CM Jagan: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

ABN , First Publish Date - 2023-06-06T14:32:28+05:30 IST

పోలవరం ప్రాజెక్టు పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు.

CM Jagan: పోలవరం ప్రాజెక్టు పురోగతిపై సీఎం జగన్ సమీక్ష

ఏలూరు: పోలవరం ప్రాజెక్టు (Polavaram Project) పురోగతిపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) సమీక్ష సమావేశం నిర్వహించారు. డయాఫ్రం వాల్‌ను వీలైనంత త్వరగా పూర్తిచేయాలని అధికారులను ఆదేశించారు. ఇది పూర్తైతే మెయిన్‌ డ్యాం పనులు చురుగ్గా కొనసాగడానికి అవకాశం ఉందన్నారు. నిర్వాసిత కుటుంబాలకు పునరాసంపైనా సీఎం సమీక్ష జరిపారు. పునరావాసం కాలనీల్లో అన్ని సామాజిక సౌకర్యాలు ఏర్పాటు చేయాలన్నారు. షెడ్యూలు ప్రకారం నిర్వాసిత కుటుంబాలను తరలించాలని తెలిపారు. పోలవరాన్ని మంచి టూరిస్ట్‌ స్పాట్‌గా తీర్చిదిద్దాలని.. పోలవరం వద్ద మంచి బ్రిడ్జిని నిర్మించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. పర్యాటకులు ఉండేందుకు మంచి సదుపాయాలతో ఇక్కడ హోటల్‌ ఏర్పాటుకు కూడా చర్యలు తీసుకోవాలన్నారు. మరిన్ని మౌలిక సదుపాయాలతో మంచి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దాలని జగన్ సూచించారు.

చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే యత్నం: జగన్

సీఎం సమీక్షలో ప్రాజెక్టు గైడ్ బండ్ దెబ్బతిన్న విషయాన్ని అధికారులు ప్రస్తావించారు. దీన్ని సరిదిద్దడం పెద్ద సమస్యకాదని, సీడబ్ల్యూసీ పరిశీలన కాగానే వారి సూచనల మేరకు వెంటనే మరమ్మతులు చేస్తామని అధికారులు తెలిపారు. ప్రాజెక్టు నిర్మాణాల్లో సహజంగానే చిన్న చిన్న సమస్యలు వస్తాయని.. వాటిని గమనించుకుంటూ ఎప్పటికప్పుడు మరమ్మతులు చేసుకుంటూ ముందుకు సాగుతారన్నారు. గత ప్రభుత్వ హయాంలో ఎగువ కాఫర్‌ డ్యాంలో ఖాళీలు వదిలేశారన్నారు. ఈ ఖాళీలగుండా వరదనీరు అతి వేగంతో ప్రవహించడం వల్ల ప్రాజెక్టు నిర్మాణాలకు తీవ్ర నష్టం వాటిల్లిందని తెలిపారు. ఈఎస్‌ఆర్‌ఎఫ్‌ డ్యాం నిర్మాణానికి కీలకమైన డయాఫ్రంవాల్‌ దారుణంగా దెబ్బతిందన్నారు. దీనివల్ల ప్రాజెక్టు ఆలస్యంకావడమే కాదు, రూ.2వేల కోట్లు అదనంగా ఖర్చు చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చారు. ప్రాజెక్టు స్ట్రక్చర్‌తో ఏమాత్రం సంబంధం లేనిది గైడ్‌వాల్‌ అన్నారు. ఇంత చిన్న సమస్యను పెద్ద విపత్తులాగ చూపించే ప్రయత్నం చేస్తున్నారని సీఎం జగన్ పేర్కొన్నారు.

Updated Date - 2023-06-06T14:32:28+05:30 IST