Chandrababu : చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో సుదీర్ఘ వాదనలు.. విచారణను వాయిదా వేసిన ధర్మాసనం
ABN , First Publish Date - 2023-10-03T13:35:24+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. కేసును ఈ నెల 9కి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ నిర్వహించింది.
ఢిల్లీ : టీడీపీ అధినేత చంద్రబాబు క్వాష్ పిటిషన్‌పై సుప్రీంలో విచారణ జరిగింది. కేసును ఈ నెల 9కి సుప్రీంకోర్టు ధర్మాసనం వాయిదా వేసింది. జస్టిస్ అనిరుద్ధ బోస్, జస్టిస్ బేలా ఎం. త్రివేది ధర్మాసనం విచారణ నిర్వహించింది. ఏపీ హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ సుప్రీంకోర్టును టీడీపీ అధినేత చంద్రబాబు ఆశ్రయించారు. గత వారంలో జస్టిస్ సంజీవ్ ఖన్నా, జస్టిస్ ఎస్వీఎన్ భట్టి ధర్మాసనం ఎదుట చంద్రబాబు కేసు విచారణకు వచ్చింది. అయితే విచారణ నుంచి జస్టిస్ సరస వెంకట నారాయణ భట్టి తప్పుకున్నారు. అదే రోజు ప్రధాన న్యాయమూర్తి ధర్మాసనం ఎదుట చంద్రబాబు తరపు న్యాయవాదులు ప్రస్తావన తీసుకురావడం జరిగింది.
మరో బెంచ్ కేటాయించి అక్టోబర్ 3న విచారణ చేపట్టనున్నట్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ తెలిపారు. అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 17(ఏ) చంద్రబాబుకు వర్తిస్తుందని ఆయన తరఫు న్యాయవాదులు వాదించారు. చంద్రబాబు తరఫున సిద్ధార్థ్ లూథ్రా, హరీశ్ సాల్వే, అభిషేక్ మను సింఘ్వీ తదితర ప్రముఖ న్యాయవాదులు వాదనలు వినిపించారు. కేవియట్ దాఖలు చేసి విచారణలో ఏపీ ప్రభుత్వం భాగమైంది. తన వాదన వినకుండా ఎలాంటి ఉత్తర్వులు ఇవ్వొద్దని కోర్టుకు విన్నవించింది.
చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే వాదనలు..
‘‘హైకోర్టు తీర్పులో 17Aను తప్పుగా అన్వయించారు. చంద్రబాబు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారని సీఐడీ ఆరోపించింది. హైకోర్టు తీర్పులో మాత్రం చంద్రబాబు ఆదేశాలు.. అధికార విధుల్లో భాగంగా ఇచ్చినవే. హైకోర్టు తీర్పు, సీఐడీ అభియోగాలు పరస్పరం విరుద్ధంగా ఉన్నాయి. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్ష సాధింపుతో కూడుకుంది. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదైతే అప్పటి నుంచే 17A వర్తిస్తుంది. నేరం ఎప్పుడు జరిగిందన్నది ముఖ్యం కాదు. ఎఫ్ఐఆర్ ఎప్పుడు నమోదు చేశారన్నదే ముఖ్యం. 2018 తర్వాత నమోదయ్యే ఎఫ్ఐఆర్‌లు అన్నింటికీ 17A వర్తిస్తుంది. కేబినెట్ నిర్ణయం మేరకే స్కిల్ కార్పొరేషన్ ఏర్పాటైంది. సీమెన్స్, డిజైన్‌టెక్ సంస్థలతో ఒప్పందాలు కూడా... కేబినెట్ నిర్ణయాల మేరకే జరిగాయి’’ అని సాల్వే తెలిపారు.