Chandrababu: చంద్రబాబు పర్యటనలో వైసీపీ కవ్వింపు చర్యలు
ABN , First Publish Date - 2023-04-14T20:03:39+05:30 IST
టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శుక్రవారం గన్నవరం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు గుడివాడ నుంచి హనుమాన్‌జంక్షన్
హనుమాన్‌జంక్షన్: టీడీపీ అధినేత చంద్రబాబు (Chandrababu) శుక్రవారం గన్నవరం పర్యటనలో ఉద్రిక్తత చోటుచేసుకుంది. చంద్రబాబు గుడివాడ నుంచి హనుమాన్‌జంక్షన్ మీదుగా నూజివీడు (Nuzividu) వెళ్లారు. అక్కడ జరిగే రోడ్‌షోలో ఆయన పాల్గొన్నారు. చంద్రబాబు జంక్షన్ వస్తున్న సందర్భంలో ఎలాగైనా టీడీపీ శ్రేణులను రెచ్చగొట్టాలన్న ఉద్దేశంతో వైసీపీ కార్యకర్తలు గన్నవరం ఎమ్మెల్యే వంశీ (MLA Vamsi) ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం నుంచే కవ్వింపు చర్యలకు దిగారు. చంద్రబాబు పర్యటన సాగే దారి పొడవునా ‘అయ్యా చంద్రబాబు మాకెందీ ఖర్మ’ అంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. అయినా టీడీపీ (TDP) శ్రేణులు సంయమనంతో ముందుకు సాగారు. సాయంత్రం నాలుగు గంటల సమయంలో చంద్రబాబు కాన్వాయ్ ఆరుగొలను గ్రామం వద్దకు చేరుకుంది. అదే సమయంలో కొందరు వైసీపీ నాయకులు కార్యకర్తలు వైసీపీ జెండాలతో అంబేద్కర్ జయంతి పేరుతో బైక్ ర్యాలీ తీయడం ప్రారంభించారు. తమ అధినేత చంద్రబాబు వస్తున్నారని, కొంతసమయం ఆగాలని స్థానిక టీడీపీ నాయకులు మొవ్వా వెంకటేశ్వరరావు ర్యాలీలోని వారికి విజ్ఞప్తి చేశారు. కానీ ర్యాలీలోని వారు వినకుండా రాజు అనే వ్యక్తి చంద్రబాబు కారుకు ఎదురువెళ్లి వైసీపీ జెండా చూపించడం ప్రారంభించారు. అక్కడే ఉన్న టీడీపీ కార్యకర్తమద్దాల వెంకటేశ్వరరావువైసీపీ జెండాకు అడ్డుగా నిలబడటంతో వారిద్దరి మధ్య తోపులాట చోటుచేసుకుంది.
ఈ తోపులాటలో రాజు తన చేతిలో ఉన్న వైసీపీ జెండా (YCP flag) కర్రతో వెంకటేశ్వరరావు తలపై కొట్టాడు. వెంకటేశ్వరరావు తలపై బలమైన గాయమై తీవ్రంగా రక్తస్రావం అవడంతో అక్కడే ఉన్నగ్రామీణ వైద్యుడి వద్ద ప్రథమచికిత్స చేయించి ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయపడిన కార్యకర్తకు మెరుగైన వైద్యసాయం అందించి అతని వివరాలను పంపాలని తెలుగు రైతు ఉపాధ్యక్షుడు మొవ్వా వెంకటేశ్వరరావును చంద్రబాబు ఆదేశించారు. కాగా, మాజీ ముఖ్యమంత్రి పర్యటనలో పోలీసుల బందోబస్తు వైఫల్యం స్పష్టంగా కనిపించింది. ఆయన పర్యటనలో పట్టుమని 10 మంది పోలీసులు కూడా లేకపోవడం, ట్రాఫిక్‌ను క్రమద్ధీకరించకపోవడం చూస్తే దాడికి పోలీసుల సహకారం కూడా ఉందన్న విషయం స్పష్టమవుతుందని టీడీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. గొడవ జరిగిన తర్వాత పోలీసులు వచ్చి టీడీపీ కార్యకర్తను పక్కకు తీసుకువచ్చారే తప్ప దాడికి పాల్పడిన వారిని పట్టుకునే దిశగా దృష్టి సారించకపోవడం గమనార్హం.