Janasena Leader: పవన్‌ను విమర్శిస్తే ఊరుకోం.. ఖబడ్డార్ జగన్
ABN , First Publish Date - 2023-05-29T12:49:35+05:30 IST
వైసీపీ ప్రభుత్వంపై జనసేన ఏలూరు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.
ఏలూరు: వైసీపీ ప్రభుత్వంపై జనసేన ఏలూరు ఇన్‌చార్జ్ రెడ్డి అప్పలనాయుడు (Janasena Leader Reddy Appalnaidu) తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ఒంగోలులో జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌పై (Janasena Chief Pawan kalyan) వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలపై మాట్లాడుతూ.. పరిపాలన చేతకాక ఫ్లెక్సీ వివాదం తెరపైకి తెచ్చారన్నారు. పవన్ కళ్యాణ్‌ను, జన సైనికులను విమర్శిస్తే ఊరుకోమని... తమ నాయకుల జోలికి వేస్తే ఖబడ్దార్ జగన్‌మోహన్ రెడ్డి (AP CM YS Jaganmohan Reddy) అంటూ హెచ్చరించారు. జగన్‌మోహన్ రెడ్డి ప్రజలకు, పవన్ కళ్యాణ్‌కు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. అవినీతిపరుడైన జగన్‌మోహన్ రెడ్డి.. నీతిమంతుడైన పవన్ కళ్యాణ్‌ను విమర్శించడం విడ్డూరంగా ఉందన్నారు. వచ్చే ఎన్నికల్లో ప్రజలు తగిన గుణపాఠం చెప్పి జగన్ ఇంటికి పంపించడం ఖాయమని జనసేన నేత రెడ్డి అప్పలనాయుడు స్పష్టం చేశారు.
అసలేం జరిగిందంటే..
ఒంగోలులో అధికార పార్టీ వైసీపీ, జనసేన మధ్య ఫ్లెక్సీల వివాదం చోటు చేసుకుంది. పేదలకు, పెత్తందారులకు మధ్య యుద్ధం పేరిట ఒంగోలులో నిన్న వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసింది. పవన్ కల్యాణ్ పల్లకి మోస్తున్నట్టు ఫ్లెక్సీలు ఏర్పాటు అయ్యాయి. అయితే ఈ ఫ్లెక్సీలపై జనసేన శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేశారు. సమాజంలో అశాంతిని కలిగించే విధంగా వైసీపీ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసిందని జనసేన ఆందోళనకు దిగింది. ఫ్లెక్సీలు తొలగించాలని డిమాండ్ చేసింది. అలాగే వైసీపీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలకు ధీటుగా జనసేన శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. "రాక్షస పాలనకి అంతం- ప్రజా పాలనకి ఆరంభం" అంటూ జనసేన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. ‘‘జనసేన పార్టీ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలలో జగన్ ఒక చేతిలో గొడ్డలి.. మరో చేతిలో వైఎస్ వివేకానంద రెడ్డి తల. దుష్ట శక్తులపై విల్లు ఎక్కుపెట్టినట్లు పవన్ కళ్యాణ్ ఫొటో’’ను ఫ్లెక్సీలో ఏర్పాటు చేశారు. జనసేన ఫ్లెక్సీలు తొలగించేందుకు మున్సిపల్ సిబ్బంది, వైసీపీ నాయకులు యత్నించగా.. జనసేన కార్యకర్తలు అడ్డుకున్నారు.