TDP: మంత్రి పెద్దిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు.. సైకిల్ యాత్రను అడ్డుకున్న వారిపై చర్యలకు డిమాండ్
ABN , First Publish Date - 2023-10-21T18:48:38+05:30 IST
పుంగనూరులో టీడీపీ సైకిల్ యాత్రను అడ్డుకుని దౌర్జన్యం చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు.
తిరుపతి: పుంగనూరులో టీడీపీ సైకిల్ యాత్రను అడ్డుకుని దౌర్జన్యం చేయడంపై టీడీపీ నేతలు, కార్యకర్తలు తమ నిరసనను వ్యక్తం చేశారు. తిరుపతి ఎన్టీఆర్ సర్కిల్లో పెద్దిరెడ్డి వ్యతిరేకంగా ప్లే కార్డులతో నినాదాలు చేశారు. దౌర్జన్యం చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని టీడీపీ కార్యకర్తలు డిమాండ్ చేశారు. లేదంటే తిరుపతిలోని పెద్దిరెడ్డి ఇంటిని ముట్టడిస్తామని, పెద్దిరెడ్డిని అడ్డుకుంటామని టీడీపీ నేతలు హెచ్చరించారు.
శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యర్తలపై పుంగనూరులో మంత్రి పెద్దిరెడ్డి అనుచరుల దాడిపై టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ (TDP Leader Lokesh) తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ‘‘సైకో పాలనలో సైకిల్ తొక్కినా నేరమే! పాపాల పెద్దిరెడ్డి అరాచకాలకు అడ్డుఅదుపు లేకుండా పోయింది. అహంకారం నెత్తికెక్కిన పెద్దిరెడ్డి అనుచరుడు సూరి పుంగనూరు మండలం సుగాలిమిట్ట వద్ద శ్రీకాకుళం నుంచి కుప్పం వరకూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించి, జెండాలు పీకి దాడికి పాల్పడ్డాడు. బాబుతో నేను అంటూ సైకిల్ యాత్ర చేస్తున్న టీడీపీ కార్యకర్తలపై పెద్దిరెడ్డి రౌడీ గ్యాంగ్ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాను. ప్రజలు అధికారం ఇచ్చింది టీడీపీ కార్యకర్తల చొక్కాలు విప్పించడానికి, జెండాలు పీకడానికా జగన్? వచ్చే ఎన్నికల్లో వైసీపీ నాయకుల చొక్కాలు విప్పి నడిరోడ్డు పై నిలబెట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు’’ అంటూ లోకేష్ వ్యాఖ్యలు చేశారు.
టీడీపీ అధినేత చంద్రబాబుకు మద్దతుగా శ్రీకాకుళం జిల్లా నుంచి కుప్పంనకు సైకిల్ యాత్ర చేస్తున్న ఆ పార్టీ కార్యకర్తలపై పుంగనూరులో స్థానిక వైసీపీ నేతలు దౌర్జన్యానికి పాల్పడ్డారు. ‘‘పుంగనూరులో పసుపు జెండా కనిపిస్తే చంపేస్తాం. ఇక్కడ ఉండేది మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అని తెలిసే టీడీపీ జెండాలతో వచ్చారా? ఎంత ధైర్యం ఉంటే నీతిమాలిన చంద్రబాబు కోసం సైకిల్ యాత్ర చేస్తారు? సీఎం జగన్‌రెడ్డి ద్వారా పథకాల లబ్ధి పొంది మళ్లీ టీడీపీ జెండాలతో సిగ్గులేకుండా కనిపిస్తారా?’’ అంటూ వీరంగం వేశారు. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం సుగాలిమిట్టలో శుక్రవారం సాయంత్రం ఈ సంఘటన చోటు చేసుకుంది.