AP News: అగ్నిప్రమాదంతో రోడ్డున పడ్డ కుటుంబాన్ని ఆదుకున్న టీడీపీ నేత
ABN , First Publish Date - 2023-03-07T15:28:06+05:30 IST
తమ పార్టీ అధికారంలో లేకపోయినా నిరాశ్రయులైన ఓ కుటుంబాన్ని ఆదుకుని తాము సామాజిక ధర్మాన్ని పాటించామని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకట్రాజు అన్నారు.
పశ్చిమగోదావరి: టీడీపీ పార్టీ అధికారంలో లేకపోయినా నిరాశ్రయులైన ఓ కుటుంబాన్ని ఆదుకుని తాము సామాజిక ధర్మాన్ని పాటించామని గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి వెంకట్రాజు (Gopalapuram Constituency TDP Incharge Maddipati Venkataraju) అన్నారు. ఏలూరు జిల్లా ద్వారకాతిరుమల మండలంలోని వేంపాడు శివారు చవలవారి గూడెంలో గత నెల 26న విద్యుత్ షార్ట్ సర్కూట్ కారణంగా జరిగిన అగ్రిప్రమాదంలో జోనుబోయిన వెంకటేశ్వరరావుకు చెందిన తాటాకిల్లు పూర్తిగా దగ్ధమైంది. ఈ అగ్నిప్రమాదంలో ఇంట్లో ఉంచిన రూ.50వేలు నగదు, నాలుగు కాసుల బంగారం, పొలం దస్తావేజులు, పాస్ పుస్తకం అగ్నికి ఆహుతై బాధిత కుటుంబం రోడ్డున పడింది.
నిరాశ్రయులైన వారి కుటుంబాన్ని ఆదుకునేందుకు గోపాలపురం నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ మద్దిపాటి నడుం బిగించారు. ప్రమాద ఘటన జరిగిన మరుసటి రోజే మండల పార్టీ అధ్యక్షుడు లంకా సత్యన్నారాయణతో కలసి వెంకట్ రాజు ఘటనాస్థలికి వెళ్లి పరామర్శించి, ఆ కుటుంబానికి మనోధైర్యాన్ని ఇచ్చారు. అలాగే వారం రోజుల్లో తన సొంత ఖర్చుతో షెడ్ నిర్మించి ఇస్తానని హామీ ఇచ్చారు. ఇచ్చిన మాట ప్రకారం సుమారు రూ.50 వేలతో ఆ ఘమేఘాల మీద రేకుల షెడ్‌ను నిర్మించి బాధిత కుటుంబానికి అందజేశారు. ఈ సందర్భంగా మద్దిపాటి మాట్లాడుతూ... తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ సామాజిక ధర్మాన్ని పాటిస్తూ ఎవరికి ఆపద వచ్చినా అండగా నిలుస్తామన్నారు. కార్యక్రమంలో పలువురు టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.