TDP: చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనపై టీడీపీ సీరియస్

ABN , First Publish Date - 2023-04-22T15:33:11+05:30 IST

మాజీసీఎం చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్‌పై దాడి ఘటనను టీడీపీ (TDP) సీరియస్‌గా తీసుకుంది. పథకం ప్రకారమే ఎర్రగొండపాలెం ఘటన జరిగిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు.

TDP: చంద్రబాబు కాన్వాయ్‌పై దాడి ఘటనపై టీడీపీ సీరియస్

అమరావతి: మాజీసీఎం చంద్రబాబు (Chandrababu) కాన్వాయ్‌పై దాడి ఘటనను టీడీపీ (TDP) సీరియస్‌గా తీసుకుంది. పథకం ప్రకారమే ఎర్రగొండపాలెం ఘటన జరిగిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు. దాడి ఆ తర్వాత జరిగిన ఘటనపై ఆ పార్టీ అధినేత చంద్రబాబు.. పార్టీ ముఖ్యనేతలతో టెలీకాన్ఫరెన్స్ (Teleconference) నిర్వహించారు. రాళ్ల దాడి, ఇతర పరిణామాలను గవర్నర్ దృష్టికి తీసుకెళ్లాలని నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఈ-మెయిల్ ద్వారా రాజ్‌భవన్‌కు టీడీపీ నేతలు వివరాలు పంపారు. అలాగే ఎర్రగొండపాలెం పోలీసులకు ఫిర్యాదు చేయాలని నిర్ణయించారు. ప్రకాశం జిల్లా (Prakasam District) ఎస్పీకి టీడీపీ నేతలు ఫిర్యాదు చేయనున్నారు. ఎస్సీలకు జరుగుతున్న అన్యాయాలను ఎలుగెత్తి చాటాలని పార్టీ నేతలకు చంద్రబాబు పార్టీ నేతలకు సూచించారు.

ప్రకాశం జిల్లా యర్రగొండపాలెంలో చంద్రబాబు కాన్వాయ్‌పై వైసీపీ కార్యకర్తలు రాళ్ల దాడికి తెగబడ్డారు. ఆయన పర్యటనకు నిరసన పేరిట పురపాలక మంత్రి ఆదిమూలపు సురేశ్‌ (Adimulapu Suresh) నేతృత్వంలో అరాచకానికి దిగారు. స్వయంగా ముందుండి తన పార్టీ శ్రేణులను ఉసిగొల్పారు. పోలీసులు కూడా చోద్యం చూస్తూ నిలబడిపోయారు. వైసీపీ శ్రేణులు ఒక్కసారిగా రాళ్లు రువ్వడంతో చంద్రబాబు సెక్యూరిటీలోని ఎన్‌ఎస్‌జీ కమాండెంట్‌ సంతోష్‌కుమార్‌ తలకు గాయమైంది. ప్రకాశం జిల్లాలో మూడ్రోజులుగా చంద్రబాబు పర్యటిస్తున్నారు. బుధ, గురువారాల్లో గిద్దలూరు, మార్కాపురం రోడ్‌షోలు, సభలకు జనం పోటెత్తారు. దీంతో చివరి రోజైన శుక్రవారం మంత్రి సురేశ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్న యర్రగొండపాలెంలో బాబు పర్యటనను అడ్డుకోవాలని అధికార వైసీపీ ఎత్తువేసింది.

కేంద్రహోంశాఖకు ఫిర్యాదు

ఎన్‌ఎస్‌జీ రక్షణలో ఉన్న చంద్రబాబుపై రాళ్ళ దాడి ఘటనకు సంబంధించి కేంద్ర హోం శాఖకు (Central Home Department) న్యాయవాది గూడపాటి లక్ష్మీనారాయణ (Advocate Gudapati Lakshminarayana) ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లాకు(Union Home Secretary Ajay Bhalla) లక్ష్మీనారాయణ ఫిర్యాదు చేశారు. వీఐపీ భద్రతకు సంబంధించి స్థానిక పోలీసులు స్టాండింగ్ ఆర్డర్లను ఉల్లంఘించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో జరిగిన ఘటనలు కూడా లక్ష్మీనారాయణ లేఖలో ప్రస్తావించారు. చంద్రబాబుపై 151 సీఆర్‌పీసీని ఉపయోగించడం ప్రజాస్వామ్య సూత్రాలకు విరుద్ధమని తెలిపారు. ప్రతిపక్ష నేతను అణచివేసేందుకే ఈ ప్రయత్నాలు తప్పుబట్టారు. ఆందోళనకారులు దాడికి ముందుగా సిద్ధమైనప్పటికీ వారిని స్థానిక పోలీసులు నిరోధించకపోవడం పట్ల అభ్యంతరం తెలియజేశారు. చంద్రబాబుకు తగిన భద్రత కల్పించడంలో స్థానిక పోలీసులు విఫలమయ్యారని పేర్కొన్నారు. వరుసగా జరుగుతున్న ఘటనలపై సమగ్ర విచారణ జరపాలని కేంద్ర హోంశాఖను కోరారు. లేఖను హోంశాఖ కార్యదర్శికి పంపుతూ, వీడియో క్లిప్పింగ్‌లను కూడా లక్ష్మీనారాయణ పంపించారు.

Updated Date - 2023-04-22T15:33:11+05:30 IST