Atchannaidu: ఏబీఎన్ ప్రతినిధులపై వైసీపీ రౌడీల దాడి.. అచ్చెన్న స్పందన ఇదే..
ABN , First Publish Date - 2023-05-19T13:22:32+05:30 IST
ఎంపీ అవినాశ్‌రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వాహనం, ప్రతినిధిపై ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు తీవ్రంగా ఖండించారు.
అమరావతి: ఎంపీ అవినాశ్‌రెడ్డి వాహనాన్ని అనుసరిస్తున్న ఏబీఎన్- ఆంధ్రజ్యోతి వాహనం, ప్రతినిధిపై ఎంపీ అవినాశ్ రెడ్డి అనుచరులు దాడి చేయడాన్ని టీడీపీ రాష్ట్ర అధ్యక్షులు అచ్చెన్నాయుడు (TDP Leader Atchannaidu) తీవ్రంగా ఖండించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... పత్రికా స్వేచ్ఛను జగన్ రెడ్డి హరిస్తున్నారని... మీడియా ప్రతినిధులపై దాడిని తీవ్రంగా ఖండిస్తున్నామని తెలిపారు. సీబీఐ (CBI) విచారణకు హాజరుకాకుండా కుంటి సాకులు చెప్పి పారిపోతున్న అవినాష్ రెడ్డి బాగోతాన్ని కవర్ చేస్తున్న ఏబీఎన్ ప్రతినిధులపై వైసీపీ రౌడీలు దాడి చేయడం దారుణమన్నారు. విధి నిర్వహణలో ఉన్న మీడియా ప్రతినిధిలపై దాడి చేసిన వైసీపీ గూండాలపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. జగన్ రెడ్డి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పత్రికా స్వేచ్చను హరిస్తూనే ఉన్నారన్నారు. ప్రజలకు వాస్తవాలు తెలియజేస్తున్న పత్రికలపై జగన్ రెడ్డి అక్కసు వెళ్లగక్కుతున్నారని మండిపడ్డారు. దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేయడంతో పాటు తక్షణమే వారిని అరెస్ట్ చేయాలని అచ్చెన్నాయుడు డిమాండ్ చేశారు.
అసలేం జరిగిందంటే..
వివేకా హత్య కేసులో (YS Viveka Case) ఎంపీ అవినాష్ రెడ్డి (MP Avinash Reddy) నేడు విచారణకు హాజరు కావాల్సి ఉండగా.. తల్లి అనారోగ్యం కారణం చెప్పి ఆయన పులివెందులకు బయలు దేరారు. అయితే ఆయన వాహన్ని అనుసరిస్తున్న ఏబీఎన్ వాహనం, రిపోర్టర్‌పై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు. వాహనం ముందు వైపు అద్దాలు పగులగొట్టి.. ఏబీఎన్ రిపోర్టర్ శశిపై అవినాష్ అనుచరులు దాడికి పాల్పడ్డారు.
కాగా.. తెలుగు రాష్ట్రాల్లో పెను ప్రకంపనలు రేపిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్ రెడ్డి మళ్లీ ట్విస్ట్ ఇచ్చారు. గత విచారణ సమయంలో ట్విస్ట్ ఇచ్చిన మాదిరిగానే.. నేడు కూడా అదే ట్విస్ట్ ఇవ్వడం గమనార్హం. సీబీఐ కార్యాలయానికి బయలుదేరినట్టే బయల్దేరి.. మార్గమధ్యలోనే హుటాహుటిన ఆయన పులివెందుల దారి పట్టారు. ఎంపీ తల్లి శ్రీలక్ష్మి అనారోగ్యంతో పులివెందుల ఆసుపత్రిలో చేరారని ఫోన్ రావడంతో ఆయన పులివెందులకు బయలుదేరారు. కాగా శ్రీలక్ష్మికి గుండెపోటు వచ్చినట్లుగా తెలుస్తోంది.