Dhulipalla Narendra: జగన్ అభిమానిని అని సీఐ శ్రీను చెప్పుకోవడం సిగ్గుచేటు
ABN , First Publish Date - 2023-09-06T13:02:34+05:30 IST
టీడీపీ యువనేత నారా లోకేశ్ యువగళం పాదయాత్రలో వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేస్తే ఎందుకు నియంత్రించలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర ప్రశ్నించారు.
అమరావతి: టీడీపీ యువనేత నారా లోకేశ్ (TDP Leader Nara Lokesh) యువగళం పాదయాత్రలో (YuvaGalam Padayatr) వైసీపీ కార్యకర్తలు హల్చల్ చేస్తే ఎందుకు నియంత్రించలేదని టీడీపీ నేత ధూళిపాళ్ల నరేంద్ర (TDP Leader Dhulipalla Narendra) ప్రశ్నించారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ.. సీఐ శ్రీను వైసీపీ కార్యకర్తలకు రక్షణగా ఉండటంతో పాటు.. ఏ విధంగా రావాలో వైసీపీ కార్యకర్తలకు సలహాలు ఇచ్చారని మండిపడ్డారు. తాను జగన్ అభిమానిని అంటూ సీఐ శ్రీను వ్యాఖ్యలు చేయడం పోలీస్ వ్యవస్థకే సిగ్గుచేటన్నారు. ఘటన జరుగుతున్న ప్రదేశంలోనే ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్, అతని అతనుచరులు ఉండి విధ్వంసానికి ప్రోత్సాహించారన్నారు. వైసీపీ సైకోలు విసిరిన రాళ్ల నుండి లోకేశ్‌కు తృటిలో ప్రమాదం తప్పిందని ఆయన తెలిపారు.
మాజీ ఎమ్మెల్యే శివరామరాజుకు ఛాతిపై గాయమైందన్నారు. గతంలో అదే ప్రదేశంలో పవన్ కళ్యాణ్‌ను కూడా అడ్డుకోవాలని చూసి.. గొడవ సృష్టించారని తెలిపారు. ఎమ్మెల్యే టికెట్ రాదన్న భయంతో జగన్ దగ్గర మార్కులు కొట్టేయడానికి గ్రంధి శ్రీనివాస్.. గూండా శ్రీనివాస్‌గా మారారన్నారు. వాలంటీర్లకు దెబ్బలు తగిలాయని.. మీడియా మిత్రులకు గాయాలయ్యాయని.. అయినా వాలంటీర్లనే అరెస్ట్ చేశారన్నారు. అరెస్ట్ చేసిన వాలంటీర్లను రాత్రి నుంచి స్టేషన్‌కు తీసుకెళ్లకుండా తిప్పుతూ వైసీపీ నేతలకు చెందిన రహస్య ప్రాంతాలకు తరిలించడం ఏంటని నిలదీశారు. వాలంటీర్లు అరెస్ట్‌ను ఖండిస్తున్నా అని.. వెంటనే వారిని విడుదల చేయాలని ధూళిపాళ్ల నరేంద్ర డిమాండ్ చేశారు.