AP News: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయం.. ఆపై బెదరింపులు.. అసలేం జరిగిందంటే..
ABN , First Publish Date - 2023-07-06T15:45:29+05:30 IST
ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అసభ్య వీడియోలుతో యువతిని యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది.
ఏలూరు: ఇన్‌స్టాగ్రామ్‌లో పరిచయమై అసభ్య వీడియోలుతో యువతిని యువకుడు బెదిరింపులకు పాల్పడిన ఘటన పశ్చిమగోదావరి జిల్లాలో చోటు చేసుకుంది. ముదినేపల్లి మండలానికి చెందిన యువతి హైదరాబాదులోని ఓ కళాశాలలో ఎంబీఏ ప్రథమ సంవత్సరం చదువుతోంది. ఈ క్రమంలో విజయనగరం జిల్లా బిట్రపాడుకు చెందిన నవీన్ అనే యువకుడు ఇన్‌స్టాగ్రామ్ ద్వారా పరిచమయ్యాడు. స్నేహితుడిగా భావించి యువకుడితో యువతి పరిచయం పెంచుకుంది. కొంతకాలానికి ప్రేమిస్తున్నానంటూ సదరు యువకుడు సందేశాలు పంపించాడు. యువతితో చనువు పెంచుకొని వీడియో కాల్ చేసి అసభ్యంగా వీడియోలు చిత్రీకరించాడు. ఆ వీడియోలను బంధువులకు, సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తానంటూ బెదిరించి యువతి నుంచి రూ.25000 వసూలు చేశాడు. ఇటీవల మరలా బెదిరిస్తూ మరో లక్ష కావాలని వేధిస్తుండడంతో యువతి తల్లిదండ్రులకు చెప్పింది. దీంతో మంగళవారం రాత్రి ఇంటి వద్దకు వస్తే నగదు ఇస్తామని తెలపడంతో సదరు వ్యక్తి వచ్చాడు. ఆ సమయంలో వ్యక్తిని పట్టుకునేందుకు తల్లిదండ్రులు, బంధువులు ప్రయత్నించగా పరారయ్యాడు. వెంటనే యువతి పోలీసులను ఆశ్రయించింది. యువతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై షణ్ముఖ సాయి కేసు నమోదు చేసి దర్యాప్తు చేసి యువకుడును అదుపులోకి తీసుకున్నారు.