MLC Elections: స్థానిక స్థానం ‘వైసీపీ’ అభ్యర్థి ఏకగ్రీవం
ABN , First Publish Date - 2023-02-27T21:24:43+05:30 IST
తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల, చిత్తూరు (Chittoor) స్థానిక కోటా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ
చిత్తూరు: తూర్పు రాయలసీమ పట్టభద్రులు, ఉపాధ్యాయ స్థానాల, చిత్తూరు (Chittoor) స్థానిక కోటా ఉమ్మడి జిల్లా నియోజకవర్గ స్థానాలకు సంబంధించి నామినేషన్ల ఉపసంహరణ పర్వం సోమవారం మధ్యాహ్నం 3 గంటలతో ముగిసింది. స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానానికి వైసీపీ (YCP) అభ్యర్థి సిపాయి సుబ్రహ్మణ్యం (Cipai Subramanyam) ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన పంచాయతీరాజ్ చాంబర్ జిల్లా అధ్యక్షుడు చుక్కా ధనంజయ యాదవ్ నామినేషన్ తిరస్కరణకు గురవడంతో సిపాయి సుబ్రహ్మణ్యం ఒకరే బరిలో మిగిలారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు ముగిసిన తర్వాత రిటర్నింగ్ అధికారి, జేసీ వెంకటేశ్వర్ అధికారికంగా ఏకగ్రీవాన్ని ప్రకటించారు.
తూర్పు రాయలసీమ పట్టభద్ర, ఉపాధ్యాయ స్థానానికి 4,08,875 మంది ఓటర్లు తమ ఓటుహక్కు వినియోగించుకోనున్నారు. నామినేషన్ ఉపసంహరణ పర్వంలో భాగంగా పట్టభద్రుల స్థాన వైసీపీ డమ్మీ అభ్యర్థి హేమ సుశ్మిత పేర్నాటి నామినేషన్ ఉపసంహరించుకున్నారు. దాంతో పట్టభద్రుల స్థానానికి 22 మంది, ఉపాధ్యాయ స్థానానికి 8 మంది ఎన్నికల బరిలో మిగిలారు. వీరిలో ముగ్గురు మాత్రమే మహిళలు ఉన్నారు. ఈ రెండు స్థానాలకు రిటర్నింగ్ అధికారిగా కలెక్టర్ ఎం.హరినారాయణన్ వ్యవహరిస్తున్నారు.