Vizag steel plant: ఉక్కుకు మరో చిక్కు
ABN , First Publish Date - 2023-10-04T03:43:45+05:30 IST
విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కష్టాలు ఒక దానివెంట మరొకటి వెంటాడుతున్నాయి.
ఐరన్ ఓర్‌కు కటకట.. పూర్తిగా నిండుకున్న నిల్వలు
కేకే లైన్‌లో అడ్డంకులు..
బైలదిల్లా నుంచి నిలిచిన సరఫరా
కర్ణాటక నుంచి పంపేందుకు
ముందుకురాని ఎన్‌ఎండీసీ
రెండో బ్లాస్ట్ ఫర్నేస్ కూడా షట్‌డౌన్
వారానికి రూ.140 కోట్ల నష్టం
చోద్యం చూస్తున్న కేంద్రం, రాష్ట్రం
(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం స్టీల్ ప్లాంటును కష్టాలు ఒక దానివెంట మరొకటి వెంటాడుతున్నాయి. కేంద్రం ప్రైవేటీకరణ నిర్ణయం తీసుకున్న తర్వాత అన్ని వైపుల నుంచీ సహాయ నిరాకరణ మొదలైంది. మొన్నటివరకు కోకింగ్ కోల్ సమస్య ఉండేది. అయితే టాటా ఇంటర్నేషనల్ సంస్థ రూ.830 కోట్ల రుణం ఇవ్వడంతో ఆస్ట్రేలియా, రష్యాల నుంచి కోకింగ్ కోల్ వస్తోంది. ఈ సమస్య తీరిందిలే అనుకుంటే ఇప్పుడు ఐరన్ ఓర్ నిల్వలు పూర్తిగా అడుగంటి పోయాయి. ఓర్‌ను నిల్వ చేసే బెడ్లను ఊడ్చి మరీ ప్రస్తుత అవసరాలు తీర్చుకుంటున్నారు. నేషనల్ మినరల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ (ఎన్‌ఎండీసి)కు చెందిన ఛత్తీస్‌గఢ్‌లోని బైలదిల్లా గనుల నుంచి ఐరన్ ఓర్ కిరండోల్-కొత్తవలస (కేకే లైన్)మార్గంలో స్టీల్‌ప్లాంటుకు వస్తుండేది. రెండు నెలల క్రితం వరకు ఎన్‌ఎండీసీ ఐరన్ ఓర్ అవసరమైనంత ఇవ్వకుండా ఇబ్బంది పెట్టింది. ఇది జాతీయ స్థాయిలో చర్చనీయాంశం కావడంతో సరఫరాను మెరుగుపరిచింది. అయితే పది రోజులుగా కురుస్తున్న వర్షాలు, విరిగిపడుతున్న కొండచరియలు, నిలిచిపోయిన రైళ్ల రాకపోకలతో ఓర్ సరఫరా స్తంభించిుంది. దాంతో ఇక్కడి నిల్వలు కరిగిపోయాయి. ఇలాంటి సమయంలో ఎన్‌ఎండీసీ ప్రత్యామ్నాయ ఏర్పాట్ల ద్వారా ఓర్ ఇవ్వాలి. బళ్లారి నుంచి సరఫరా చేయాలి. ఎన్‌ఎండీసీ, ఆర్‌ఐఎన్‌ఎల్ (విశాఖ ఉక్కు) రెండూ స్టీల్ మంత్రిత్వ శాఖలోనే ఉన్నాయి. ఇక్కడ ఇబ్బంది వచ్చింది కాబట్టి కేంద్రం చొరవ తీసుకొని ఓర్ పంపించాలి. కానీ మౌనంగా ఉంది.
ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం
విశాఖ స్టీల్‌ప్లాంటుని కేంద్రం ప్రణాళికాబద్ధంగా నిర్వీర్యం చేస్తోంది. తగినన్ని ముడిపదార్థాలు లేకపోవడంతో ప్లాంటులోని ఒక బ్లాస్ట్ ఫర్నేస్‌ని 21 నెలల క్రితం మూసేశారు. ఐరన్ ఓర్ నిల్వలు తగినంత లేకపోవడంతో రెండు రోజుల క్రితం రెండో బ్లాస్ట్ ఫర్నేస్‌ను కూడా మూసేసినట్టు తెలిసింది. దీన్ని మూసేస్తే రోజుకు రూ.20 కోట్లు చొప్పున వారానికి రూ.140 కోట్లు కోల్పోవాల్సి ఉంటుందని కార్మిక సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 75 లక్షల టన్నుల వార్షిక సామర్థ్యం కలిగిన ప్లాంటులో 50 లక్షల టన్నులే ఉత్పత్తి జరుగుతోంది. రెండో బ్లాస్ట్ ఫర్నేస్‌ను మూసేయడం వల్ల ఇప్పుడది కూడా తగ్గిపోయింది. దేశంలో స్టీల్‌కు భారీ డిమాండ్ ఉంది. చాలాచోట్ల ప్లాంట్లను విస్తరిస్తున్నారు. కొత్త ప్లాంట్లు నెలకొల్పుతున్నారు. నైపుణ్యం కలిగిన కార్మికులతో ఆధునిక యంత్ర పరికరాలు కలిగిన విశాఖ స్టీల్‌ప్లాంటును మాత్రం పూర్తి సామర్థ్యంతో పనిచేయనివ్వకుండా అడ్డుకుంటున్నారు. తద్వారా బీజేపీకి అండగా నిలిచే కార్పొరేట్ సంస్థలకు కట్టబెట్టే ప్రయత్నాలు జరుగుతున్నాయి. విశాఖ ఉక్కు కార్మిక సంఘాలు వేయి రోజులుగా ఉద్యమం చేస్తున్నాయి. సమస్యపై పార్టీలను కలుపుకొని వెళ్లాల్సిన బాధ్యత అధికార పార్టీ వైసీపీది. కానీ ఆ దిశగా ఒక్క ప్రయత్నం కూడా చేయలేదు. ఇదంతా స్టీల్‌ప్లాంటును నిర్వీర్యం చేసి ప్రైవేటు సంస్థలకు కట్టబెట్టడానికి జరుగుతున్న కుట్రలో భాగమేనని స్టీల్‌ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ అన్నారు. బళ్లారి నుంచి ఓర్ ఇవ్వాలని డిమాండ్ చేశారు.