Vizainagaram Dist.: ప్రభుత్వ టీచర్ హత్యతో ఉద్రిక్తత
ABN , First Publish Date - 2023-07-16T10:56:57+05:30 IST
విజయనగరం జిల్లా: రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యతో తెర్లాం మండలం ఉద్వవోలు ఉద్రిక్తతగా మారింది. వైసీపీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బాధిత వర్గానికి చెందినవారు నిందితుల ఇళ్లను ముట్టడించారు.
విజయనగరం జిల్లా: రాజాంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఏగిరెడ్డి కృష్ణ హత్యతో తెర్లాం మండలం ఉద్వవోలు ఉద్రిక్తతగా మారింది. వైసీపీలోని వర్గ విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. బాధిత వర్గానికి చెందినవారు నిందితుల ఇళ్లను ముట్టడించారు. దీంతో ప్రత్యర్ధి వర్గం ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ క్రమంలో గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా 200 మంది పోలీసులతో పికెటింగ్ ఏర్పాటు చేశారు. క్రిష్ణమూర్తి అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడిని ప్రత్యర్ధి వర్గానికి చెందినవారు వాహనంతో ఢీకొట్టి దారుణంగా హతమార్చారు.
పూర్తి వివరాలు...
వాహనంతో ఢీకొట్టారు. అక్కడినుంచి 100 మీటర్లమేర ఈడ్చుకునిపోయారు. రోడ్డుపక్క రక్తపుమడుగులో విలవిల్లాడుతున్నా వదలలేదు. దాడిచేసి రాడ్లతో కొట్టారు. కర్కశంగా కళ్లు పొడిచేశారు. ఆ తర్వాత చంపేసి నెత్తుటి ముద్దగా మారిన మృతదేహాన్ని అక్కడ పడేసి వెళ్లిపోయారు. విజయనగరం జిల్లా, రాజాం మండలం, కొత్తపేట సమీపంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిని హత్యచేసిన తీరు ఇది. టీడీపీ సానుభూతిపరుడైన ఆయన తనకు ఇలాంటి పరిస్థితి వస్తుందనే రెండేళ్ల క్రితం వైసీపీలోకి మారారు. అయినా.. రాజకీయ కక్షతో ఆయనను బలి తీసుకున్నారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు తెర్లాం మండలం ఉద్దవోలు గ్రామానికి చెందిన ఏగిరెడ్డి కృష్ణ (58) అదే మండలం కాలవరాజు పేటలో ప్రభుత్వ ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. కొన్నేళ్లుగా రాజాం పట్టణంలోని గాంధీనగర్‌లో నివాసం ఉంటున్నారు. తెలుగుదేశంపార్టీ ఆవిర్భావం నుంచీ ఆ పార్టీ పట్ల అభిమానం పెంచుకున్నారు. ఐదేళ్ల పాటు ఉద్దవోలు సర్పంచ్‌గానూ పనిచేశారు. ఆతర్వాత ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చారు. అయినా.. గ్రామాభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు. అందరి మంచి కోరే మనిషిగా గుర్తింపు తెచ్చుకున్నారు. ఆయన ప్రతిపాదించిన వ్యక్తే ప్రతి ఎన్నికల్లోనూ సర్పంచ్‌గా గెలుస్తూ వస్తున్నారు. ఈసారీ ఆయన బలపరిచిన నేతే సర్పంచ్ అయ్యారు. నిజానికి, గ్రామంలో కృష్ణ పలుకుబడిని తగ్గించడానికి ఆయన ప్రత్యర్థి వర్గం తీవ్ర బెదిరింపులకు పాల్పడింది. ‘ప్రభుత్వం మాది. ఎలా గ్రామం బాగుపడుతుందో చూస్తాం’ అంటూ ఆయనపై ఒత్తిడిని బాగా పెంచేశారు. వారి బెదిరింపులకుతోడు, గ్రామాభివృద్ధి ఆగిపోతుందనే కారణంగా రెండేళ్ల క్రితం కృష్ణ వైసీపీకి దగ్గరయ్యారు. అయినా, ఆయనదే మాట గ్రామంలో కొనసాగడం ప్రత్యర్థి వర్గానికి నచ్చలేదు. పైగా ఈ ఏడాది ఎన్నికల్లోనూ కృష్ణ చెప్పిన వ్యక్తే సర్పంచ్‌గా గెలిపారు. దీంతో ఆయనపై ప్రత్యర్థి వర్గం కక్ష పెంచుకుంది. గ్రామంపై పట్టు సాధించాలంటే కృష్ణను అడ్డు తొలగించుకోక తప్పదని నిర్ణయానికి వచ్చింది. కృష్ణను అంతంచేసే అదును కోసం వేచి ఉన్నారు. ఈ క్రమంలో శనివారం ఎప్పటిలాగే రాజాం నుంచి తన ద్విచక్ర వాహనంపై తెర్లాం మండలం కాలవరాజుపేట వైపు కృష్ణ బయలుదేరారు. అప్పటికే అక్కడ మాటువేసిన దుండగులు.. వ్యానుతో వెనగ్గా వెళ్లి కృష్ణ బైకును వేగంగా ఢీకొట్టారు. అంతే వేగంగా కృష్ణను వ్యానుతోపాటు ఈడ్చుకుంటూ పోయారు.
తీవ్రగాయలతో రక్తపు మడుగులో కృష్ణ రోడ్డు పక్కన పడిపోయాడు. వాహనం నుంచి దిగిన వ్యక్తులు.. కృష్ణపై పడి రాడ్లతో బలంగా కొట్టారు. ఆపై కళ్లు పొడిచారు. ‘నన్ను చంపొద్దురా ప్లీజ్.. ప్లీజ్’ అని రెండు చేతులు ఎత్తి కృష్ణ వేడుకుంటున్నాడు. అలా వేడుకుంటూనే తనువు చాలించాడు. వ్యానును అక్కడే వదిలేసి హంతకులు అక్కడినుంచి వెళ్లిపోయారు.