమె తన పిటిషన్‌లో పేర్కొన్నారు. అవినాశ్‌రెడ్డి కూడా రకరకాల పద్ధతుల్లో దర్యాప్తును అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నట్లు తెలిసింది. ఈ పిటిషన్‌పై అత్యవసరంగా విచారించాలని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డీవై చంద్రచూడ్‌, జస్టిస్‌ పీఎస్‌ నరసింహలతో కూడిన ధర్మాసనం ఎదుట సునీతారెడ్డి తరఫు సీనియర్‌ న్యాయవాది సిద్ధార్థ లూథ్రా గురువారం ప్రస్తావించారు. తొలుత ఈ నెల 28న విచారణ జరుపుతామని ధర్మాసనం తెలిపింది. అయితే అత్యవసరంగా విచారించాలని, లేదంటే పిటిషన్‌కు కాలం చెల్లుతుందని లూథ్రా చెప్పడంతో శుక్రవారం విచారించడానికి ధర్మాసనం అంగీకరించింది.

Updated Date - 2023-04-21T11:44:27+05:30 IST