AP Schools: హడావుడి సర్వే! విద్యార్థుల సంఖ్యపై అనుమానాలు

ABN , First Publish Date - 2023-09-14T02:47:43+05:30 IST

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క విద్యా సంవత్సరంలోనే కళ్లు తిరిగే స్థాయిలో స్కూళ్లలో చేరిపోయారు. 2022-23 విద్యా సంవత్సరంలో 71,59,441 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదివితే.. 2023-24లో ఆ సంఖ్య

AP Schools: హడావుడి సర్వే! విద్యార్థుల సంఖ్యపై అనుమానాలు

  • బడి పిల్లలపై కాకిలెక్కలు!

  • రాష్ట్రంలోని స్కూళ్ల విద్యార్థుల సంఖ్యపై సందేహాలు

  • 2022-23లో 71 లక్షలు.. ఇప్పుడు 83 లక్షలు

  • ఏడాదిలోనే 11.81 లక్షల మంది పెరిగారట!

  • గతేడాది వరకూ వీరంతా ఏమయ్యారు?

(అమరావతి-ఆంధ్రజ్యోతి)

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో చదివే విద్యార్థుల సంఖ్య అమాంతం పెరిగిపోయింది. ఒక్క విద్యా సంవత్సరంలోనే కళ్లు తిరిగే స్థాయిలో స్కూళ్లలో చేరిపోయారు. 2022-23 విద్యా సంవత్సరంలో 71,59,441 మంది విద్యార్థులు పాఠశాలల్లో చదివితే.. 2023-24లో ఆ సంఖ్య 83,40,874కు చేరింది. అంటే ఒక్క ఏడాదిలో ఏకంగా 11,81,433 మంది పెరిగారన్న మాట! ఇవి ప్రభుత్వమే వెల్లడించిన గణాంకాలు. గతేడాది విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోందని విమర్శలు వచ్చిన సమయంలో తాజా గణాంకాలను పాఠశాల విద్యాశాఖ అధికారులు విడుదల చేశారు. తాజాగా పెద్దఎత్తున పిల్లలు మృతి చెందారని వలంటీర్ల సర్వేలో తేలిన నేపథ్యంలో ఇప్పుడు తాజా లెక్కలను ప్రభుత్వం వెల్లడించింది. ఆ లెక్కల్లో అసాధారణ పెరుగుదల చూస్తుంటే ఇవీ కాకి లెక్కలేనని సందేహాలు కలుగుతున్నాయి. భారీగా సమీకరిస్తున్న రుణాలు, సంక్షేమ పథకాల ద్వారా చేస్తున్న ఖర్చులపై ప్రభుత్వ గణాంకాలకు, వాస్తవాలకు ఎక్కడా పొంతన ఉండడం లేదు. ఇప్పుడు అదే తరహాలో విద్యార్థులూ ఎక్కువగా ఉన్నట్లు చూపించే ప్రయత్నాలు మొదలుపెట్టింది.

రాష్ట్రంలోని ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్‌, ఇతర అన్ని విద్యా సంస్థల్లో కలిపి... 2015-16 విద్యా సంవత్సరంలో 69.07లక్షల మంది విద్యార్థులు చదివారు. 2016-17లో 68.48 లక్షలకు తగ్గింది. ఆ తర్వాత 2017-18లో 69.75 లక్షలు, 2018-19లో 70.43 లక్షలు, 2019-20లో 72.43 లక్షలు, 2020-21లో 73.12 లక్షలు, 2021-22లో 72.45 లక్షలు, 2022-23లో 71.59 లక్షలుగా ఉంది. జగన్‌ ప్రభుత్వ హయాంలో రెండుసార్లు విద్యార్థుల సంఖ్య తగ్గింది. ఇక కొవిడ్‌ సమయంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు పెరిగితే అది తమ ఘనతేనని ప్రభుత్వ పెద్దలు ప్రచారం చేసుకున్నారు. కరోనా తగ్గాక మళ్లీ విద్యార్థుల సంఖ్య తగ్గిపోతే మాత్రం కిక్కురుమనడం లేదు. 2015-16 నుంచి లెక్కలు పరిశీలిస్తే 2022-23 నాటికి కేవలం 2.6 లక్షల మంది మాత్రమే విద్యార్థులు పెరిగారు. ఎనిమిదేళ్లలో 2.6 లక్షలు పెరిగితే.. ఒక్క సంవత్సరంలో 11.81 లక్షల మంది ఎలా పెరుగుతారు? ఇతరరాష్ట్రాల విద్యార్థులు వచ్చారా.. అనే అనుమానాలు తలెత్తుతున్నాయి.

హడావుడి సర్వే

ఇటీవల ప్రభుత్వం వంద శాతం విద్యార్థుల నమోదు(జీఈఆర్‌) లక్ష్యంతో ఒక సర్వే చేపట్టింది. బడి మానేసిన, బడి బయట ఉన్న బడి ఈడు పిల్లలపై సచివాలయాల ద్వారా వలంటీర్లతో సర్వే చేపట్టింది. వారి పరిధిలో ఎంత మంది విద్యార్థులు బడికి దూరంగా ఉన్నారు.. అందుకు కారణాలేంటన్న అంశాలపై సర్వే చేశారు. పేరుకు సర్వే అయినా ఇష్టానుసారంగా విద్యార్థుల లెక్కలు అందులో నమోదుచేశారు. ఈ క్రమంలోనే 62 వేల మంది బడి ఈడు పిల్లలు చనిపోయినట్లు పేర్కొన్నారు. ఇక గతేడాది టెన్త్‌ ఫెయిల్‌ అయిన విద్యార్థులనూ తిరిగి ఇందులో కలిపేశారు. కొన్నిచోట్ల అంగన్‌వాడీ విద్యార్థులనూ చూపించారు. కొన్ని పాఠశాలల్లో అసలు బడికే రాని పిల్లలను తిరిగి బడుల్లో చేర్పించినట్లుగా తప్పుగా నమోదుచేశారు. అవన్నీ కలిపి ఇప్పుడు భారీ సంఖ్యగా కనిపిస్తోంది.

ప్రభుత్వం విడుదల చేసిన కొత్త లెక్కలతో విద్యా కానుక సంఖ్యపైనా అనుమానాలు పెరుగుతున్నాయి. ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 39 లక్షలు దాటలేదు. దారుణంగా సంఖ్య పడిపోవడంతో ప్రభుత్వం ఎంత మందికి విద్యాకానుకలు ఇచ్చిందీ గోప్యంగా ఉంచుతోంది. ఇప్పుడు భారీగా పిల్లలు పెరిగినట్లు చూపిస్తుండడంతో విద్యా కానుకలూ భారీగా ఇచ్చినట్లు చూపుతారన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే భారీ రేట్లతో కానుకలు కొనుగోలు చేశారు. రేట్లు పెంచినా బ్యాగుల్లో నాణ్యత మాత్రం పెరుగలేదు. ప్రభుత్వం ఇచ్చిన బ్యాగులను విద్యార్థులు వినియోగించడం లేదు.

Updated Date - 2023-09-14T10:38:32+05:30 IST