YSR Fans: ఖైదీ నంబర్ 6093.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీ

ABN , First Publish Date - 2023-09-11T16:55:25+05:30 IST

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఎంత వాడీవేడీగా ఉన్నాయో అందరికీ తెలుసు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో..

YSR Fans: ఖైదీ నంబర్ 6093.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫ్లెక్సీ

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిస్థితులు ఎంత వాడీవేడీగా ఉన్నాయో అందరికీ తెలుసు. స్కిల్ డెవలప్‌మెంట్ కేసులో ఏపీ మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడికి 14 రోజుల రిమాండ్ విధించడంతో.. రాష్ట్రమంతా స్తంభించిపోయింది. ఓవైపు టీడీపీ పార్టీ వాళ్లు ఏపీ బంద్‌కు పిలుపునివ్వగా.. పోలీసు శాఖ రాష్ట్రవ్యాప్తంగా 144 సెక్షన్ విధించింది. ఇక టీడీపీ, వైసీపీ వర్గాల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకుంటున్నారు. ముఖ్యంగా.. చంద్రబాబుని అక్రమంగా అరెస్ట్ చేయడంతో, టీడీపీ వర్గాల వారు వైసీపీపై భగ్గుమంటున్నారు. కక్ష్య సాధింపు చర్యల్లో భాగంగానే.. చంద్రబాబుని అరెస్ట్ చేయించారంటూ మండిపడుతున్నారు.


ఈ నేపథ్యంలో ఏపీ సీఎం వైఎస్ జగన్‌కు సంబంధించిన ఓ ఫ్లెక్సీ ఆసక్తికరంగా మారింది. ఇందులో జగన్‌ను ఖైదీ నంబర్ 6093గా పేర్కొని.. ఆయన చేసిన తప్పులు, అవినీతి విషయాలపై ప్రశ్నలు లేవనెత్తారు. ఈ ఫ్లెక్సీకి ఇరువైపు వైఎస్ వివేకానంద, దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫోటోలను కూడా జోడించారు. ఇలాంటి కొడుకుకి జన్మనిచ్చినందుకు ఎంతగానో చింతిస్తున్నానంటూ వైఎస్ఆర్ ఫోటో కింద క్యాప్షన్ పెట్టి.. ఆయన అభిమానులే ఈ ఫ్లెక్సీకి డిజైన్ చేసినట్లుగా అందులో పేర్కొన్నారు. ‘సొంత బాబాయిని చంపిందెవరు? అక్రమ కేసులో 16 నెలలు జైలు జీవితం గడిపిన వ్యక్తి ఎవరు? సొంత తల్లిని, చెల్లిని అవమానించి పార్టీ నుంచి, రాష్ట్రం నుంచి తరిమేసిన వ్యక్తి ఎవరు’ అంటూ ప్రశ్నల వర్షం కురిపించారు.

అంతేకాదు.. 43 వేల కోట్ల అక్రమ ఆస్తులను సీబీఐ, ఈడీ చార్జీషీట్‌లో పేర్కొంది ఎవరు? ఏ1 ముద్దాయి ఎవరు? దేశ, విదేశాల పర్యటనల కోసం కోర్టు అనుమతి తీసుకోవాల్సిన వ్యక్తి ఎవరు? రాష్ట్రానికి శనిలా పట్టిన వ్యక్తి ఎవరు? రాష్ట్రాన్ని అప్పులపాలు చేసిన వ్యక్తి ఎవరు? రాష్ట్రం భ్రష్టు పట్టడానికి కారణమైన వ్యక్తి ఎవరు? అంటూ ఆ ఫ్లెక్సీలో జగన్‌ని ఖైదీగా చూపిస్తూ నిలదీశారు. ప్రస్తుతం నెట్టింట్లో చక్కర్లు కొడుతున్న ఈ ఫ్లెక్సీని ఎవరు చేయించారన్నది ఉత్కంఠగా మారింది. ఎందుకంటే.. ఈ ఫ్లెక్సీపై ఇట్లు వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఫ్యాన్స్ అని పేర్కొని ఉండటంతో, ఆయన ఫ్యాన్సే దీనిని డిజైన్ చేశారా? అనే చర్చలు జరుగుతున్నాయి. ఇదే సమయంలో.. ఇది టీడీపీ వర్గీయుల పనే అయ్యుంటుందని వైసీపీ ఫ్యాన్స్ ఆరోపిస్తున్నారు.


ఏదేమైనా.. స్కిల్ డెవలప్‌మెంట్ పథకంతో లక్షలాది మంది యువతకు దారి చూపించిన చంద్రబాబు నాయుడిని స్కామ్‌స్టర్‌గా పేర్కొనడం సిగ్గుచేటు అని టీడీపీ ఫ్యాన్స్ ఆగ్రహావేశాలకు గురవుతున్నారు. చంద్రబాబు అరెస్ట్ వెనుక వైసీపీ పాత్ర స్పష్టంగా కనిపిస్తోందని.. వైసీపీ కనుసన్నల్లోనే పోలీసులు నడుచుకుంటున్నారని ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఇదంతా వైసీపీ ఆడిస్తున్న జగన్నాటకమేనని, వచ్చే ఎన్నికల్లో జగన్ పాపం పండడం ఖాయమని, చేసిన దానికి రెండింతలు అనుభవించక తప్పదని కొందరు శాపనార్థాలు పెడుతున్నారు.

b19f1935-842c-45db-94f5-f68da477c5e2.jpg

Updated Date - 2023-09-11T17:03:41+05:30 IST