Varla Ramaiah: దళితవాడల్లో వైసీపీ బస్సుయాత్ర చేస్తే తరిమి తరిమి కొట్టడం ఖాయం
ABN , First Publish Date - 2023-11-14T16:29:16+05:30 IST
Andhrapradesh: ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’ అని వైసీపీ వాళ్లు అంటుంటే.. ‘‘ఉయ్ హేట్ జగన్’’ అని ఏపీ దళితులు అంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య అన్నారు.
అమరావతి: ‘‘వై ఏపీ నీడ్స్ జగన్’’ అని వైసీపీ వాళ్లు అంటుంటే.. ‘‘ఉయ్ హేట్ జగన్’’ అని ఏపీ దళితులు అంటున్నారని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు వర్ల రామయ్య (TDP Leader Varla Ramaiah) అన్నారు. మంగళవారం మీడియాతో మాట్లాడుతూ.. జగన్మోహన్ రెడ్డి పాలనలో దళితులపై యథేచ్ఛగా దాడులు జరుగుతున్నాయని మండిపడ్డారు. దళితుల ఓట్లు దండుకుని సీఎం అయ్యాక దళితులను మోసం చేసిన వ్యక్తి జగన్ అని అన్నారు. జగన్ (CM Jagan) పాలనలో దళితులపై 6 వేల దాడులు జరిగాయని.. ఈ దాడుల్లో 28మంది చనిపోయారని తెలిపారు. దళితులను చంపిన ఏ ఒక్కరికీ శిక్ష వేయకుండా నిందితులను ప్రక్కన కూర్చోబెట్టుకున్న దళిత ద్రోహి జగన్ అని విరుచుకుపడ్డారు. వైసీపీ సాధికార బస్సుయాత్ర దళితవాడల్లో చేయడం లేదన్నారు. దళితవాడల్లో బస్సుయాత్ర చేస్తే వైసీపీ మంత్రులను దళితులు తరిమి తరిమి కొట్టడం ఖాయమని ఆయన హెచ్చరించారు.
వైసీపీలో (YCP) దళిత ఉపముఖ్యమంత్రి, మంత్రులకు అవమానాలు తప్ప గౌరవం లేదన్నారు. దళితుల ఆత్మగౌరవాన్ని తాకట్టుపెట్టి దళిత మంత్రులు, ఎమ్మెల్యేలు వైసీపీలో కొనసాగుతున్నారన్నారు. డాక్టర్ సుధాకర్‌ను చంపినప్పుడే దళితుల్లో జగన్మోహన్ రెడ్డి జీరో అయ్యారని... నేడు జగన్‌ను దళితులు అసహ్యించుకుంటున్నారని తెలిపారు. దళిత సంక్షేమాన్ని పాతరేసి, కార్పొరేషన్లను నిర్వీర్యం చేసి, సబ్ ప్లాన్ నిధులు దోచుకున్నందుకు దళితులు జగన్ కావాలంటారా? అని ప్రశ్నించారు. జగన్మోహన్ రెడ్డికి దళిత వర్గాల్లో ఎట్టి పరిస్థితుల్లో స్థానం దక్కదని తెలుసుకోవాలన్నారు. దళితులకు చంద్రబాబు ఏం చేశారో జగన్ తన చంకలో ఉన్న జూపూడి ప్రభాకర్‌ను అడిగితే చెబుతారంటూ ఎద్దేవా చేశారు. దళిత న్యాయవాది విజయ్ కుమార్‌పై దాడి చేసిన నిందితులను జగన్ తక్షణమే శిక్షించాలని వర్ల రామయ్య డిమాండ్ చేశారు.