AP MLC Results: గెలుపు దిశగా టీడీపీ.. రాంగోపాల్ రెడ్డి మెజార్టీ ఎంతంటే..
ABN , First Publish Date - 2023-03-18T17:20:20+05:30 IST
ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు ఎన్నికలు జరిగాయి. ఈ మూడింటిలో రెండు స్ధానాలు టీడీపీ (TDP) ఖాతాలో పడ్డాయి. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ
అనంతపురం: ఏపీలో మూడు పట్టభద్రుల స్థానాలకు జరిగిన ఎన్నికల్లో రెండు ఇప్పటికే టీడీపీ (TDP) ఖాతాలో పడగా.. ఇక ముడో స్థానం పశ్చిమ రాయలసీమ స్థానం టీడీపీకే దక్కే అవకాశం ఉంది. పశ్చిమ రాయలసీమ నుంచి టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి (Bhumi Reddy Ramgopal Reddy), వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డి (Vennapusa Ravindra Reddy) నువ్వానేనా అన్నట్లు తలపడుతున్నారు. తొలి ప్రాధాన్యత ఓట్ల లెక్కింపుతో గెలుపు కావాల్సిన ఓట్లు ఏ అభ్యర్థికి దక్కకపోవడంతో రెండు ప్రధాన్యత ఓట్లను లెక్కిస్తున్నారు. రెండో ప్రాధాన్యత ఓట్లలో టీడీపీకి ఆధిక్యత కొనసాగుతోంది. భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి 400 ఓట్ల మెజార్టీలో ఉన్నారు. పీడీఎఫ్ అభ్యర్థి నాగారాజు (PDF Candidate Nagaraju) రెండో ప్రధాన్యత ఓట్లు లెక్కిస్తున్నారు. తొలి ప్రధాన్యత ఓట్ల లెక్కింపులో ఆధిక్యాన్ని కనబర్చిన వైసీపీ అభ్యర్థి రవీంద్రారెడ్డి రెండో ప్రాధాన్యత లెక్కింపులో క్రమంగా తగ్గతూ వస్తున్నారు. పోలింగ్ కేంద్రం నుంచి వెన్నపూస రవీంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వర్రెడ్డి బయటకు వెళ్లిపోయారు. దీంతో గెలుపు తమదేనే ధీమాలో టీడీపీ నేతలున్నారు.
తొలిరోజు నుంచి హోరాహోరీ పోరు
తొలిరోజు నుంచి టీడీపీ, వైసీపీ మద్దతు అభ్యర్థుల మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది. వైసీపీకి 7 రౌండ్‌లలో మెజారిటీ వచ్చినా అది స్వల్పంగానే ఉంది. టీడీపీ అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి 7, 9వ రౌండ్‌లో మాత్రమే మెజారిటీ లభించింది. అయినా వైసీపీ అభ్యర్థి వెన్నపూస రవీంద్రారెడ్డికి దీటుగా ఓట్లు వచ్చాయి. దీంతో మెజారిటీ కేవలం వందల్లోనే ఉంటోంది. శుక్రవారం అర్ధరాత్రికి మొత్తం 9 రౌండ్‌లు ఫలితాలు వచ్చాయి. అప్పటికి 2,16,014 ఓట్లు లెక్కించారు. ఇందులో 16,976 ఓట్లు చెల్లనివిగా గుర్తించారు. మిగిలిన 1,99,038 ఓట్లను లెక్కించారు. ఇందులో టీడీపీ మద్దతు అభ్యర్థి భూమిరెడ్డి రాంగోపాల్‌రెడ్డికి 82,740 తొలి ప్రాధాన్య ఓట్లు వచ్చాయి. వైసీపీ మద్దతు అభ్యర్థి రవీంద్రారెడ్డికి 84,153 ఓట్లు లభించాయి. ఈ లెక్కన వైసీపీ అభ్యర్థికి 1413 ఓట్ల మెజారిటీ వచ్చింది.
ద్వితీయంతోనే ఫలితం
పశ్చిమ రాయలసీమ పట్టభద్రుల విజేత ఎవరో తేలాలంటే ద్వితీయ ప్రాధాన్య ఓట్ల లెక్కింపు తప్పేలా లేదు. మొత్తం 2,45,586 ఓట్లు పోలయ్యాయి. ఇందులో 9వ రౌండ్ వరకు 1,99,038 ఓట్లు లెక్కించారు. టీడీపీ అభ్యర్థి రామగోపాల్‌రెడ్డికి 82740 ఓట్లు, వైసీపీ అభ్యర్థి రవీంద్రరెడ్డికి 84,153 ఓట్లు వచ్చాయి. గెలిచేందుకు సగం ప్లస్ ఒక ఓటు తొలి ప్రాధాన్యం కింద ఎవరికీ వచ్చేలా లేదు. అందుకే ద్వితీయ ప్రాధాన్య ఓట్లు తప్పనిసరిగా లెక్కిస్తున్నారు. పీడీఎఫ్ అభ్యర్థి పోతుల నాగరాజుకు ఇప్పటి వరకూ 16,733 ఓట్లు ప్రథమ ప్రాధాన్య ఓట్లు దక్కాయి. బీజేపీ మద్దతు అభ్యర్థి రాఘవేంద్రకు 6,602 ఓట్లు వచ్చాయి. వీరిద్దరి ఎలిమినేషనతో ఫలితం వచ్చే అవకాశం ఉంది. పీడీఎఫ్, టీడీపీ మధ్య రెండో ప్రాధాన్య ఓటు విషయంలో ఒప్పందం ఉంది. ఈ లెక్కన పోతుల నాగరాజుకు వచ్చిన ఓట్లలో అధికశాతం ద్వితీయ ప్రాధాన్య ఓట్లు టీడీపీ అభ్యర్థికి వచ్చుంటాయని భావిస్తున్నారు. అందుకే ఎలిమినేషన రౌండ్ తరువాత టీడీపీకి అనుకూలంగా ఫలితం ఉంటుందని భావిస్తున్నారు. ఈ కారణంగానే వైసీపీ అభ్యర్థిలో గుబులు మొదలైంది.