Adani: మోదీ ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలపై అదానీ కీలక వ్యాఖ్యలు
ABN , First Publish Date - 2023-01-07T21:15:51+05:30 IST
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం తనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) అధినేత గౌతమ్ అదానీ (Gautham adani) ఖండించారు.
న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ (Narendra Modi) ప్రభుత్వం తనకు అధిక ప్రాధాన్యత ఇస్తోందనే ఆరోపణలను అదానీ గ్రూప్ (Adani Group) అధినేత గౌతమ్ అదానీ (Gautham adani) ఖండించారు. పోర్టుల నుంచి విద్యుత్ వరకు విస్తరించిన తన వ్యాపారాలు కాంగ్రెస్ (Congress) రాజీవ్ గాంధీ (Rajeev Gandhi) కాలంలో మొదలయ్యాయని పునరుద్ఘాటించారు. ప్రస్తుతం 22 రాష్ట్రాలలో పనిచేస్తున్నామని, ఈ రాష్ట్రాలన్నింటిని బీజేపీ (BJP) పరిపాలించడంలేదని సమర్థించుకున్నారు. కష్టపడడమే తన విజయ రహస్యమని.. వ్యాపారం, అనుభవపూర్వకంగా ఈ సూత్రాన్నే తెలుసుకున్నానని చెప్పారు.
‘‘ ప్రతి రాష్ట్రంలో వీలైనన్ని ఎక్కువ పెట్టుబడులు పెట్టాలనుకుంటున్నాం. ప్రస్తుతం 22 రాష్ట్రాలలో కార్యకలాపాలు నిర్వహిస్తున్నందుకు అదానీ గ్రూపు నిజంగా చాలా సంతోషంగా ఉంది. ఈ రాష్ట్రాలన్నింటిలోనూ బీజేపీ అధికారంలో లేదు. లెఫ్ట్ పార్టీ పాలనలో ఉన్న కేరళ సహా ఏ రాష్ట్ర ప్రభుత్వంతోనూ మాకు సమస్యలు లేవనే అనుకుంటున్నాను. మమతా బెనర్జీ అధికారంలో ఉన్న పశ్చిమ బెంగాల్, నవీన్ పట్నాయక్ అధికారంలో ఉన్న ఒడిశా, జగన్మోహన్ రెడ్డి, కేసీఆర్ ముఖ్యమంత్రులుగా ఉన్న రాష్ట్రాలలోనూ వ్యాపారాలు చేస్తున్నాం’’ అని గౌతమ్ అదానీ అన్నారు. ఇండియా టీవీ ఛానల్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో ఈ విషయాలను ఆయన వెల్లడించారు.