CM Jagan: జగన్ పర్యటనకు వెయ్యి మంది పోలీసులు

ABN , First Publish Date - 2023-06-05T21:11:08+05:30 IST

సీఎం జగన్ (CM Jagan) రేపు (మంగళవారం) పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను సందర్శించనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు పోలవరానికి హెలికాప్టర్‌లో వస్తారు.

CM Jagan: జగన్ పర్యటనకు వెయ్యి మంది పోలీసులు

పోలవరం: సీఎం జగన్ (CM Jagan) రేపు (మంగళవారం) పోలవరం ప్రాజెక్టు (Polavaram project)ను సందర్శించనున్నారు. రేపు ఉదయం 10.15 గంటలకు పోలవరానికి హెలికాప్టర్‌లో వస్తారు. లోయర్‌ కాఫర్‌ డామ్‌, అప్పర్‌ కాఫర్‌ డ్యామ్‌, స్పిల్‌ వే, ఎర్త్‌ కమ్‌ రాక్‌ ఫిల్‌ డామ్‌ తదితర నిర్మాణ ప్రాంతాలను పరిశీలించి, పనుల పురోగతిని తెలుసుకుంటారు. ప్రాజెక్టు సైటులోని సమావేశ మందిరంలో ఇరిగేషన్‌ ఇంజనీర్లు, వివిధ శాఖల అధికారులతో ప్రాజెక్టు పనుల పురోగతి, పునరావాస కార్యక్రమాల అమలుపై సమీక్షిస్తారు. అనంతరం హెలికాప్టర్‌లో తాడేపల్లి బయలుదేరి వెళతారు.

జగన్‌ మంగళవారం పోలవరం ప్రాజెక్టు పరిశీలనకు రానున్న నేపథ్యంలో సోమవారం భారీ స్థాయిలో భద్రతా బలగాలను మోహరింపజేశారు. ఉమ్మడి శ్రీకాకుళం, విజయనగరం, తూర్పు, పశ్చిమ గోదావరి (West Godavari), కృష్ణా జిల్లాల నుంచి వెయ్యి మంది పోలీసులను ప్రత్యేక బస్సుల్లో రప్పించారు. పోలవరం గ్రామం నుంచి ప్రాజెక్టు ప్రాంతం వరకు అడుగడుగున గస్తీ నిర్వహిస్తున్నారు. ఒక్కసారిగా ఇంత మంది పోలీసులు రావడంతో పోలవరం ఖాకీలతో నిండిపోయింది. ఏర్పాట్లను కలెక్టర్‌ ప్రసన్న వెంకటేశ్‌, డీఐజీ అశోక్‌కుమార్‌ తదితరులు పరిశీలించారు. బాంబ్‌, డాగ్‌ స్క్వాడ్‌ బృందాలు తనిఖీలు చేశాయి.

సీఎంగా నాలుగోసారి రాక

జగన్‌ సీఎం అయిన తర్వాత పోలవరం ప్రాజెక్టుకు రావడం ఇది నాలుగో సారి. తొలిసారి 2019 జూన్‌ 20, రెండోసారి అదే ఏడాది నవంబరు 4, మూడోసారి 2020 డిసెంబర్‌ 12వ తేదీన వచ్చారు. పనుల పురోగతి, పునరావాసంపై సమీక్షించారు. 2021 జూలై 19న ఏరియల్‌ సర్వే చేశారు. ఈ నెల ఆరో తేదీన జగన్‌ రానుండడంతో ఇది నాలుగోసారి అవుతుంది. టీడీపీ అధినేత, అప్పటి సీఎం చంద్రబాబు తన ఐదేళ్ళ పాలనలో పోలవరం ప్రాజెక్టుని 28 సార్లు నేరుగాను, 78 సార్లు వర్చువల్‌ పరిశీలన చేశారు. ప్రతి సోమవారం పోలవరం పేరిట పోలవరం ప్రాజెక్టు పనుల స్థితిగతులను చంద్రబాబు పరిశీలించేవారు. టీడీపీ హయాంలోనే ప్రాజెక్టు పనులు శరవేగంగా జరిగాయని, ప్రస్తుతం పని చేస్తున్న ఇంజనీర్లు, కార్మికులు చెబుతున్నారు.

Updated Date - 2023-06-05T21:11:08+05:30 IST