Amara Raja: అమరరాజా బ్యాటరీస్‌ సంస్థకు సుప్రీంకోర్టు సూచన

ABN , First Publish Date - 2023-02-20T17:32:01+05:30 IST

అమరరాజా బ్యాటరీస్‌ (Amararaja Batteries) కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్‌ నోటీసులపై గతంలో స్టేను సుప్రీంకోర్టు...

Amara Raja: అమరరాజా బ్యాటరీస్‌ సంస్థకు సుప్రీంకోర్టు సూచన

ఢిల్లీ: అమరరాజా బ్యాటరీస్‌ (Amararaja Batteries) కాలుష్యంపై సుప్రీంకోర్టులో విచారణ జరిగింది. ఏపీ పీసీబీ షోకాజ్‌ నోటీసులపై గతంలో స్టేను సుప్రీంకోర్టు (Supreme Court) ఎత్తేసింది. అమరరాజా సంస్థ తీవ్రకాలుష్యం వెదజల్లుతోందని ఆ సంస్థ యాజమాన్యానికి ఏపీ పీసీబీ (AP ACB) నోటీసులిచ్చింది. 34 సార్లు రాజకీయ కారణాలతో నోటీసులు ఇచ్చి.. తమను వేధిస్తోందని అమరరాజా సంస్థ తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో వాదించారు. షోకాజ్ నోటీస్‌పై చట్ట ప్రకారం పబ్లిక్ హియరింగ్ నిర్వహించి నిర్ణయం తీసుకోవాలని పీసీబీకి న్యాయస్థానం ఆదేశించింది. ప్రజాభిప్రాయ సేకరణ తరువాత ఇచ్చే ఉత్తర్వులను 4 వారాలు నిలిపివేయాలని కోర్టు ఆదేశించింది. ఆ 4 వారాల్లో అవసరమైతే కోర్టును ఆశ్రయించవచ్చని.. అమరరాజా బ్యాటరీస్‌ సంస్థకు సుప్రీంకోర్టు సూచించింది.

అమరరాజా బ్యాటరీస్ తీవ్ర కాలుష్యం వెదజల్లుతోందని, దీనివల్ల పరిసర ప్రాంతాల్లో సీసం ధాతువులు పెరుగుతున్నందున సంస్థను మూసివేయాలని ఏపీ పీసీబీ షోకాజ్‌ నోటీసులిచ్చింది. అయితే దేశంలోనే అత్యంత ప్రతిష్ఠాత్మకమైన, రాష్ట్రంలో అతిపెద్దదైన ప్రైవేటు సంస్థ ‘అమరరాజా’ బ్యాటరీస్‌ను వెంటాడి, వేధించి... రాష్ట్రం నుంచి వెళ్లిపోయే పరిస్థితులు కల్పిస్తున్నారనే విమర్శలున్నాయి. రాజకీయ కక్షతో బంగారంలాంటి పరిశ్రమలను వెళ్లగొట్టడం రాష్ట్రంలోనే కాదు... బహుశా దేశంలోనే ఇదే మొదటిసారి కావొచ్చని టీడీపీ నేతలు అభిప్రాయపడుతున్నారు.

కాలుష్యం పేరిట అమరరాజా ప్లాంట్లను మూసివేసేందుకు సర్కారు రకరకాల ఎత్తులు వేసినట్లు ప్రచారం జరిగింది. హైదరాబాద్‌ నుంచి వెళ్లిన బృందం... అక్కడ పెద్దగా తప్పుపట్టేంత కాలుష్యం వెలువడటంలేదని నివేదిక ఇచ్చినట్లు సమాచారం. దీంతో సంతృప్తిచెందని సర్కారు చెన్నై నుంచి మరో బృందాన్ని పిలిపించి తమకు అనుకూలంగా నివేదిక తెప్పించుకుందని, దాని ఆధారంగా ఫ్యాక్టరీ మూసివేతకు నోటీసులు ఇచ్చిందని ప్రచారం జరిగింది. ఈ మూసివేత ఉత్తర్వులపై హైకోర్టు స్టే ఇచ్చింది. అమరరాజా విస్తరణ ప్రణాళికల కోసం వైఎస్‌ రాజశేఖరరెడ్డి (YS Rajasekhara Reddy) ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు బంగారుపాళ్యం వద్ద కొంత స్థలాన్ని కేటాయించారు. రాళ్లు, రప్పలతో నిండిన ఆ ప్రాంతాన్ని చదును చేస్తూ నెమ్మదిగా నిర్మాణ పనులు చేపట్టారు. అయితే, జగన్మోహన్‌రెడ్డి (Jagan Mohan Reddy) సర్కారు వచ్చీరాగానే ఆ భూమిని వెనక్కి తీసుకుంటూ నోటీసులు జారీ చేసింది. నిర్ణీత సమయంలో పనులు పూర్తికానందున భూమిని వెనక్కి తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.

Updated Date - 2023-02-20T17:32:03+05:30 IST