Nara Lokesh: రెండో రోజు సీఐడీ విచారణకు హాజరైన లోకేష్
ABN , First Publish Date - 2023-10-11T10:35:06+05:30 IST
అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డుపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ రెండో రోజూ సీఐడీ విచారణకు హాజరయ్యారు. చెప్పిన సమాయానికి కంటే ముందే లోకేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగనుంది.
అమరావతి: అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు కేసులో (IRR Case) రెండో రోజూ సీఐడీ (CID) విచారణకు టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ (TDP Leader Nara Lokesh) హాజరయ్యారు. చెప్పిన సమాయానికి కంటే ముందుగానే లోకేష్ తాడేపల్లిలోని సిట్ కార్యాలయానికి చేరుకున్నారు. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు విచారణ కొనసాగనుంది. న్యాయవాది గింజుపల్లి సుబ్బారావుతో కలిసి లోకేష్.. సీఐడీ విచారణకు హాజరయ్యారు.
నిన్న ఇలా...
న్యాయస్థానం ఆదేశాల మేరకు నిన్న (మంగళవారం) తొలిరోజు 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోకేష్‌ను సీఐడీ అధికారులు విచారించారు. సీఐడీ అడిగిన దాదాపు 50 ప్రశ్నలకు టీడీపీ నేత సూటిగా సమాధానం చెప్పారు. ఇన్నర్ రింగ్ రోడ్డుతో సంబంధం లేకుండా ఎక్కువ ప్రశ్నలు హెరిటేజ్ గురించే సీఐడి ఆడిగిందని విచారణ అనంతరం యువనేత తెలిపారు. మిగిలిన ప్రశ్నలకు కూడా నిన్నే సమాధానం చెప్తానన్నా సీఐడీ అంగీకరించలేదు. తాను న్యాయవాదులతో సంప్రదించేందుకు ఢిల్లీ వెళ్లాల్సి ఉన్నందున ఆలస్యమైనా సరే మిగతా ప్రశ్నలు అడగాలని లోకేష్ కోరారు. న్యాయస్థానం ఆదేశాల మేరకు 5 గంటలకే విచారణ ముగించాల్సి ఉన్నందున ముగిస్తున్నామని సీఐడీ చెప్పుకొచ్చింది. తన అంగీకారంతోనే 5 గంటల తర్వాత కూడా విచారణ కొనసాగించామని కోర్టుకు తెలియజేయొచ్చు కదా అని లోకేష్ కోరగా.. ప్రశ్నలు తయారు చేసుకోవాల్సి ఉన్నందున నేడు కూడా విచారణకు రావాలని సీఐడీ కోరారు. నిన్న విచారణ ముగిశాక మళ్లీ 41A నోటీసు జారీ చేసి నేడు కూడా విచారణకురమ్మని సీఐడీ ఆదేశించింది.