TDP: టీడీపీ సీనియర్ నేత లాలం భాస్కరరావు కన్నుమూత
ABN , First Publish Date - 2023-07-06T14:23:35+05:30 IST
టీడీపీ సీనియర్ నేత లాలం భాస్కరరావు కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.
విశాఖపట్నం: టీడీపీ సీనియర్ నేత లాలం భాస్కరరావు (TDP Leader Lalam Bhaskar rao) కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా పరిస్థితి విషమించడంతో కాసేపటి క్రితమే లాలం భాస్కరరావు తుదిశ్వాస విడిచారు. నెలరోజుల క్రితమే టీడీపీ నేతకు హార్ట్ ఆపరేషన్ జరిగింది. కోలుకుంటారని భావించిన భాస్కరరావు తీవ్ర అనారోగ్యానికి గురై కన్నుమూశారు. లాలం భాస్కరరావు పార్ధీవదేహాన్ని టీడీపీ కార్యాలయానికి తరలించారు. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, పార్టీ నేతలు గండిబాబ్జీ, ప్రగడ నాగేశ్వరరావు, పల్లా శ్రీనివాసరావు చివరిసారి లాలం భాస్కరరావు పార్ధివదేహాన్ని సందర్శించి నివాళులు అర్పించారు. లాలం భాస్కరరావుకు నివాళులర్పించేందుకు జనసేన నాయకుడు సుందరపు విజయ్ కుమార్ వచ్చారు. నేతల నివాళులనంతరం టీడీపీ కార్యాలయం నుంచి లాలం భాస్కరరావు పార్ధీవ దేహాన్ని స్వగ్రామం లాలం కోడూరుకు తరలించారు. లాలం భాస్కరరావు మృతిపట్ల టీడీపీ నేతలు, కారకర్తలు సంతాపం తెలిపారు. ఆయన ఆత్మకు శాంతి కూరాలని ప్రార్థించారు.
టీడీపీ నేతల సంతాపం...
టీడీపీ సీనియర్ నేత లాలం భాస్కర్ రావు మృతితో తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యానని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ అన్నారు. తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ గలిగిన నాయకుడిని కోల్పోయిందన్నారు. వారి ఆత్మకి శాంతి కలగాలని దేవుడిని ప్రార్థిస్తున్నానని.. లాలం భాస్కర్ రావు కుటుంబసభ్యులకు లోకేష్ తన ప్రగాఢ సంతాపం తెలియజేశారు.
లాలం భాస్కరరావు మృతిపట్లం మాజీ మంత్రి బండారు సత్యనారాయణ సంతాపం తెలిపారు. లాలం భాస్కరరావు తన చిరకాల మిత్రుడు, ఆత్మీయుడని అన్నారు. 40 సంవత్సరాలు పైబడి రాజకీయాల్లో కలిసి ప్రయాణం చేశామని గుర్తుచేసుకున్నారు. ఆయన మృతి పట్ల బండారు సత్యనారాయణ ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ... కుటుంబానికి ఆ భగవంతుడు మనోధైర్యాన్ని ఇవ్వాలని కోరారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత లాలం భాస్కరరావు హఠాన్మరణానికి చింతిస్తున్నామని టీడీపీ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు అన్నారు. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. తెలుగుదేశం పార్టీకి భాస్కరరావు చేసిన సేవలు మరువలేనివని.. ఆయన లేని లోటు ఎవరూ తీర్చ లేనిదని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని ప్రార్థిస్తున్నామని తెలిపారు.
తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకుడు లాలం భాస్కర రావు మృతి పట్ల ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. భాస్కర్ రావు ఆత్మకు శాంతి చేకూరాలని, అతని కుటుంబ సభ్యులకు భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని అన్నారు.
లాలం భాస్కర రావు మృతి టీడీపీకి తీరని లోటని మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు అన్నారు. ఆయన తనకు చిరకాల మిత్రుడని.. వ్యక్తిగతంగా తనకు తీరనిలోటన్నారు. పార్టీకి ఎంతో సేవ చేశారని.. అజాత శత్రువుగా ఆయనకు పేరు ఉందని తెలిపారు. ఆయన ఆరోగ్యంగా తిరిగి వస్తామనుకున్నాము కానీ ఊహించని విధంగా ఆయన దూరమయ్యారని ఆవేదన చెందారు.
లాలం భాస్కర రావు లేని లోటు ఉమ్మడి విశాఖ జిల్లాకి తీరని లోటని టీడీపీ విశాఖ జిల్లా అధ్యక్షుడు పల్లా శ్రీనివాస్ అన్నారు. రాజకీయ నాయకుడిగానే కాదు సంఘసేవకుడిగా ఆయనకు ఎంతో పేరు ఉందన్నారు. వారి కుటుంబ సభ్యులకు పార్టీ అండగా ఉందని తెలిపారు.