Avinash Reddy : అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్‌పై సుప్రీంను ఆశ్రయించిన సునీత..
ABN , First Publish Date - 2023-04-20T11:18:47+05:30 IST
అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది.
ఢిల్లీ : ముఖ్యమంత్రి జగన్ బాబాయ్ వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఎంపీ అవినాశ్ రెడ్డిని ఈనెల 25వ తేదీదాకా అరెస్టు చేయవద్దని తెలంగాణ హైకోర్టు సీబీఐని ఆదేశించిన విషయం తెలిసిందే. అప్పటిదాకా ఆయన ప్రతి రోజూ సీబీఐ విచారణకు హాజరు కావాలంటూ స్పష్టం చేసింది. కాగా.. అవినాశ్ రెడ్డి మధ్యంతర బెయిల్ కు వ్యతిరేకంగా వివేకా కుమార్తె వైఎస్ సునీత సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఆమె పిటిషన్‌ను సుప్రీం విచారణకు స్వీకరించింది. ఈ రోజు సీజేఐ ధర్మాసనం ముందు సునీత పిటిషన్‌ను సీనియర్ న్యాయవాది సిద్ధార్ధ లూద్రా ప్రస్తావించారు. రేపు విచారణకు స్వీకరిస్తామని సీజేఐ తెలిపారు. దీంతో రేపు సునీత పిటిషన్ విచారణకు వచ్చే అవకాశం ఉంది.
వివేకా హత్య కేసులో అవినాశ్ రెడ్డి పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టు 25వ తేదీన తుది తీర్పు ఇవ్వనున్నట్లు వెల్లడించింది. దీంతో తెలంగాణ హైకోర్టు నిర్ణయాన్ని సునీత సుప్రీంలో సవాలు చేశారు. ‘‘25వ తేదీ వరకు ప్రతిరోజూ అవినాశ్‌రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి. విచారణకు సహకరించాలి. సీబీఐ అధికారులు ప్రశ్నలను లిఖితపూర్వకంగా అందజేయాలి. అవినాశ్ రెడ్డి ఇచ్చే సమాధానాలను ఆడియో, వీడియో రికార్డు చేయాలి. విచారణకు సంబంధించిన రికార్డులను కోర్టుకు సమర్పించాలి’’ అని సీబీఐని హైకోర్టు ఆదేశించింది.
స్పష్టమైన ఆధారాలు: సునీతా రెడ్డి
హైకోర్టులో దాఖలైన పిటిషన్‌పై వివేకా కుమార్తె సునీతారెడ్డి తరఫున సీనియర్ న్యాయవాది ఎల్.రవిచందర్ వాదనలు వినిపిస్తూ.. వివేకా హత్యలో అవినాశ్ రెడ్డి పాత్ర ఉన్నట్లు స్పష్టమైన ఆధారాలున్నాయని పేర్కొన్నారు. ‘‘హత్య చేసినట్లుగా ఒప్పుకొంటే కోట్లు ఇస్తామని గంగాధర్ రెడ్డికి ఆఫర్ ఇచ్చారు. వివేకా గుండెపోటుతో చనిపోయారని అవినాశ్ రెడ్డి చెప్పినట్లు అప్పటి సీఐ శంకరయ్య స్టేట్‌మెంట్ ఇచ్చారు. పిటిషనర్ ఆధారాలను నాశనం చేశారు. హత్య వెనుక విస్తృత కుట్ర ఉందని స్వయంగా సుప్రీంకోర్టు గుర్తించింది. పిటిషనర్‌కు వ్యతిరేకంగా కొలేటరల్ ఎవిడెన్స్ ఉంది’’ అని వివరించారు. అవినాశ్ రెడ్డి గతంలో దాఖలు చేసిన ఒక పిటిషన్‌ను హైకోర్టు కొట్టేసిందని.. దర్యాప్తు సవ్యంగా సాగుతోందని స్పష్టం చేసిందని రవిచందర్ గుర్తు చేశారు. ‘‘ఇప్పుడు మరో పిటిషన్‌తో కోర్టుకు వచ్చారు. ముందస్తు బెయిల్ పిటిషన్‌లో దస్తగిరి క్షమాభిక్షను వ్యతిరేకిస్తూ వాదనలు చేస్తున్నారు. ఇదేం పద్ధతి? దస్తగిరికి క్షమాభిక్ష ప్రసాదించడాన్ని అన్ని స్థాయిల కోర్టులు ధ్రువీకరించాయి’’ అని గుర్తు చేశారు. వాదనలు నమోదు చేసుకున్న ధర్మాసనం.. ఈనెల 25 వరకు పిటిషనర్‌ను అరెస్ట్ చేయరాదని మధ్యంతర ఆదేశాలు జారీ చేసింది.