Devineni Uma: లోకేశ్ మాటలకు తాడేపల్లి కొంపలో ఆక్రందనలు..ఇద్దరికి సీబీఐ నోటీసులు రావడం ఖాయం?
ABN , First Publish Date - 2023-10-28T18:51:54+05:30 IST
నాలుగున్నరేళ్లలో మద్యం ద్వారా తాడేపల్లి కొంపకు రూ.లక్ష కోట్లు చేరాయి.
మంగళగిరి, గుంటూరు జిల్లా: జగన్ సర్కారుపై మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు విమర్శలు గుప్పించారు. లోకేశ్ మాటలకు తాడేపల్లి కొంపలో ఆక్రందనలు మొదలయ్యాయని ఎద్దేవా చేశారు.
"లోకేశ్ ప్రశ్నలకు సమాధానం చెప్పలేకే జగన్.. విజయసాయిరెడ్డితో పిచ్చికూతలు కూయించారు. తాడేపల్లి కొంపకు సీబీఐ నోటీసులు వస్తున్నాయని తెలిసే విజయసాయి పిచ్చెక్కి మాట్లాడారు. చంద్రబాబు ప్రాణాలే లక్ష్యంగా జగన్ రెడ్డి జైల్లో నడుపుతున్న వ్యవహారాలపై నోరు విప్పవేం విజయసాయి?. రాష్ట్రంలో జరిగే మద్యం తయారీ.. విక్రయాలపై సీబీఐతో విచారణ జరిపిస్తే విజయసాయి.. మిథున్ రెడ్డి.. జగన్ రెడ్డిల మద్యం మాఫియా మొత్తం బయటపడుతుంది. నాలుగున్నరేళ్లలో మద్యం ద్వారా తాడేపల్లి కొంపకు రూ.లక్ష కోట్లు చేరాయి. రాష్ట్రంలోని 20 ప్రధాన డిస్టిలరీల్లో ఎంత మద్యం తయారవుతోంది.. ఎంత బయటకు వస్తోంది... ప్రభుత్వానికి ఎంత ట్యాక్స్ కడుతున్నారో విజయసాయి చెప్పాలి. " అని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.
"మద్యం అమ్మకాలతో ప్రభుత్వ ఖజానాకు ఎంత వస్తోంది... జగన్ కు ఎంత ముట్టిందనే వివరాలు బయటపెట్టే దమ్ము, ధైర్యం విజయ సాయిరెడ్డికి ఉన్నాయా?. తన అల్లుడు శరత్ చంద్రారెడ్డిని లిక్కర్ స్కామ్ నుంచి బయటపడేయడానికి జగన్ రెడ్డి.. విజయసాయిరెడ్డి ఏకంగా ఏపీ ప్రయోజనాల్నే ఢిల్లీ పెద్దలకు తాకట్టుపెట్టారు. అవినాశ్ రెడ్డి బెయిల్ రద్దుకావడం.. బాబాయ్ హత్యకేసులో తాడేపల్లి కొంపలోని ఇద్దరికి సీబీఐ నోటీసులు రావడం ఖాయం. వ్యవస్థల్ని మేనేజ్ చేస్తూ...న్యాయస్థానాలకు తప్పుడు సమాచారమిస్తూ.. జగన్, విజయసాయి తప్పించుకుంటున్నారు. టీడీపీ అధికారంలోకి రాగానే ఏ1, ఏ2లు తిన్నదంతా కక్కించి వారిని శాశ్వతంగా జైలుకు పరిమితం చేస్తుంది." అని దేవినేని ఉమ హెచ్చరించారు.