Kollu Ravindra: ఒక్కొక్కరికీ ఉంది... భోషాణాలు బద్దలయ్యే రోజులు దగ్గర్లోనే

ABN , First Publish Date - 2023-09-04T14:21:59+05:30 IST

వైఎస్సార్ పార్టీ దొంగల పార్టీ అని.. ఆ పార్టీ అధ్యక్షుడే గజ దొంగ అంటూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.

Kollu Ravindra:  ఒక్కొక్కరికీ ఉంది... భోషాణాలు బద్దలయ్యే రోజులు దగ్గర్లోనే

కృష్ణా: వైఎస్సార్ పార్టీ దొంగల పార్టీ అని.. ఆ పార్టీ అధ్యక్షుడే గజ దొంగ అంటూ టీడీపీ నేత కొల్లు రవీంద్ర(TDP Leader Kollu Ravindra) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. ఆర్ధిక నేరస్తుడి పార్టీలో ఉన్న నాయకులు నోటికొచ్చినట్లు వాగుతున్నారన్నారు. ఐటీ నోటీసులు ఇస్తే.. చంద్రబాబు అవినీతి చేశారని దుష్ప్రచారం చేస్తారా అంటూ మండిపడ్డారు. తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని జగన్ దోచుకున్నారంటూ రూ.40 వేల కోట్లు స్వాధీనం చేసుకున్నారన్నారు. సీబీఐ, ఈడీ అధికారుల విచారణలో కూడా అవినీతి తేలిందన్నారు. నేడు కోర్టు వాయిదాలు ఎగ్గొట్టి, దాక్కుని తిరిగే వ్యక్తి జగన్ అని మండిపడ్డారు. నీతి, నిజాయతీ ఉంటే.. కోర్టుకు ఎందుకు వెళ్లడం లేదు జగన్ అని ప్రశ్నించారు. చంద్రబాబు అవినీతిని బయటకు తీస్తామన్న జగన్.. ఈ నాలుగేళ్లల్లో జగన్ ఏం చేయగలిగారన్నారు. చంద్రబాబు (TDP Chief Chandrababu Naidu) అవినీతిని బయటకు తీసే దమ్ము, ధైర్యం మీకు ఉందా అని నిలదీశారు. వైసీపీ నాయకుడే పెద్ద ఆర్ధిక ఉగ్రవాది అని, సొంత బాబాయినే హత్య చేయించారని ఆరోపించారు. సొంత కుటుంబ సభ్యులపై ఆరోపణలు వస్తే.. నోరు మెదపరన్నారు. అవినాష్ రెడ్డిని (Avinash Reddy) రక్షించేందుకు ఢిల్లీ వెళ్లి కాళ్లు పట్టుకుంటున్నారని విమర్శించారు. ‘‘కోడి కత్తి కేసులో బొత్స మేనల్లుడు చెప్పాడు.. అదంతా మీ కుట్రేనని.. వీటిపై సమాధానం చెప్పే దమ్ము లేదు.. చంద్రబాబును మీరేంట్రా అడిగేది. ఒకొక్కరికీ ఉంది... భోషాణాలు బద్దలయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి’’ అంటూ కొల్లు రవీంద్ర వ్యాఖ్యలు చేశారు.

Updated Date - 2023-09-04T14:21:59+05:30 IST