Pattabhiram: సీబీఐకి అవినాష్ లేఖ మీడియా స్టంటే..
ABN , First Publish Date - 2023-07-24T15:07:02+05:30 IST
సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ వ్యాఖ్యలు చేశారు.
అమరావతి: సీబీఐకు కడప ఎంపీ అవినాశ్ రెడ్డి (MP Avinash Reddy) వందపేజీల లేఖ రాయడం కేవలం మీడియా స్టంటే అని టీడీపీ జాతీయ అధికారప్రతినిధి కొమ్మారెడ్డి పట్టాభిరామ్ (TDP Leader Kommareddy Pattabhiram) వ్యాఖ్యలు చేశారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. వివేకాహత్యోదంతంలో తనది, జగన్మోహన్ రెడ్డి (CM Jagan)పాత్ర, ప్రమేయం లేదని ప్రజల్ని నమ్మించే ప్రయత్నంలో భాగమే అవినాశ్ రెడ్డి లేఖ అని అన్నారు. ఛార్జ్‌షీట్ వేసిన తర్వాత తాను ఏదైనా చెప్పాలనుకుంటే కోర్టులో చెప్పాలి గానీ ఈ లేఖల డ్రామా ఏమిటని ప్రశ్నించారు. వివేకా హత్యతో అవినాశ్ రెడ్డికి, జగన్మోహన్ రెడ్డికి సంబంధంలేకపోతే, తాను అడిగే ప్రశ్నలకు అవినాశ్ రెడ్డి వెంటనే ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు.
పట్టాభి అడిగిన ప్రశ్నలు ఇవే..
• మార్చి 14 అర్థరాత్రి నుంచి మార్చి 15 తెల్లవారుజాము వరకు నిద్రాహారాలు మాని ఏ1 గంగిరెడ్డితో ఏమి ఛాటింగ్ చేశాడో అవినాశ్ రెడ్డి చెప్పాలి.
• తెల్లవారుజామున 05:18 గంటల వరకు గంగిరెడ్డితో ఛాటింగ్ చేసిన, వెంటనే భారతిరెడ్డి పీఏకి ఫోన్ చేసి ఆమెతో, జగన్మోహన్ రెడ్డితో ఏం మాట్లాడాడు?
• ఉదయం 5:30 గంటలకు తన చిన్నాన్న చనిపోయిన విషయం జగన్, అజయ్ కల్లం తదితరులకు చెప్పింది నిజంకాదా?
• తన చిన్నాన్న వివేకానందరెడ్డి చనిపోయే రెండు నెలల ముందు తనను కలిసి కడప ఎంపీగా పోటీచేయాలని చెప్పి ఒప్పించింది నిజమని చెప్పిన షర్మిల వాంగ్మూలంపై నీ సమాధానమేంటి అవినాశ్ రెడ్డి?
• వివేకానందరెడ్డి ఎమ్మెల్సీ ఎన్నికల్లో అవినాశ్ రెడ్డి, అతని తండ్రి భాస్కర్ రెడ్డి తనకు వెన్నుపోటు పొడిచారని, తన చిన్నాన్న తన వద్ద వాపోయారన్న షర్మిల మాటలకు నీ జవాబేంటి?
• సాక్ష్యం చెప్పకుండా సీఐ శంకరయ్య నోరునొక్కేశారని, అతనిపై తన లేఖలో బురదజల్లిన అవినాశ్ రెడ్డి, శంకరయ్యకు మరలా పోస్టింగ్ ఎందుకిచ్చారో అవినాశ్ రెడ్డి చెప్పాలి.
• ఉదయం 06.26 సెకన్లకు తాను జమ్మలమడుగు వెళ్తుండగా వివేకా మరణవార్త తెలిసుకొని, కేవలం 3 నిమిషాల 45 సెకన్లలో ‘సూపర్ మ్యాన్’ అవతారమెత్తి వివేకా ఇంటికి చేరావా అవినాశ్?
• మార్చి 14 సాయంత్రం మార్చి 15 ఉదయం వరకు వివేకాహత్యకేసు నిందితులతో తరచూ ఫోన్ సంభాషణలు జరపాల్సిన అవసరం ఏ మొచ్చింది అవినాశ్ రెడ్డి?
• హత్య కేసులో ఏ2గా ఉన్న యాదాటి సునీల్ యాదవ్ మార్చి 14 మధ్యాహ్నం నుంచి 15 ఉదయం వరకు తరచూ మీ ఇంటికి వచ్చినట్టు గూగుల్ టేకౌట్ బయటపెట్టిన ఆధారాలపై నీ స్పందనేంటి అవినాశ్ రెడ్డి?
• రాజారెడ్డి ఆసుపత్రిలో పనిచేసే ఉసిరెడ్డి శ్రీనివాసరెడ్డి వివేకా మృతదేహానికి కుట్లు వేయడం కోసం కాటన్, బ్యాండేజీ నీ తండ్రి ఆదేశాలతో తీసుకొచ్చింది నిజం కాదా?
• నీ ప్రధాన అనుచరుడు శివశంకర్ రెడ్డి ఉదయం 6.24 నిమిషాలకే సాక్షి విలేకరి బాలకృష్ణారెడ్డితో కలిసి గుండెపోటు కథను సిద్ధంచేసిన మాట వాస్తవం కాదా? అంటూ పట్టాభిరామ్ ప్రశ్నల వర్షం కురిపించారు.