Viveka Case: వివేకా కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా పరిణామం ఇది..

ABN , First Publish Date - 2023-04-20T14:32:42+05:30 IST

మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది.

Viveka Case: వివేకా కేసులో ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి బెయిల్ పిటిషన్‌పై తాజా పరిణామం ఇది..

హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో (YS Vivekananda Reddy Case) ఏ1గా ఉన్న ఎర్రగంగిరెడ్డి (Errabangi Reddy) బెయిల్‌ రద్దు పిటిషన్‌పై విచారణ వాయిదా పడింది. ఎర్రగంగిరెడ్డి బెయిల్‌ పిటిషన్‌ రద్దు కోరుతూ సీబీఐ (CBI) దాఖలు చేసిన పిటిషన్‌పై గురువారం తెలంగాణ హైకోర్టులో (Telangana High Court) విచారణ జరుగగా సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు చేయాలని హైకోర్టులో సీబీఐ వాదించింది. వివేకా హత్యకు కుట్ర చేసింది గంగిరెడ్డే అని.. వివేకను హత్య చేసింది గంగిరెడ్డే అని తెలిపింది. సీబీఐ దర్యాప్తుకు ముందు సిట్ ఛార్జ్‌షీట్ దాఖలు చేయకపోవడం వల్లే గంగిరెడ్డి బెయిల్ పొందాడని కోర్టుకు సీబీఐ తెలియజేసింది. వివేకా హత్య కేసులో దర్యాప్తు కీలక దశలో ఉందని.. సుప్రీంకోర్టు పరిశీలన మేరకు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌కు అర్హుడే కాదని సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపించారు.

అయితే.. అన్ని అంశాలను పరిశీలించే గంగిరెడ్డి బెయిల్ రద్దుకు ఏపీ హైకోర్టు గతంలో నిరాకరించిందని ఎర్రగంగిరెడ్డి తరపు సీనియర్ లాయర్ శేషాద్రి నాయుడు తెలిపారు. వివేకా హత్యకేసుపై ప్రభావం చూపుతాడని, సాక్షులను బెదిరిస్తాడని ఊహించి గంగిరెడ్డి బెయిల్ రద్దు చెయ్యొద్దని అన్నారు. ఇరువురి వాదనలు విన్న హైకోర్టు ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై విచారణను ఈనెల 25కు వాయిదా వేసింది.

కాగా.. మాజీ మంత్రి వైఎస్‌ వివేకానందరెడ్డి హత్య కేసులో ఏ-1గా ఉన్న ఎర్ర గంగిరెడ్డి అలియాస్‌ తుమ్మలపల్లి గంగిరెడ్డి. వివేకా హత్య కేసులో గంగిరెడ్డిని ఏపీ పోలీసులు 2019 మార్చి 28న అరెస్టు చేశారు. ఆ తర్వాత 90 రోజులు గడచినా చార్జిషీట్‌ దాఖలు చేయకపోవడంతో అదే ఏడాది జూన్‌ 27న గంగిరెడ్డికి డీఫాల్ట్‌ బెయిల్‌ వచ్చింది. ఏపీ పోలీసుల దర్యాప్తు ఆశించిన స్థాయిలో లేదని.. కేసును సీబీఐకి ఇవ్వాలని వివేకా కుమార్తె ఏపీ హైకోర్టును ఆశ్రయించగా.. కోర్టు సీబీఐకి అప్పగించింది. తదనంతరం గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ కోరగా... కోర్టు ఆ పిటిషన్‌ కొట్టివేసింది. దీంతో సీబీఐ సుప్రీంకోర్టులో అప్పీల్‌ చేసింది. తీవ్ర నేరారోపణలు ఉన్న కేసుల్లో స్పష్టమైన ఆధారాలు ఉంటే డీఫాల్ట్‌ బెయిల్‌ను రద్దు చేయొచ్చని సుప్రీంకోర్టు పేర్కొంది. సీబీఐ పిటిషన్‌పై మెరిట్‌ ఆధారంగా విచారణ చేపట్టి నిర్ణయం తీసుకోవాలంటూ కేసును మళ్లీ ఏపీ హైకోర్టుకు రిమాండ్‌ చేసింది. తదనంతర పరిణామాల్లో వివేకా హత్య కేసు దర్యాప్తు తెలంగాణకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ రద్దు చేయాలని సీబీఐ దాఖలు చేసిన పిటిషన్‌ సుప్రీంకోర్టు నుంచి ఏపీ హైకోర్టుకు.. అక్కడి నుంచి తెలంగాణ హైకోర్టుకు బదిలీ అయింది. తాజాగా గంగిరెడ్డి బెయిల్ రద్దు పిటిషన్‌పై హైకోర్టులో విచారణ జరుగగా.. సీబీఐ వాదనలు వినిపించింది. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి హైకోర్టు వాయిదా వేసింది.

Updated Date - 2023-04-20T14:46:45+05:30 IST