TDP: జల్లేరు వాగులో టీడీపీ నేతల జలదీక్ష.. ఎందుకంటే..
ABN , First Publish Date - 2023-06-07T16:11:41+05:30 IST
జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెం వద్ద టీడీపీ నేతలు జలదీక్షకు దిగారు.
ఏలూరు: జిల్లాలోని జంగారెడ్డిగూడెం మండలం పట్టేన్నపాలెం వద్ద టీడీపీ నేతలు (TDP Leaders) జలదీక్షకు దిగారు. జల్లేరు వాగుపై అసంపూర్తిగా నిర్మించిన బ్రిడ్జిని వెంటనే పూర్తిస్థాయిలో నిర్మించాలని ఈ దీక్ష చేపట్టారు. టీడీపీ నేతలు బోరగం శ్రీనివాసులు (Boragam Srinivasulu), డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు తదితరులు జలదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోలవరం నియోజకవర్గ ఇంచార్జ్ బోరగం శ్రీనివాస్ మాట్లాడుతూ... ఏజెన్సీలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి వెళ్లే దారిలో పాటు పోలవరం ముంపు ప్రాంతాలైన వేలేరుపాడు, కుక్కునూరు మండలాల ప్రజలకు ఇది ప్రధాన రహదారని తెలిపారు. ఈ బ్రిడ్జిని వెంటనే నిర్మాణం చెయ్యాలని డిమాండ్ చేశారు. ఈ బ్రిడ్జ్ నిర్మాణం కోసం ఐటీడీఏ పరిధిలో నిధులు కూడా ఉన్నాయని అన్నారు.
రాష్ట్ర అధికార ప్రతినిధి డాక్టర్ దాసరి శ్యామ్ చంద్ర శేషు మాట్లాడుతూ.. ఈ బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని ఇప్పటికి 3 సార్లు స్పందన, 3 సార్లు జగన్ననకు చెబుతాం 1902 కార్యక్రమానికి పిర్యాదు చేశామని చెప్పారు. అయితే టెండర్ ఓపెన్లో ఉంది ఎవరైనా కాంట్రాక్టర్లు ముందుకు వస్తే పూర్తి చేస్తామంటూ ప్రతీసారి అదే సమాధానం వస్తోందన్నారు. బ్రిడ్జి నిర్మాణం కోసం రూ.4 కోట్లు, డైవర్షన్ రోడ్డు కోసం మరో రూ.40 లక్షలు నిధులు ఉన్నాయని... గుత్తేదారులు రాకపోతే ప్రభుత్వమే సత్వర నిర్మాణ పనులు చేపట్టాలని డిమాండ్ చేశారు. రాబోయేది వర్షాకాలమని వెంటనే పనులు చేపట్టకపోతే ఈ ప్రాంత ప్రజలతో కలిసి పెద్దఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి చిట్టిబోయిన రామలింగేశ్వర రావు, జంగారెడ్డిగూడెం మండల ఎస్సీసెల్ అధ్యక్షుడు గొల్లమండల్ శ్రీనివాస్, అధికార ప్రతినిధి తాళ్లూరి వెంకటేశ్వరరావు, నియోజవర్గ తెలుగు యువత సోషల్ మీడియా కోఆర్డినేటర్ మర్రి రమేష్, గంగుల నాగు తదితరులు పాల్గొన్నారు.